|

21 May 2019
Hyderabad
పీపుల్ స్టార్ ఆర్.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించి, నటించిన సినిమా `మార్కెట్లో ప్రజాస్వామ్యం`. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ``నాలుగు రోజుల క్రితం `సైరా` సెట్‌కు వచ్చి నన్ను నారాయణమూర్తిగారు నన్ను పిలిచారు. ఆయన నన్ను ఎప్పుడూ పిలవలేదు. ఆయన సినిమాలైనా, ఆయన ఫంక్షన్లైనా ఆయన తరహాలోనే జరుగుతాయి. నన్ను పిలవాలన్న భావం రావడం చాలా ఆనందంగా అనిపించింది. నేను అభిమానించే మిత్రుడు . ఫంక్షన్‌కి రావడం చాలా ఆనందంగా ఉంది. 1978లో నేను `ప్రాణం ఖరీదు` చేస్తున్నప్పుడు నూతన్ ప్రసాద్‌కి పేపర్ అందించే కుర్రాడిగా నటించారు ఆర్.నారాయణమూర్తి. అప్పుడే తొలిసారి మేం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత పాండిబజార్‌లో అప్పుడప్పుడూ కలిసి మాట్లాడుకునేవాళ్లం. ఆ తర్వాత నుంచీ మా పరిచయం కొనసాగుతోంది. నారాయణమూర్తిది ప్యూర్ హార్ట్. అతనికి సినిమా అంటే చాలా ప్రేమ. సినిమాను విపరీతంగా ఇష్టపడతాడు. ఈ రోజున ఆయన ఈ స్థాయికి రావడానికి కారణం ఆయన కష్టాన్ని నమ్ముకోవడమే. దీక్షతో, అలుపెరగకుండా పోరాడారు నారాయణమూర్తి. ఆయన దీక్షా, పట్టుదల స్ఫూర్తి మంతమైనవి. కమర్షియల్ వైపు మొగ్గుచూపకుండా, కమ్యూనిజం భావజాలంతో సినిమాలు చేశారు. కమిటెడ్ మనిషి. అభ్యుదయవాది. 30 సినిమాలుగా ఆయన అలాగే కమిట్‌మెంట్‌తో కొనసాగుతున్నారు. ఎవరైనా కమర్షియల్ వైపు ఆకర్షితులవుతారు. కానీ `టెంపర్` సినిమాలో పూరి జగన్నాథ్... నారాయణమూర్తికి అవకాశం ఇచ్చినా ఆయన సున్నితంగా వెళ్లి `నో` చెప్పి వచ్చారు. ఆర్.నారాయణమూర్తి ఆహార్యం కూడా నాకు చాలా ఇష్టం. అప్పటి నారాయణమూర్తి, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. మనిషి ఎంత ఎదిగినా, ఎంత సాధించినా సరే, ఆయన మానసికంగా మారలేదు. బిగినింగ్ డేస్‌లో ఎలా ఉన్నాడో, ఇప్పటికీ అలాగే ఉన్నాడు. ఇలాంటి వ్యక్తులు సినిమా ఇండస్ట్రీలో వెతికినా దొరకడు. అరుదైన వ్యక్తి నారాయణమూర్తి. సినిమానే ఆయన పెళ్లి చేసుకున్నారు. సినిమాలతోనే ఆయన జీవిస్తున్నారు. `మార్కెట్లో ప్రజాస్వామ్యం` ఆయనకు పెద్ద హిట్ కావాలి. అస్తవ్యస్తంగా మారుతున్న రాజకీయాలను ఎలా రక్షించుకోవాలన్న కాన్సెప్ట్ తో తెరకెక్కించి ఉంటారని భావిస్తున్నాను`` అని చెప్పారు.
కొరటాల శివ మాట్లాడుతూ ``ఆర్.నారాయణమూర్తిగారి ఫంక్షన్‌కి రావడం చాలా ఆనందంగా ఉంది. చిరంజీవిగారి సినిమాలను ఎంత ఆసక్తిగా చూసేవాడినో, ఆర్.నారాయణమూర్తి సినిమాలను కూడా ఇష్టపడేవాడిని`` అని అన్నారు.
ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ``హీరో డ్యాన్సులు చేసి పేరు తెచ్చుకోగలడని నిరూపించిన వాళ్లల్లో చిరంజీవిగారు ఒకరు. ఆయన మెగాస్టార్ అనే పేరు తెచ్చుకోవడం వెనుక ఎంత కృషి ఉంది. పిలవగానే నా ఫంక్షన్‌కి వచ్చినందుకు ధన్యవాదాలు. మార్కెట్లో ప్రజాస్వామ్యం సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది`` అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సుద్ధాల అశోక్ తేజ, గోరటి వెంకన్న, వందేమాతరం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



|
Photo
Gallery (photos by G Narasaiah) |
|
|
|
|
|