మధుమిత, శివ, వరుణ్ కీలక పాత్రల్లో నటించిన సినిమా లజ్జ. నరసింహ నంది దర్శకత్వం వహించారు. శ్రీ లక్ష్మి నరసింహ సినిమా పతాకంపై రూపొందుతోంది.. బూచేపల్లి తిరుపతి రెడ్డి నిర్మాత. ఈ సినిమా లోగో విడుదల సోమవారం హైదరాబాద్‌లోని చాంబర్‌లో జరిగింది. తుమ్మల ప్రసన్నకుమార్ లోగోను ఆవిష్కరించారు.
టి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ``1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం వంటి సినిమాలతో జాతీయ స్థాయిలో అవార్డులు పొందిన దర్శకుడు నరసింహ నంది. ఆయన తెరకెక్కిస్తున్న మరో వైవిధ్యమైన సినిమా ఇది. ఇటువంటి దర్శకుడిని కనుక కాపాడుకోగలిగితే పరిశ్రమలో మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంది. భార్య యొక్క ఇన్నర్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయని చెప్పే సినిమా ఇది`` అని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ``ఇది రొమాంటిక్ సినిమా. ప్రతి అమ్మాయి పెళ్లైన తర్వాత తన భర్త ప్రేమ తనకే సొంతం కావాలని అనుకుంటుంది. అలాంటిది భర్త దగ్గర్నుంచి ప్రేమను పొందలేకపోయినప్పుడు ఆ అమ్మాయి ఎలాంటి మానసిక పరిస్థితులకు లోనవుతుంది? తనను భర్త అర్థం చేసుకోవడం లేదని తెలిసినప్పుడు ఎలా ఫీలవుతుంది? తీరా తన మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే ఎలా భావిస్తుంది? వంటి అంశాలతో తీసిన కథ ఇది. నటి మధుమిత చాలా అద్భుతంగా నటించింది. మంచి సినిమా చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాను చేశాం. మధుమిత లేకపోతే ఈ సినిమాను చేసేవాడిని కాదు. ఈ చిత్రంలో అన్నీ ఎమోషన్స్ ఉన్నాయి`` అని తెలిపారు.
నిర్మాత మాట్లాడుతూ ``కథ చెప్పగానే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. దర్శకుడు చక్కగా చిత్రీకరించారు. సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది`` అని అన్నారు.
మధుమిత మాట్లాడుతూ ``ఈ సినిమాలో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర చేశాను. మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమా ఇది. సుశీల అనే మెచ్యూర్డ్ క్యారక్టర్ లో నటించాను`` అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో సుక్కు, శివ, మహంతి, పి.ఎల్.కె.రెడ్డి, రఫి తదితరులు పాల్గొన్నారు.