|
అది 2012, జూన్ 23వ తేది. ఒక మధురమైన రోజు. సాయంత్రం ఏడు గంటల పది నిముషాలు అయ్యింది. అద్భుతమైన గాన ప్రదర్శన. ఆస్టిన్ నగరం. ఎంత ప్రసిద్ధమైన గాయనీ గాయకులైనప్పటికీ, ఎంత పెద్ద సంగీత సంస్థ అయినప్పటికీ, "Live Music Capital of the World" అయిన ఆస్టిన్ నగరంలో ఒక సంగీత కార్యక్రమం నిర్వహించక పోతే వారి ఔన్నత్యానికే ఏదో వెలితి వున్నట్టు ఉంటుంది. అందుకేనా అన్నట్టు.. ఆస్టిన్ హిందూ దేవాలయం వారి ఆధ్వర్యంలో, చిమటమ్యూజిక్ సంస్థ నిర్వహించిన ఈ తెలుగు చలన చిత్ర సంగీత గాన విభావరి ఆమనీ పాడవే హాయిగా (జనరంజని) పేరుకు తగ్గట్టు, విచ్చేసిన అందరి మన్ననలను పొంది, నిర్వాహకులకు, కళాకారులకు కూడ మంచి పేరు తీసుకు వచ్చింది.
ఆలస్యం.. పది నిముషాలు. ఆస్టిన్ నగర రహదారులు పెట్టే బాధలు అందరికీ ఎరుకే. సభికులందరూ ఒకింత అసహనంతో ఉన్నారు. హాలు అంతా అప్పటికే నిండి పోయి ఉంది. చిమటమ్యూజిక్ సంస్థ వారు అమెరికాలో ప్రప్రధంగా తలబెట్టిన బాలు జన్మదిన సంగీత విభావరి శ్రేణిలొ పాల్గొనడానికి చెన్నై నుండి ప్రత్యేకంగా విచ్చేసిన రాము మహరాజపురంగారు హాలు లోపలికి వచ్చిన వెంటనే వేదిక మీదికి వచ్చారు. "మైక్ చెక్" కూడా లేకుండానే, వక్ర తుండ మహా కాయ, సూర్య కోటి సమప్రభ, నిర్విఘ్నం కురుమే దేవ, సర్వ కార్యేషు సర్వదా.. అని ప్రార్ధిస్తూ, పనిలో పనిగా, మైక్ చెక్.. 1,2,3.. లు, లేకుండానే ఆడియో సవరణలు పూర్తి చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ కంఠం వినగానే, హాలులో అంతటా ఒకటే సంభ్రమాశ్చర్యాలు. అప్పటి వరకు.. ఎవరెవరు ఎలా, ఎన్ని సార్లు, బాలసుబ్రహ్మణ్యంగారి "లా" పాడతారు అని చెప్పినా అంతగా పట్టించుకోని వారు, దేవాలయ కార్యక్రమము కదా అని, చలన చిత్ర సంగీతం అంటే పెద్దగా అభిరుచి లేకపోయినా, కొంచెం సేపు ఉండి వద్దాములే అని వచ్చిన వారు కూడ హఠాత్తుగా ఈ గానామృతంలో లీనమయ్యారు. తర్వాత జరిగిన మూడు గంటల కార్యక్రమం.. అప్పుడే అయిపోయిందా అనిపించేలా, శ్రోతలందరినీ మంత్ర ముగ్దులను చేసి, ఆనంద పారవశ్యాలతో, చప్పట్లు, సరదాలతో గడిపేలా చేసింది. నిర్వాహకులు భోజన సదుపాయాదులను హాలులోనే ఏర్పాటు చేయడం, గాయనీ గాయకులు పాటకు, పాటకు మధ్య ఎక్కువ సమయం తీసుకోకపోవడం, స్థానిక ఆస్టిన్ గాయకులు కూడ పాడటం, వీటన్నిటికి మించి చివరి వరకు తగ్గని ప్రేక్షకుల ఉత్సాహం.. ఇవన్నీ కలిపి, 35 అద్భుత గీతాలను ఆష్టిన్ సంగీతాభిమానులకు అందించాయి.
ఇక ఆస్టిన్ వాసులకు, శారద ఆకునూరిగారు సుపరిచితులే. కార్యక్రమములో పాల్గొన్న ఒక అభిమాని మాటలలో చెప్పాలంటే.. "శ్రావ్యం" అనే పదం ఆవిడ పేరు నుంచే వచ్చిందా అనేలా రసవత్తరంగా, టెక్సాస్ తెలుగు అమ్మాయిల పేరు నిలబెట్టేలా పాడారు. సమయస్పూర్తి గా, చలోక్తులతో, రాబోయే పాట గురించి ఆలోచింపచేసే ప్రశ్నలతో, మధురమైన కంఠం తో, కార్యక్రమానికి ఒక పరిపూర్ణతను తీసుకువచ్చారు. ఈవిడ బహుముఖ ప్రజ్ఞా పాటవాలు కార్యక్రమం జరిగినంత సేపు అందరికీ అవగతమవుతూనే ఉన్నాయి. హేమంత్ భాగవతులగారితో కలిసి ఆడియో సిస్టంకి అవసరమయిన సవరణలు చేయడం, కృష్ణ కొండపల్లి గారితో కలసి పాటల జాబితా తయారు చేయడం, రావు ఆరాధ్యులగారితో కలసి కార్యక్రమ ప్రణాళిక తయారు చేయడం లాంటి ఎన్నో విషయాలలో శారదగారు చేయూత నిచ్చారు. రావుగారు అన్నట్లు.. హౌస్టన్ తెలుగు సంఘం (H-TCA) అధ్యక్షురాలిగా ఉంటూ, NATA లాంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ కూడ, ఆస్టిన్ దేవాలయ నిర్మాణానికి తన వంతు సేవ చేయాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలోని పాటల జాబితా తయారు చేయడం నా ఉద్దేశ్యం కాదు. ఇలాంటి వ్యాసాలు వ్రాయడంలో నాకు పరిచయం కూడ లేదు. అందువల్ల నాకు బాగా నచ్చిన మరియు కార్యక్రమం జరుగుతున్నప్పుడు గాని, తర్వాత గాని, ఎవరో ఒకరు నాతో మాట్లాడిన పాటల గురించి మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తాను. మొట్ట మొదటి గా భక్తి గీతాలు గురించి - అదివో అల్లదివో మొదలుకొని, అంతర్యామి, అలసితి, సొలసితి.. వరకు రాముగారు పాడిన భక్తి గీతాలకు మంచి స్పందన వచ్చింది. ఆస్టిన్ లో "శివ - విష్ణు" ఆలయ నిర్మాణం జరుగుతుంది, కాబట్టి కొందరు శివుడి గురించి కూడ ఒక పాట పాడాలి అన్నారు. అందుకు సమయస్పూర్తి గా రాముగారు సంగీతం కూడ లేకుండానే, బ్రహ్మ మురారి సురార్చిత లింగం పాడి, వేదికపైనే "శివ - విష్ణు" లను అందరికి ప్రత్యక్షం చేశారు. బాలుగారి లానే, పాటలో లీనమయి పాడటం వలన, అక్కడ ఉన్న వారందరూ కూడ భక్తి పారవశ్యంలో మునిగి తేలారు.
ఉన్నట్లుండి.. ఏ దివిలో విరిసిన పారిజాతమో, చినుకులా రాలి, ఇలాగే ఇలాగే సరాగా మాడుతూ, సిరిమల్లె పూవై... మా ఆస్టిన్ నగరంపై వాలింది. ఈ పాటలన్నిటి గురించి ఒక్కొక్క పేజి వ్రాయవచ్చు. దాశరథిగారి మనసులో మెరిసిన ప్రేమగీతమో ఏమో గాని మా మదిలో అలానే ఉండి పోయింది. వేటూరిగారి పాటలా వరదలై పొంగి కడలిలా సాగాయి. ఆరుద్రగారి పుణ్యమా అని సరాగాలాడేసరికి, ప్రేక్షకులందరూ తన్మయత్వంతో, గతంలోని మధుర స్మృతుల లోనికి వెళ్లి పోయారు. సిరిమల్లె పూవా, సిరిమల్లె పూవా.. చిన్నారి చిలకమ్మా.. పాటతో శారదగారు, ఇంకా ఎన్నో మధురమైన యుగళ గీతాలతో ఇరువురూ శ్రోతలందరినీ బాగా ఆకట్టుకున్నారు. అక్కడ ఉన్న అందరికి కూడ ఒక మంచి కార్యక్రమమునకు వచ్చామనిపించేలా చేశారు.
ఊహలకే అందని స్పందన అంటే.. వినినంతనే తనువులోని అణువణువు కరగించే... సి.నా.రె. గారి శివరంజని కాక మరేమవుతుంది ? శ్రోతలందరి చప్పట్లతో హాలు మారు మ్రోగి పోయింది. కార్యక్రమం సంగీత గగనాన ఓ జాబిల్లి అయి పోయింది. మళ్ళీ ఇదే పాట పాడమని వచ్చిన విన్నపాలను, సమయాభావంతో రాముగారు కార్యక్రమము చివరికి వాయిదా వేసినారు (కాని చాల మంచి పాటలు ఎన్నో పాడటం వల్ల చివరిలో మళ్ళీ పాడటం కుదరలేదు).
ఎంతయినా ఇళయరాజాగారి పాటలు లేకపోతే ఎలా... అనుకున్నంతలోనే, వేవేల గోపెమ్మల మువ్వ గోపాలుడు వచ్చేశాడు. చమకు చమక్కులు వచ్చేశాయి. మాటే రాని చిన్నదాని కళ్ళు ఊసులు పలికేశాయి. బాలసుబ్రహ్మణ్యంగారు మధ్యలో శ్వాస తీసుకోకుండా చేసిన ప్రయోగం. ఈపాటని ఒక చరణం తెలుగులో, ఇంకొక చరణం తమిళంలోను పాడి, "రాము మహారాజపురం" గారు, ఆస్టిన్ సంగీత పురంలో మహారాజులా నిలిచి పోయారు. బాలసుబ్రహ్మణ్యంగారే అంత బాగా పాడారు అంటే, మళ్ళీ అలానే ఇంకొకరు, కేవలం karaoke విధానంలో అంత బాగా పాడగలగడం నిజంగా చాల అరుదు. అదీ తమిళం లో కూడ రాముగారు అనర్గళంగా పాడగలగడంతో, ఆయన ఎంత పరిపక్వత కలిగిన కళాకారుడో అందరికి అర్ధమయ్యి పోయింది. ఈలోగా.. చరణ కింకిణులు, ఘల్లు ఘల్లు మన.. ఆడవే మయూరీ.. నటన మాడవే మయూరీ.. వచ్చేసింది. ఇక రావు ఆరాధ్యులగారు ఉండబట్ట లేకపోయారు, ఈ పాట చివరిలో వేదిక పైకి వచ్చి.. రాముగారితో.. "మీరు పాడుతూ వుంటే.. ఏదయినా చిన్న MP3 ప్లేయర్ అమర్చుకున్నారా అని అనుమానంగా ఉంది, నాకే కాదు, ఇంకా కొందరు కూడ నాతో ఇదే సందేహం వెలిబుచ్చారు" అని అన్నారు. దానితో రాముగారు, చివరి చరణంను సంగీతం లేకుండా పాడి వినిపించి కొందరి అనుమానాలను పటాపంచలు చేశారు.. ఈ ఒక్క ఉదాహరణ చాలు.. ఈ కార్యక్రమము ఎంత బాగా జరిగిందో తెలియడానికి.
ఏది ఏమయినా, తమిళం లో ఒక చరణం పాడే సరికి, రాముగారికి కన్నడం కూడ వచ్చునేమో అని కొందరు అభిమానులకి ఒక ఆశ కలిగింది. దానితో ప్రేక్షకులలో కొందరి కోరిక మేరకు రాముగారు మల్లెలు పూసే.. వెన్నల కాసే.. ఆణిముత్యం లాంటి ఈ పాటను మొదటి చరణం కన్నడంలోను, తర్వాతి చరణం తెలుగులోను, పాడి వినిపించారు. ఈ పాట చాలా ఇష్టమయిన నాలాంటి వారికి, ఒక చరణం తెలుగులో వినలేకపోతిమే అనిపించినా, మరి.. మన తోటి కన్నడ అభిమానుల ఆనందం ముందు.. ఇదెంత?
ఐతే కార్యక్రమం అంతా ఏదో స్క్రిప్టులా అయి పోయిందని అనుకోవద్దు. రాముగారు, శారదగారు సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది.. పాట పాడుతున్నారు. ఇంతలో అనుకోకుండా ఆడియో ఆగిపోయింది. దీనితో ఏమీ తడబడకుండా, టేక్ 1.. 2... లు సినిమాల లోనే కాదు, ఇలాంటి ప్రదర్శనలోనూ ఉంటాయి అంటూ.. సరదాగా ఉండి, మళ్ళీ ఆడియో సిస్టం సరి అవగానే, మొదటినుండి పాడిన తీరు అందరికి నచ్చింది. ఇంతలోనే వచ్చిన కన్నె పిల్లవని, కన్నులున్నవని.., వీణ వేణువైన మధురిమ విన్నావా.., శారదగారు పాడిన సిన్నీసిన్ని కోరికలడగ.. శ్రీనివాసుడు నన్నడగ.. వంటి పాటలు అందరినీ బాగా ఆకట్టుకున్నాయి.
ఒక పాటయినా దేశభక్తి గీతం లేకపోతే ఎలా? అంత లోనే.. అన్నగారి పుణ్య భూమి నా దేశం నమో నమామి.. పాట. ఈపాటలో ఇంతటి గొప్ప సందేశం ఉన్నదని, చాలా సార్లు విన్న నాలాంటి వారికి కూడ ఇంతకు ముందు తెలియదు. కాని రాముగారు దేశ భక్తితో కూడిన ఉద్రేకంతో పాడుతూ ఉంటే, ఈ పాట లోని సందేశం, దానిలో వివరించిన మన నేతలు అందరు వేదికపై ఆవిష్కరింపబడ్డారు. ఈ పాటకు మా ఆస్టిన్ గాయకులందరు కూడ వేదికపైకి వచ్చి గళం కలిపారు. హాలు అంతా లేచి నిలబడి చప్పట్లు (standing ovation) కొట్టారంటే, ఈ పాట ఎంతగా ఆకట్టుకుందో అర్ధమవుతుంది. ఇంతలోనే.. ఇళయరాజా గారి జిలిబిలి పలుకుల, చిలిపిగ పలికిన ఓ మైనా, ఓ మైనా.. వచ్చిఅందరినీ పలకరించింది. రవివర్మ కే అందని ఒకే ఒక అందానివో.. సంగతి ఏమో గాని, ఈపాట గాయని గాయకులకు ఒక పరీక్ష లాంటిదని చాల మందికి తెలుసు. మరి రాముగారు, శారదగారు చాల అద్భుతంగా పాడారు. దీని తర్వాత, రాము గారు కొన్ని పల్లవులను కూడ పాడి వినిపించారు.
ఓసారి అయినా జన్మలో.. దొరకునా.. దొరకునా ఇటువంటి సేవ.. అదీ రంగస్వామి అయ్యంగార్ గారితో సన్మానం.. అంటే మాటలా ? అయ్యంగార్ గారు వేదిక పైకి రాగానే, సమయోచితముగా రాముగారు, దొరకునా.. పల్లవి అందుకోవడం, సన్మానం కూడ ప్రత్యేకంగా జరిగింది అని చెప్పుకోవడానికి సరిపోయేలా చేసింది. తర్వాత "ఓం శతమానం భవతి..." అనే శ్లోకముతో కలిసి మాటే మంత్రము.. , అని చెప్పకనే చెపుతూ వేదాంత రహస్యంతో కూడిన ఈ వేటూరిగారి పాట ఎవరికి మాత్రం నచ్చదు?
ఔను.. మరి మన ఆస్టిన్ కళాకారులు పాడిన పాటల సంగతి ఏమిటి ? వేణుగారు పాడిన భంభం బోలే.. శంఖం మ్రోగెలే.., Don't marry.. Be Happy.. ; రవి పోతుకూచిగారు పాడిన మామా.. చందమామా, మంజునాథ్ గారు పాడిన తమిళ పాట ఇదయ మెలా.. ఒడిగిడదై.. పాటలు చాల బాగా వచ్చాయి. మరి లోకల్ టాలెంట్ కి కూడా అభిమానులుంటారు కదా... చప్పట్లే, చప్పట్లు.
అంత లోనే.. అంతర్యామి.. అలసితి.. సొలసితి ఒక అద్భుత గానాలాపన. దాని వెంటనే ఇళయరాజాగారి అద్భత స్వరకల్పన శుభ లేఖ రాసుకున్నా, ఎదలో ఎపుడో.., మరి ఒకనాటి సూపర్ డూపర్ హిట్ పాటలు గువ్వా గోరింకతో.. ఆడింది లే బొమ్మలాట.., దాని తరువాత యమహో నీ యమా యమా అందం., శ్రోతలను ఉర్రూతలూగించాయి.
అః ఆహా అనిపించేలా.. స్వరాల సంపద కనిపించేలా, గీతాంజలి లోని పాట వినిపించేలా కార్యక్రమ పతాక గీతం - ఆమని.. పాడవే.. హాయిగా... దీనితో పాటు మన కార్యక్రమం లోని చివరి పాట వచ్చేసింది. అందమైన అనుభవం లోని ఆచార్య ఆత్రేయగారు రచించిన కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి వున్నాళ్ళు.. Grand Finale పాట. ఈపాట గురించి ఒక విషయం చెప్పాలి. నేను ఈ కార్యక్రమం తర్వాతిరోజు ఒక పెద్దావిడను కలిశాను; ఆంటీ, అంకుల్ నాకు ఆస్టిన్ లో చాల సంవత్సరాల నుండి తెలుసు. ఆంటీ ఆరోగ్యం సరిగాలేక ఈ కార్యక్రమానికి రాలేదు.. కానీ అంకుల్ వచ్చారు. సరే, అంకుల్ ప్రోగ్రాం గురించి ఏమన్నారో తెలుసుకుందామని అడిగాను. ఆంటీ మాటల్లోనే.. "ఇంటికి వచ్చిన తర్వాత కూడ ఇంకా కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు... అంటూ పాడుతూ డాన్సులు చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఆయన్ని హ్యాపీగా చూశాను" అన్నారు.
భవిష్యత్తు లో ఇలాంటి కార్యక్రమములు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ, చేస్తారన్న ఉద్దేశ్యంతో, చిమట మ్యూజిక్ సంస్థ వారికి ఒక సూచన ఇవ్వదలచుకొన్నాను.
4, 5 Audio Music Trackలలో Volume ఎక్కువగాను, కొన్నింటిలో తక్కువగాను ఉంది; ఇది రికార్డింగ్ లో తేడా అయి ఉండ వచ్చు, లేదా.. Player వల్ల అయినా కావచ్చు. దీనివల్ల ఆడియో సవరణలు పాట పాటకు చేయవలసి వస్తున్నది. అలాగే గాయని, గాయకులు ఇద్దరికీ ఒకే audio settingలు సరిపోవు. కొందరికి "బేస్", Low frequency volume పెంచ వలసి వస్తే, కొందరికి High frequency volume పెంచవలసి వస్తుంది. ఈ విషయంలో కూడ గాయని, గాయకుల స్వరములకు అనుకూలంగా ఆడియో సిస్టం recommended settings ఇస్తే, దాని వల్ల ఎక్కువ సమయం మైక్ చెక్ చేయటానికి కేటాయించనక్కరలేదు. మా కార్యక్రమం లో హేమంత్ భాగవతుల వంటి గండరగండడు లాంటి ఆడియో ఇంజినీర్ వుండటం వల్ల ఏ ఇబ్బందులు లేకుండా నడిచి పోయింది. అయినప్పటికీ, ఇలాంటి విషయాలలో జాగ్రత్త తీసుకోవటం మేలు.
కార్యక్రమంలో చివరిగా, రావు ఆరాధ్యుల గారు, కృష్ణ కొండపల్లి గారు సభికులకు, కార్యకర్తలకు ధన్యవాదములు తెలిపారు. ఏ కార్యక్రమమైనా ఎంత జయప్రదంగా జరిగిందీ తెలియాలి అంటే.. కార్యకర్తలందరూ క్లీన్-అప్ చేసే వరకు ఉన్నారా, లేదా, అనే దాని బట్టి అర్ధమైపోతుంది. ఈ విషయంలో చెప్పనక్కరలేదనుకుంటా.. ఎవరినీ అడగకుండానే, పదుగురి సహాయంతో పది నిముషాలలో హాలు అంతా క్లీన్ అయి పోయింది.
శుభమస్తు. లోకాః సమస్తాః సుఖినోభవంతు.
List of All Songs:
1. Vinaayaka Slokam
2. Adivo alladivo Srihari vaasamu
3. E Divilo Virisina Paarijatamo
4. Chinukula Raali Naduluga Sagi
5. Ilaage Ilaage Saraaga Maadite
6. Sirimalle Puvva.. Sirimalle Puvva
7. Sivaranjani.. Navaragini
8. Gopemma Chetilo Gorumudda
9. SiriMalle Neeve.. Virijallu Kave
10. Rasanu Prema Lekhalenno
11. Brahma Murari Surarchita Lingam
12. Vevela Gopemmala Muvva Gopalude
13. Mate Rani Chinnadani Kallu Palike Voosulu
14. Chamaku Chamakujam Chuttuko Chuttuko
15. Veena Venuvaina Sarigama Vinnavaa
16. Charana Kinkinulu Ghallu Ghallumana
17. Kannepillavani Kannulunnavani
18. Mallelu Pooche Vennela Kache
19. Sinni Sinni Korikaladagaa.. Srinivasudu Nannaduga
20. Sande Poddula Kaada Sampangi Navvindi
21. Punya Bhoomi Naa Desam
22. Hello Guru.. Prema Kosamera Jeevitham
23. BhamBham Bole Sankham Mogele
24. Mama Chandamama Vinarava Maa Katha
25. A Tamil Song
26. Vaddura Sodara Are Pellante Nurella Mantara
27. Jilibili Palukula Chipiga Palikina Vo Maina
28. Ravi Varmake Andani Oke Oka Andanivo
29. Antaryaami Alasiti Solasiti
30. Subhalekha Rasukunna Edalo Epudo
31. Mate Manthramu.. Manase Bandhamu
32. Guvva Gorinkato Adindile Bommalata
33. Yamaho Nee Yama Yama Andam
34. Aamani Paadave Haayiga
35. Kurralloi Kurrallu.. Verrekki Vunnollu
Other links:
Bay Area concert
Athreya special in Dallas
Veturi special concert
Dallas concert
book launch
Ilayaraja bay area special
KV Mahadevan special
|