pizza
Mr. K movie launch
You are at idlebrain.com > News > Functions
Follow Us

29 July 2015
Hyderabad

"మిస్టర్ కె" ప్రారంభోత్సవ వేడుక విశేషాలు

ఇద్దరు యువకులు పోలీసులుగా ఎందుకు మరారు. పోలీస్ వ్యవస్థపై వాళ్ళకు కోపం ఎందుకు..? పోలీసుల గొప్పతనం, త్యాగం ఎలా గుర్తించారు..? అనే కథాంశంతో సమాజ క్షేమం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన యదార్థ ఘటన ఆధారంగా రూపొందుతున్న చిత్రం "మిస్టర్ కె". 'ఖాకి సత్తా' అనేది ఉపశీర్షిక. కౌశిక్ బాబు టైటిల్ పాత్రను పోషిస్తున్నారు. సంపత్ రెడ్డి మరొక కథానాయకుడు. శశాంక్ వోలేటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ది వేవ్స్ క్రియేషన్స్ పతాకంపై లోకేష్ ఆకుల, దివ్యా సునీత రాజ్, ఎస్.చిట్టిబాబు, వి.రామచంద్ర మూర్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. పూజా కార్యక్రమాల అనంతరం ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణరాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు క్లాప్ ఇవ్వగా, ఏషియన్ థియేటర్స్ అధినేత నారాయణ దాస్ కెమెరా స్విచాన్ చేశారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్, ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు గౌరవ దర్శకత్వం వహించారు. పలువురు ఐపిఎస్ అధికారులు ప్రారంభోత్సవ వేడుకకు హాజరయి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

టి.హరీష్ రావు మాట్లాడుతూ.. "రాష్ట్రం కోసం, దేశం కోసం నల్గొండలో పోలీస్ అధికారి సిద్దయ్య ప్రాణాలు అర్పించాడు. అతని కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్న చిత్రం "మిస్టర్ కె". వాస్తవాలకు దగ్గరగా ఇలాంటి చిత్రాలు రావలసిన అవసరం ఎంతైనా ఉంది. పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ.. సామాజిక పరివర్తన కోసం తమవంతు కృషి చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు త్యాగాలను, మంచితనాన్ని చూపించే చిత్రాలు రావాలి. చిత్రాలంటే లవ్, క్రైమ్, థ్రిల్లర్ కాదు. తెలుగు ముద్దుబిడ్డ కౌశిక్ బాబు కేరళలో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. కౌశిక్, సంపత్ రెడ్డి నటిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకోవాలి. తెలుగు చిత్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సహాలను అందిస్తుంది. తెలుగుతో పాటు హిందీ సినిమాల చిత్రీకరణకు హైదరాబాద్ అనువైన నగరం. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది" అన్నారు.

డి.సురేష్ బాబు మాట్లాడుతూ.. "పోలీస్ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలి. కొత్త దర్శకుడు శశాంక్ వోలేటి, కౌశిక్ బాబు, మిస్టర్ కె చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు" అన్నారు.

విజయబాబు మాట్లాడుతూ... "హృదయాలను కదిలించే వాస్తవిక సంఘటనలతో మనసును స్పృశించే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. మన సమాజంలో పోలిసులంటే వ్యతిరేక భావన ఉంది. వాళ్ళు చేసే త్యాగాలను మరొక కోణంలో ఆవిష్కరించే చిత్రమిది. సెంటిమెంట్ పుష్కలంగా ఉంటుంది. ప్రధమార్థం సరదాగా సాగుతుంది. నటనలో కౌశిక్, సంపత్ రెడ్డి పోటీపడే విధంగా ఉంటుంది. ప్రజల కోసం నల్గొండలో సిద్దయ్య తన ప్రాణాలు అర్పించాడు. ఆ పాత్రలో పోసాని కృష్ణమురళి నటిస్తున్నారు. పాత్ర వినగానే డేట్స్ ఖాళీ లేకపోయినా అడ్జస్ట్ చేసుకుని నటిస్తానని చెప్పారు. మంచి చిత్రాన్ని ప్రేక్షకులను అందించాలనే ఉద్దేశంతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మాతలు ముందడుగు వేస్తున్నారు. తెలుగు, మలయాళ భాషల్లో నిర్మిస్తున్నారు" అన్నారు.

దర్శకుడు శశాంక్ వోలేటి మాట్లాడుతూ.. "కామెడీతో నవ్వించి, సెంటిమెంట్ తో ఏడిపించి, యాక్షన్ తో అరిపించే కథ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కిస్తున్నాం" అన్నారు.

కౌశిక్ బాబు మాట్లాడుతూ.. "మంచి విలువలతో కూడిన కథ. సిద్దయ్య ఏవిధంగా ప్రాణత్యాగం చేశాడో తెలుసు. అతనితో పాటు పోలీసుల గొప్పతనం తెలియజేసే విధంగా చిత్రం ఉంటుంది. ఖాకి సత్తా తగ్గకుండా మా పాత్రలను దర్శకుడు డిజైన్ చేశారు. మమ్మల్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన హరీష్ రావు, సురేష్ బాబు, ఇతర ఐపిఎస్ అధికారులకు కృతజ్ఞతలు. ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని ఆదరిస్తారని కోరుతున్నాను" అన్నారు.

ఈ చిత్రానికి కథ : శారదా విజయబాబు, మాటలు : మోహన్ దీక్షిత్, కళా దర్శకుడు : మోహన్ జెల్లా, ఎడిటర్ : వెంకట రమణ, సంగీతం : నాగ్ శ్రీవత్స, ఛాయాగ్రహణం : దీపక్ డి మీనన్, నిర్మాతలు : లోకేష్ ఆకుల, దివ్యా సునీత రాజ్, ఎస్.చిట్టిబాబు, వి.రామచంద్ర మూర్తి. కథనం - దర్శకత్వం : శశాంక్ వోలేటి.

 

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved