లక్కీ మీడియా సంస్థ మొదలై దశాబ్దమైంది. మంచి కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్‌గా మారాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభించారుబెక్కంవేణుగోపాల్. జనవరి25కి దశాబ్దకాలం పూర్తయ్యింది. ఈ సంస్థ స్థాపకుడు బెక్కం వేణుగోపాల్ ఈరోజు పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. దర్శకుడు త్రినాథరావు బర్త్ డే కూడా ఇదే రోజు కావడం విశేషం. వీరి కాంబినేషన్ లో ఇటీవల విడుదలైన సినిమా చూపిస్తమావ పెద్ద సక్సెస్ సాధించింది. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ లో సినిమా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా....
బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ‘’ఇటీవల మా లక్కీ మీడియా నిర్మాణంలో పది వసంతాలను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మా బ్యానర్ లో నేను..నా బాయ్ ఫ్రెండ్స్ సినిమా నిర్మాణంలో ఉంది. ఈ చిత్రానికి ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గతేడాది త్రినాథరావుతో కలిసి చేసిన సినిమా చూపిస్తమావ పెద్ద విజయాన్ని అందుకోవడం ఆనందంగా ఉంది. త్రినాథరావు మంచి ఫ్యాషన్ ఉన్న దర్శకుడు. మరోసారి నేను, త్రినాథరావు మరో సినిమా కోసం పనిచేయబోతున్నాం. అయితే ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తారు. నేను కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తాను. త్రినాథరావు దర్శకత్వంలో నాని హీరోగా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు.
త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ‘’నాకు, వేణుగోపాల్ గారికి మధ్య మంచి అవగాహన ఉంది. ఇద్దరి పుట్టినరోజులు ఓకే రోజు కావడం ఆనందంగా ఉంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బెక్కం వేణుగోపాల్ గారే అవకాశాలు ఇచ్చారు. మా కాంబినేషన్ లో రెండు సినిమాలు సక్సెస్ అయ్యాయి. హ్యాట్రిక్ మూవీకి రంగం సిద్ధమవుతుంది. స్క్రిప్ట్ రెడీ అవుతుంది. అలాగే వేణుగోపాల్ గారు కో ప్రొడ్యూసర్ గా, దిల్ రాజుగారు నిర్మాతగా ఓ సినిమా చేయబోతున్నాం. ఈ సినిమాలో నాని హీరోగా నటిస్తారు. మంచి స్క్రిప్ట్, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. జూలై, ఆగస్టు నుండి సినిమా ప్రారంభమవుతుంది’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న భాస్కర్ తదితరులు బెక్కం వేణుగోపాల్, త్రినాథరావు నక్కినలకు శుభాకాంక్షలు తెలియజేశారు.