pizza
Naga Shaurya & Niharika's Oka Manasu music launch
‘ఒక మనసు’ ఆడియో విడుదల
ou are at idlebrain.com > News > Functions
Follow Us

18 May 2016
Hyderabad

నాగశౌర్య, నిహారిక జంటగా టీవీ9 సమర్పణలో మధుర ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై రామరాజు దర్శకత్వంలో మధురశ్రీధర్ రెడ్డి, అభినయ్.ఎ, డా.కృష్ణాభట్ట నిర్మిస్తోన్న చిత్రం ‘ఒక మనసు’. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్ లో జరిగింది.

ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, రామ్ చరణ్ తేజ్, స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, సాయిధరమ్ తేజ్, నాగశౌర్య, నిహారిక, వరుణ్ తేజ్, నాగబాబు, సునీల్ కశ్యప్, తమ్మారెడ్డి భరద్వాజ, రామజోగయ్యశాస్త్రి, రఘురామ కృష్ణంరాజు, బి.గోపాల్, శ్యాంప్రసాద్ రెడ్డి, అవసరాల శ్రీనివాస్, శ్రీధర్, రవిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

బిగ్ సీడీ, ఆడియో సీడీలను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆవిష్కరించారు. తొలి ఆడియో సీడీని నాగబాబు అందుకున్నారు.

అల్లుఅరవింద్ మాట్లాడుతూ ‘’సాధారణంగా తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ దొరకరు. కానీ నాగబాబు ధైర్యం చేసి అమ్మాయి నిహారికను హీరోయిన్ ను చేశారు. నాగశౌర్యకు, దర్శక నిర్మాతలు సహా అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ ‘’దర్శక నిర్మాతలు ఈ సబ్జెక్ట్ లో నిహారిక బావుంటుందని నమ్మి తీసుకున్నందుకు వారికి థాంక్స్. నిహాకి ఎలాంటి కోస్టార్ దొరుకుతాడోనని అనుకున్నాను. నిహాకంటే మంచి అందగాడైన హీరో నాగశౌర్య దొరికాడు. శౌర్య స్వచ్చమైన తెలుగు అబ్బాయిలా ఉంటాడు. మ్యూజిక్ చాలా వినసొంపుగా ఉంది. మా ఫ్యామిలీలో నుండి ఇండస్ట్రీలోకి వచ్చిన నిహారికను ఆహ్వానిస్తున్నాం’’ అన్నారు.

నాగబాబు మాట్లాడుతూ ‘’రామరాజుగారు, నిర్మాతలు మంచి కథను మా అమ్మాయి నిహారికకు ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. టీవీ9వంటి చానెల్ సినిమా రంగంలోకి రావడం మంచి పరిణామం. అందరూ హీరోలున్న ఫ్యామిలీ నుండి మా అమ్మాయి హీరోయిన్ గా వస్తే వారందరూ ఎంకరేజ్ చేశారు. సునీల్ కశ్యప్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. టీం అంతటికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ మాట్లాడుతూ ‘’నిహారికను మేం నిహా అని పిలుస్తుంటాం. తనకు ఆల్ ది బెస్ట్. నాగశౌర్య, నిహారికకు, దర్శక నిర్మాతలకు థాంక్స్. ఇక పవర్ స్టార్ గురించి నేను మాట్లాడాలంటే, ఈ మధ్య నేను వచ్చిన వేడుకల్లో పవర్ స్టార్ గురించి మాట్లాడకపోవడానికి కారణం పనవ్ స్టార్ గారి కొంతమంది అభిమానులు. ఒక గ్రూపులా ఏర్పడి పవర్ స్టార్ అని అరిచి ఇబ్బంది పెడతున్నారు. దాని వల్ల నేను మాట్లాడలేకపోతున్నాను. చాలా ఆర్టిస్టులకు స్టేజ్ పై వచ్చినప్పుడు పర్సనల్ ఫీలింగ్స్ చెప్పుకోవాలనిపిస్తుంది. కానీ పవర్ స్టార్ అని అరిచినప్పుడు ఏదో మెకానికల్ గా ఆయన గురించి మాట్లాడి వెళ్లిపోతున్నారంతే. అభిమానులు అరిస్తే తప్పు లేదు కానీ మాట్లాడేవారిని డిస్టబ్ చేసేంతలా ఉండకూడదు. ఒక డైరెక్టర్ వందరోజులు కష్టపడి, కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసినప్పుడు ఆయనకు సినిమా గురించి నాలుగు మాటలు చెప్పుకోవాలని ఉంటుంది. ఆయనకు మాట్లాడే అవకాశం ఇస్తే సినిమా గురించి కాకుండా పవర్ స్టార్ గురించి అద్భుతంగా మాట్లాడేవారు. కానీ ఆ అవకాశం ఇవ్వలేదు. అది తప్పు బ్రదర్. అలాగే బయటి ఆడియో ఫంక్షన్స్ కు వెళ్లినప్పుడు అక్కడ కూడా పవర్ స్టార్ అని అరుస్తున్నారు. అది ఇంకా పెద్ద తప్పు. ఆ హీరో ఫ్యాన్స్ కు కూడా మనం గౌరవం ఇవ్వాలి. అలా గౌరవం ఇస్తే మన గౌరవం ఇంకా పెరుగుతుంది. ఆ ఫంక్షన్ లో ఓ వ్యక్తి మా హీరో ఫంక్షన్ లో మీ హీరో గోలేంటి అని అన్నాడు. నాకు అబ్బా ..అనిపించింది. నన్నంటే మిమ్మల్ని అన్నట్లే కదా, కాబట్టి బయటి ఫంక్షన్స్ లో అలా బిహేవ్ చేయవద్దు. పవర్ స్టార్ గారు కొన్ని వందలసార్లు నేను ఈ స్థానంలో ఇలా నిలబడి ఉన్నానంటే అన్నయ్య చిరంజీవిగారే కారణమని కొన్ని వందలసార్లు అన్నారు. కానీ అటువంటి చిరంజీవిగారే మాట్లాడుతున్నప్పుడు పవర్ స్టార్ అని అరుస్తుంటారు. చిరంజీవిగారు కూడా ఫ్యాన్స్ గోలను ఎంజాయ్ చేస్తారు. కానీ చిరంజీవిగారిలాంటి వ్యక్తి తరువాత మాట మాట్లాడలేనంత అరవడం చాలా తప్పు. ఈరోజు ఇలా అందరూ అరవడానికి, మాట్లాడటానికి ప్లాట్ ఫాం ఇచ్చిన వ్యక్తి చిరంజీవిగారు మాట్లాడుతున్నప్పుడు గుచ్చి గుచ్చి అరవడం చాలా పెద్ద తప్పు. ఆయన పబ్లిక్ లో, మీడియా ముందు హార్ట్ చేయడంతో నేను హార్ట్ అయ్యాను. అందుకనే నేను కొంత మంది అభిమానులు ఎంత అరిచినా పవర్ స్టార్ గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను. అందుకు కారణం మీరే. నేను ఎన్ని వందలసార్లు, ఎన్ని సినిమాలో ఆయనపై ఇష్టాన్ని చెప్పలేదు. నేను ఇవ్వాళ కొత్తగా చెప్పాలా. నాకు చిరంజీవిగారి తర్వాత పబ్లిక్ ఫంక్షన్స్ లో సపోర్ట్ చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్ గారు. ఆయన గురించి ఇప్పుడు కూడా పొగడగలను. కానీ వెన్న పూసినట్లు మాట్లాడటం నచ్చదు. నేను కాంట్రవర్సీ ఎందుకని అవాడ్ చేశాను కానీ, అవాడ్ చేయడం వల్ల కాంట్రవర్సీ వస్తుందనుకోలేదు. ఈ టైంలో నేను జాగ్రత్తగా ఉండాలి. నేను ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అయిపోతుంది. కొంత మంది అభిమానులు తప్పు చేస్తున్నారని తెలియజెప్పడానికి నాపై వేసుకున్న నెగటివ్ ఫోర్స్. చిరంజీవిగారికోసం, మిగతా అందరికోసం చేసిన ప్రయత్నమిది. పబ్లిక్ ఫంక్షన్స్ లో నా ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ కు చెప్పేది ఒకటే. అల్లరి తగ్గించండి. సోషల్ మీడియాలో మనపై మనం రాసుకున్న వార్తలు చీప్ గా ఉన్నాయి. వీటి వల్ల చిరంజీవిగారికి మాట వస్తుందంటే నేను ఒప్పుకోను. మన ఫ్యాన్సే రచ్చ చేసుకున్నారు. నన్ను అపార్థం చేసుకోరని నమ్ముతున్నాను’’ అన్నారు.

సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ‘’నిహారిక, నాగశౌర్య, రామరాజు సహా టీంకు అభినందనలు’’ అన్నారు.

వరుణ్ తేజ్ మాట్లాడుతూ ‘’మధుర శ్రీధర్ గారికి, టీవీ9 కి ఆల్ ది బెస్ట్. సునీల్ కశ్యప్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. రామరాజు వంటి మంచి డైరెక్టర్ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. నాగశౌర్య మంచి నటుడు. నిహారిక డాక్టర్, ఐఎఎస్ ఆఫీసర్ అవుతానని కథలు చెప్పి మాతో పాటు తెలుగు ఇండస్ట్రీలో చేరింది. తనను చూస్తుంటే ఆనందంగా ఉంది. ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

దర్శకుడు రామరాజు మాట్లాడుతూ ‘’ఈ సినిమా చేయడం అనుభవం కంటే అనుభూతి. అనుభవాన్ని పంచగలం కానీ అనుభవాన్ని పంచలేం. యూనిట్ లోని ప్రతి ఒక్కకి కష్టమీ చిత్రం. మల్లెల తీరంలో సిరిమల్లె చెట్లు సినిమా తర్వాత సినిమా చేయకూడదని అనుకున్నాను. కానీ చంద్రమోహన్ గారు, వెంకట బ్రదర్స్, యారాడ బీచ్ ఇచ్చిన సీతారామరాజుగారు, బ్రహ్మా, అలాగే నిర్మాతలైన రవిప్రకాష్ గారు, డా.కృష్ణాభట్, మూర్తిగారు, శ్రీధర్ రెడ్డి నా కథను అర్థం చేసుకుని సపోర్ట్ చేసుకున్నారు. శ్రీధర్ రెడ్డిగారైతే నన్ను తండ్రిలా చూసుకున్నారు. అలాగే నిహారిక, శౌర్యలకు థాంక్స్. సునీల్ కశ్యప్ ఈ సినిమాకు నాకేం కావాలో అదిచ్చాడు. అలాగే రామజోగయ్యశాస్త్రిగారు, భాస్కరభట్లగారు చాలా మంచి సాహిత్యానందించారు. నిహాకు కథ చెప్పగానే తను చేయడానికి ఒప్పుకున్నందుకు థాంక్స్. వందమంది టెక్నిషియన్స్, ఇంకేవరున్న నాగశౌర్య, నిహారికలకు మాత్రమే ఈ సినిమా పరంగా రుణపడి ఉంటాను. నిహాను ఈ చిత్రంలో నేను అంతే గౌరవంతో, అభిమానంతో చూపించాను. శౌర్య, నిహారికలు దర్శకుడిగా నన్ను గర్వంగా ఫీలయ్యేలా చేశారు. నిహా మనకు మరో సావిత్రిలా మిగలాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

నాగశౌర్య మాట్లాడుతూ ‘’ఈ సినిమా ఎలా స్టార్టయ్యిందో తెలియదు, ఎలా ఎండయ్యిందో తెలియదు. చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అయ్యింది. మంచి స్క్రిప్ట్. రామరాజుగారు నెరేట్ చేసిన విధానమే మమ్మల్ని అక్కడి వరకు తీసుకెళ్లింది. ఈ క్రెడిట్ రామరాజుగారికే చెందుతుంది. సునీల్ కశ్యప్, రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్లగారు మంచి ఆల్బమ్ ఇచ్చారు. నిహారికతో నటించడం హ్యపీగా ఉంది. నేను సావిత్రిగారి గురించి విన్నాను, తర్వాత సౌందర్య, అనుష్క గారంటే ఇష్టం. ఈ జనరేషన్ లో లేడీ ఓరియెంటెడ్ రోల్స్ చేయగల హీరోయిన్ నిహారిక మాత్రమే అవుతుందని చెప్పగలను. సాగర సంగమం, గీతాంజలి చిత్రాలు ఎలా నిలిచిపోయాయో, ఒక మనసు చిత్రం అలా నిలిచిపోతుంది. మేం గర్వంగా ఫీలయ్యే చిత్రమవుతుంది. దర్శక నిర్మాతలకు, టీం అంతటికీ థాంక్స్’’ అన్నారు.

నిహారిక మాట్లాడుతూ ‘’డాడీ(పెద్దనాన్న చిరంజీవి) ముళ్లపై నడిచి మాకు తారు రోడ్డు వేశారని నాన్నగారు అంటుంటారు. ఆ రోడ్దుపై అన్నలందరూ నడిచారు. నేను ఇప్పుడిప్పుడే అడుగులు వేయడం ప్రారంభించాను. ఈ సినిమా చూసి డాడీ చాలా ప్రౌడ్ గా ఫీలవుతారు. నా ఫ్యామిలీ ఇచ్చే సపోర్ట్ ను నేను మరచిపోలేను. సునీల్ కశ్యప్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. రామరాజుగారు దర్శకత్వంలో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఒక మనసు సినిమాకు ముందు, తర్వాత అనేలా నిలిచిపోతుంది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. నాగశౌర్య మంచి కోస్టార్. అమ్మ ప్రేమంత స్వచ్చంగా సినిమా చేశాం. అందరూ మనస్ఫూర్తిగా ఆదరిస్తారని నమ్ముతున్నాం’’ అన్నారు.

మధర శ్రీధర్ మాట్లాడుతూ ‘’మన తెలుగు సినిమాల్లో ఉన్న లవ్ స్టోరీస్ అన్నీ వేరే సినిమా రంగానికి చెందిన దర్శకులు చేసినవే. కానీ రామరాజుగారు డైరెక్ట్ చేసిన ఒక మనసు తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్యూర్ లవ్ స్టోరీ’’ అన్నారు.

ఎల్.ఎ.టాకీస్ అల్లూరి సూర్యప్రసాద్ మాట్లాడుతూ ‘’ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్. సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

నిర్మాత డా.కృష్ణా భట్ట మాట్లాడుతూ ‘’రామరాజుగారి వల్లే ఈ సినిమాలో నేను భాగమయ్యాను. ఒక మనసు ట్రైలర్స్, సాంగ్స్ ను చూశాను. చాలా బావున్నాయి, తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నాం’’ అన్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ‘’మధుర శ్రీధర్ మంచి సినిమాలు నిర్మించే నిర్మాత. నిహారిక తన కష్టపడి, యాంకరింగ్ చేసుకుంది. ఈ సినిమాతో తనకు మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ రామరాజును అభినందిస్తున్నాను’’ అన్నారు.

బి.గోపాల్ మాట్లాడుతూ ‘’చాలా అందమైన టైటిల్. నాగబాబు అమ్మాయి అయిన నిహారికను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. టీవీలో తను పెద్ద స్టార్ అయ్యింది. నిహారిక మనింట్లో అమ్మాయిలా యాక్ట్ చేస్తుంటుంది. తను పెద్ద హీరోయిన్ గా ఎదగాలి. నాగశౌర్యకు మంచి పేరు రావాలి. రామరాజు, మధురశ్రీధర్ సహా యూనిట్ కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

శ్యాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ‘’నిహారిక చిన్నప్పట్నుంచి బాగా పరిచయం. మెగా బ్రదర్స్ ముద్దుల కూతురు. ముగ్గురిలోని బెస్ట్ క్వాలిటీస్ లో పుణికి పుచ్చుకుంది. చిరంజీవిగారిలోని ఎక్స్ ట్రార్డినరీ స్టైల్, నాన్నగారిలోని అమాయకత్వం, పవన్ కల్యాణ్ లోని ఇన్ టెన్ సిటీ, తింగరతనం నిహారికలో ఉంది. తను అందలాలను చేరుకుంటుంది’’ అన్నారు.

రవిప్రకాష్ మాట్లాడుతూ ‘’సినిమా నిర్మాణంలో మేం భాగస్వామ్యులు కావడం ఆనందంగా ఉంది. రామరాజుగారు సినిమాను బాగా ప్రేమించిన వ్యక్తి. తెలుగు ఇంటర్నెట్ వరల్డ్ ను నిహారిక ఏలుతుంది. ఆమెకు, నాగశౌర్యకు, ఎంటైర్ టీంకు అభినందనలు’’ అన్నారు.

సునీల్ కశ్యప్ మాట్లాడుతూ ‘’మెగా ఫ్యామిలీలో రెండో సినిమా చేస్తున్నాను. ఈ సినిమా చేయడం ఎంజాయ్ చేస్తున్నాను. ఇలాంటి మంచి సినిమాకు నన్ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నందుకు రామరాజుగారికి, నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు.

 

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved