pizza
Celebrities At Akkineni Nageswara Rao 100th Birthday Celebrations
శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు ప్రజల హృదయాల్లో జీవించే ఉంటారు: మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు
You are at idlebrain.com > News > Functions
Follow Us


20 September 2023
Hyderabad

నటసామ్రాట్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌ లోని అన్నపూర్ణ స్టూడియోస్‌ లో నిర్వహించిన కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు, అక్కినేని కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు మహేశ్‌బాబు, నమ్రతా శిరోద్కర్, రామ్‌చరణ్‌, మోహన్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి, ఎం.ఎం. కీరవాణీ , నాని, మంచు విష్ణు, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్‌, జయసుధ, బ్రహ్మానందం, అల్లు అరవింద్‌, అశ్వినీదత్, దిల్‌ రాజు, మురళీమోహన్‌, సుబ్బరామిరెడ్డి, సి కళ్యాణ్, చినబాబు, నాగవంశీ, ఎస్ గోపాల్ రెడ్డి, వైవిఎస్ చౌదరి, జెమిని కిరణ్, గుణ్ణం గంగరాజు, అనుపమ్ ఖేర్, నాజర్ తదితరులు పాల్గొని శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారికి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు మహా నటుడు. మహా మనిషి. ఆయన అంటే నాకు చాలా అభిమానం. ఈ విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతోంది. ఆయనే నిల్చున్నారా అనేలా ఉంది. నాకు నాగేశ్వరరావు గారితో వ్యక్తిగత పరిచయం ఉంది. నేను,ఆయన అనేక విషయాలపై మాట్లాడుకునే వాళ్లం. శ్రీ నాగేశ్వరరావు గారు జీవితమంతా నటిస్తూనే ఉన్నారు. ఆఖరి రోజు వరకూ నటించిన నటుడు నాకు తెలిసి మరొకరు లేరు. సినిమా రంగంలో విలువలు పాటించిన మహావ్యక్తి నాగేశ్వరరావు గారు. అవతలి వాళ్ళు నేర్చుకోదగ్గ కొన్ని మంచి సాంప్రదాయాలు, విలువలు ఆయన మనకి చూపించారు. ఆయన చూపిన మార్గంలో ప్రయాణించడం ఆయనకు మనమిచ్చే నివాళి. ఆయన భాష, వేషం, వ్యక్తిత్వం వీటిలో కొంతైనా మనం అందిపుచ్చుకుంటే అదే ఆయనకి మనం ఇచ్చే నిజమైన నివాళి. ఆయన చక్కని తెలుగు మాట్లాడేవారు. వాళ్ల కుటుంబమంతా తెలుగులో మాట్లాడడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. విలువలకు సజీవ దర్పణం ఏఎన్నార్‌ గారు. ప్రేమ అభిమానం వాత్సలంతో ఆయన తన పిల్లలని పెంచారు. ఈ రోజు వాళ్ళని చూస్తుంటే చాలా సంతోషంగా వుంది. భాషనే కాదు వేషాన్ని కూడా సాంప్రదాయపద్దతుల్లో కాపాడుకుంటున్నారు. తెలుగు సినీ రంగానికి ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ రెండు కళ్లు అని నేను ఎప్పుడూ చెబుతుంటాను. నాగేశ్వరరావు గారు తన జీవితానికి ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకునే వారు. ఎలాంటి సినిమాలో అయినా ఒదిగిపోయేవారు. పాత్రకు సజీవ దర్పణంలా ఇమిడిపోయేవారు. నాగేశ్వరరావు గారు ఒక పెద్ద నటనా విశ్వ విద్యాలయం. ఈ రోజు పరిశ్రమలోకి వచ్చిన ప్రతివారు అందులో విద్యార్ధిలా ఆ గుణగణాలని అందిపుచ్చుకుంటే వారి జీవితాలనే మెరుగుపరుచుకోగలరు. నాగేశ్వరరావు గారి స్ఫూర్తిని పంచేలా ఈ విగ్రహం వుంది. నాగేశ్వరరావు గారు పరిపూర్ణమైన జీవితాన్ని గడిపారు. కొంతమంది జీవిత కాలంలో జీవిస్తారు. వారు లేకపోయినా కూడా జీవించే మహానుభావులు కొందరు. వారిలో నాగేశ్వరరావు గారు అగ్రగణ్యులు. నాగేశ్వరరావు గారు తెలుగు ప్రజల హృదయాల్లో జీవించే ఉంటారు. నాగేశ్వరరావు గారు జీవితాన్ని చదివారు. జీవితంతో ఆయన పోరాటం చేశారు. దాన్ని ప్రేమించారు. ఆస్వాదించారు. జీవితంలో తాను నేర్చుకున్న అంశాలను ఆచరణలో పెట్టి చూపించారు. దీన్ని మనం అలవాటు చేసుకుంటే అదే ఆయనకు మనం ఇచ్చే నివాళి. ఆయనెప్పుడూ పోరాడి ఓడిపోలేదు. దీనికి కారణం ఆయన ఆత్మ విశ్వాసం, జీవిత విలువలు తెలుసుకోవడం. నేటి తరం కూడా వీటిని తెలుసుకోవాలి. ఆయన్ని నటుడిగా ఆరాధించడమే కాదు.. ఆయన జీవితం నుంచి స్ఫూర్తిపొందాల్సింది ఎంతో ఉందని నా వ్యక్తిగత అభిప్రాయం. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి.. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుని ముందుకుసాగారు. సాంఘిక పాత్రల్లో ఆయనకు ఆయనే సాటి. ఆయన అభినయం, వాచకం, ఆయన నృత్యాలు వేటికవే ప్రత్యేకం. ఆయన ప్రతి సినిమాలో సందేశం ఉండేది. అక్కినేని గారి స్ఫూర్తితో మంచి లక్షణాలను అలవరుచుకొని తర్వాత తరానికి కూడా నేర్పించాలి. నేను సినిమా, వైద్యం, సేవా రంగాల్లో వారసత్వాన్ని ప్రోత్సహిస్తాను. ఇందులో వారసత్వం కష్టపడితే వస్తుంది. వారసత్వం కావాలంటే జవసత్వం వుండాలి. ఆ జవసత్వాలు గూర్చుకొని వారసత్వాన్ని అక్కినేని వారసులు నిలబెట్టడం చాలా సంతోషంగా వుంది. మహావ్యక్తి శ్రీ అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించే గౌరవం నాకు కల్పించినందుకు వారి కుటుంబ సభ్యులందరికీ అందరికీ ధన్యవాదాలు’’ తెలియజేశారు.

నాగార్జున మాట్లాడుతూ.. ఎవరి విగ్రహాన్ని అయినా చూస్తే ..’ఆయన గొప్ప వ్యక్తి, ఇప్పుడు మనతో లేరు’’అనే భావన చిన్నప్పటి నుంచి నా మనసులో ముద్రపడిపోయింది. విగ్రహం చూసినప్పుడల్లా నాకు అదే అనిపిస్తుంది. అందుకే నాన్న గారి విగ్రహాన్ని వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించేవరకూ చూడలేదు. ఎందుకంటే.. నాన్న గారు లేరనేది యాక్సప్ట్ చేయాలని. శిల్పి వినీత్ అద్భుతంగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు. నాన్నగారు అద్భుతమైన జీవితాన్ని గడిపారు. మీ అందరికీ నాన్న గారు అద్భుతమైన నటుడు, తరతరాలు గుర్తుపెట్టుకునే పాత్రలు చేసిన నటుడు, కోట్లమంది తెలుగు ప్రజలు ప్రేమించిన వ్యక్తి. మాకు మాత్రం నాన్న గారు మా గుండెలను నాన్న ప్రేమతో నింపారు. చిరునవ్వుతో మమ్మల్ని పిలిచే వ్యక్తి. సంతోషాన్ని, బాధను నాన్నతోనే పంచుకునే వాళ్లం. ఆయనతో కూర్చుంటే అన్ని బాధలు తీరిపోయేవి. అన్నపూర్ణ స్టూడియోస్‌ అంటే ఆయనకు చాలా ఇష్టం. నచ్చిన స్థలంలో విగ్రహం పెడితే ప్రాణప్రతిష్ట చేసినట్లు అంటారు. ఆయన ప్రాణంతో మా మధ్యలోనే నడుస్తున్నారని అనుకుంటున్నాం. ఆయన మన అందరి మనసుల్లో జీవించే వుంటారు. మా కుటుంబానికి పెద్ద దిక్కు వెంకయ్య నాయుడు గారు. ఎప్పుడు ఆహ్వానించినా ఆయన తప్పకుండా వస్తారు. ఈ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు’’ తెలిపారు.

ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. అక్కినేని నాగేశ్వరరావు గారిని చిన్నప్పటి నుంచి సినిమాల్లో చూసి ఆరాధించా. ఒకసారి ఆయనతో కలిసే అవకాశం వచ్చింది. అప్పుడు ఆయనతో ‘మిస్సమ్మ’ సినిమా ప్రస్తావన తీసుకొచ్చాను. దేవదాస్ తో పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ ఇందులో కామెడీ వేషం ఎందుకు చేశారని అడిగాను. ‘దేవదాస్ తర్వాత అన్నీ అవే తరహా పాత్రలు వస్తున్నాయి. నా ఇమేజ్ మార్చుకోకపొతే ఇబ్బంది అవుతుంది అందుకే ఆ పాత్రను చేశాను’ అని చెప్పారు. ఆయనపై ఆయనకి వున్న నమ్మకానికి చేతులు జోడించి నమస్కారం చేయాలనిపించింది. ఎన్నో విషయాలలో ఆయన మా అందరికీ ఒక స్ఫూర్తి’’ అన్నారు

మోహన్ బాబు మాట్లాడుతూ.. తిరుపతిలో చదువుకున్న రోజుల్లో నాగేశ్వరరావు గారి వంద రోజుల సినిమా వేడుక జరుగుతుందంటే ఆయన్ని చూడటానికి వెళ్లి చొక్కా చించుకున్న వ్యక్తులలో నేనూ ఒకరిని. అలాంటి నాగేశ్వరరావు గారి మరపురాని మనుషులు చిత్రానికి నేను అసోసియేట్ గా పని చేశాను. తర్వాత అన్నపూర్ణ సంస్థలో ఎన్నో సినిమాలు చేశాను. ఇది భగవంతుడి ఆశీర్వచనం. నాగేశ్వరరావు గారు ఒక గ్రంధం. మా మధ్య ఎంతో గొప్ప అనుబంధం వుంది. వారు ఎక్కడున్నా వారి ఆశీస్సులు మనకి వుంటాయి’’ అన్నారు

జయసుధ మాట్లాడుతూ.. అక్కినేని నాగేశ్వరరావు గారి తో ఎక్కువ చిత్రాలు చేయడం నా అదృష్టం. ఆయన నడిచే విశ్వవిద్యాలయం. అన్ని విషయాలపై ఆయనకు అవగాహన ఉంది. ఆయన దగ్గర క్రమశిక్షణతో పాటు ఎన్నో విషయాలు నేర్చుకున్నాను’’ అన్నారు

1నాగచైతన్య మాట్లాడుతూ.. ఏఎన్ఆర్ గారు అంటే తెలుగు చిత్ర పరిశ్రమ పెద్ద, ఓ గొప్ప నటుడు, క్లాసిక్ ఐకాన్ గా పరిచయం. ఆయన చిత్రాలు, ఆయన చేసిన ప్రయోగాలు ఈ రోజుకి కూడా ప్రేరణ కలిగించే కేస్ స్టడీగా చాలా మంది ఫిల్మ్ స్కూల్స్ లో చదువుతుంటారు, అందులో నేనూ ఒకడిని. మనం సినిమా తాతగారితో కలసి చేయడం నా అదృష్టం. అన్నపూర్ణ స్టూడియోకి వచ్చిన ప్రతి సారి కలలు కనడంలో భయపడకూదనిపిస్తుంది. ఆయన ఎప్పుడూ నాలో ఒక దీపంలా వెలుగుతూ వుంటారు. ఇక్కడ వచ్చిన అతిధులకు, అభిమానులకు పేరుపేరునా కృతజ్ఞతలు. అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడుగా పుట్టడం నా అదృష్టం’’ అన్నారు

బ్రహ్మానందం మాట్లాడుతూ.. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహావిష్కరణ చూడటమే మహాభాగ్యం. ఆయన రైతు కుటుంబంలో పుట్టి అద్భుతమైన స్థితికి చేరుకున్నారు.. ఇది సామాన్య విషయం కాదు. అక్కినేని గారు కారణజన్ముడు. ప్రపంచంలోని ప్రతి తెలుగువారు, నటులకు అక్కినేని నాగేశ్వరరావు గారి జీవితం గొప్ప పాఠం. అక్కినేని గారు స్వయంశిల్పి. ఈ పోటీ ప్రపంచంలో తనని తాను గొప్పగా మలుచుకున్న మహామనిషి. కళాకారులకు అక్కినేని గారు గొప్పవరం. ఆయన అద్భుతమైన క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. దేశంలో అక్కినేనికి వచ్చిన అవార్డులు ఎవరికీ రాలేదు. ఆయన పొందిన సన్మానాలు ఏ నటుడూ పొందలేదు. ఎలాంటి పాత్రలు చేసిన అందులో ఒదిగిపోయారు’. నా చిన్నతనంలో ఆయన్ని అనుకరిస్తూ కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేశాను. ఆయన గొప్ప స్నేహశీలి. ఆయన మహానట వృక్షం’’ అన్నారు.


Photo Gallery

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved