శ్రీలక్ష్మి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలింస్ బ్యానర్ పై భీమగాని సుధాకర్ గౌడ్ దర్శక నిర్మాణంలో రూపొందిన చిత్రం ఆదిత్య క్రియేటివ్ జీనియస్. లాస్ ఏంజిల్స్ లో ఇటీవల నిర్వహించిన జెన్నీ అంతర్జాతీయ చలన చిత్రోత్సావాల్లో ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ...
దర్శక నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ ``హైదరాబాద్‌లో జరిగిన చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ లో 1300 చిత్రాలు పోటీ పడితే ఆదిత్య చిత్రం ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఎంతో మంది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులచే ప్రశంసలు పొందిన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో వందశాతం వినోదపు పన్ను రాయితీని పొందింది. అంతే కాకుండా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమా స్పెషల్ నూన్ షోస్ కు అనుమతినిచ్చింది. ఈ నూన్ షోను రాష్ట్రంలో ప్రతి స్కూల్ విద్యార్థి చూసేలా చేస్తాం. ఈ స్పెషల్ షోను జూలై నుండి డిసెంబర్ వరకు ప్రదర్శిస్తాం. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఓ యువకుడు తన తెలివి తేటలతో జూనియర్ సైంటిస్ట్ అవార్డును ఎలా సొంతం చేసుకున్నాడనేదే సినిమా. అబ్దుల్ కలాంగారి స్ఫూర్తితో రూపొందిన చిత్రమిది`` అన్నారు.
ప్రేమ్ బాబు మాట్లాడుతూ ``మంచి మేసేజ్ ఉన్న మూవీ. ఇందులో టైటిల్ రోల్ పోషించే అవకాశాన్ని కల్పించిన సుధాకర్ గౌడ్‌గారికి థాంక్స్`` అన్నారు.
పద్మిని మాట్లాడుతూ ``కమర్షియల్ సినిమాలు రాజ్యమేలుతున్న ఈ సమయంలో పిల్లలు సినిమా తీసిన సుధాకర్‌గౌడ్‌గారిని అభినందిస్తున్నాను`` అన్నారు.