18 March 2016
Hyderabad
ముత్తు మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆర్.సుమనా, ముత్తు, శిల్ప ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న తెలంగాణ వీరనారి చిత్రం చాకలి ఐలమ్మ. లక్ష్మి నిఖిల్ దర్శకత్వంలో పగడాల ముత్తు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్ లో ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి తెలంగాణ హోం మినిష్టర్ నాయిని నరసింహ రెడ్డి క్లాప్ కొట్టగా, దర్శకుడు లక్ష్మి నిఖిల్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....
తెలంగాణ హోం మినిష్టర్ నాయిని నరసింహరెడ్డి మాట్లాడుతూ ‘’తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జీవితగాథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణలో అణగారిన వర్గాల వారి కోసం పోరాటం చేసిన చాకలి ఐలమ్మ చాలా మందికి స్ఫూర్తి దాయకం. ఇలాంటి చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు దర్శక నిర్మాతలను, యూనిట్ సభ్యులను అభినందిస్తున్నాను’’ అన్నారు.
దర్శకుడు లక్ష్మి నిఖిల్ మాట్లాడుతూ ‘’ముందు ఈ సినిమాను డాక్యుమెంటరీగా తీయాలనుకున్నాం. అయితే ప్రభుత్వం వారు అండగా నిలబడటంతో ఫీచర్ ఫిలిం తీస్తున్నాం. రాబోయే తరాల వారికి తెలంగాణ పోరాట యోధుల చరిత్రను తెలియజేసే ప్రయత్నానికి ప్రభుత్వం అండగా నిలబడటం ఎంతో ఆనందంగా ఉంది. ఈ నెల 21నుండి రెగ్యులర్ చిత్రీకరణ ఉంటుంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ తదితర ప్రాంతాల్లో సినిమాను చిత్రీకిరించి సమ్మర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.
నిర్మాత పగడాల ముత్తు మాట్లాడుతూ ‘’ఈ చిత్రానికి ప్రభుత్వం సహకారం అందించడం ఆనందంగా ఉంది’’ అన్నారు.
శిల్ప, అంజి, ప్రమోద్, సాయి శ్రీ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈచిత్రానికి ఆర్ట్: చౌదరి, మ్యూజిక్: సాగర్, రచన: మహమద్, సహ నిర్మాతలు: ఐ.అనూష, హనుమంతరావు, దర్శకత్వం: లక్ష్మి.