అష్టచమ్మా, స్వామిరారా, కార్తికేయ చిత్రాలతో తనకంటూ ఓ క్రేజ్ ను సంపాదించుకున్న కలర్స్ స్వాతి తొలిసారిగా నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'త్రిపుర'. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం రూపొందుతోంది. క్రేజీ మీడియా పతాకంపై స్వాతి అండ్ పావని సమర్పణలో రాజ కిరణ్ దర్శకత్వంలో ఎ.చినబాబు, ఎం.రాజశేఖర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుక సోమవారం హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయంలో వైభవంగా జరిగింది. 2014 సంవత్సరంలో పెద్ద విజయం సాధించిన 'గీతాంజలి' కాంబినేషన్ కోనవెంకట్, దర్శకుడు రాజ్ కిరణ్ 2015 లో కూడా త్రిపుర అనే సినిమాతో రిపీట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోయపాటి శ్రీను, సంతోష్ శ్రీనివాస్, అలీ, సత్యం రాజేష్ పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. స్క్రిప్ట్ ను దర్శకుడు బోయపాటి, అలీ, కోనవెంకట్ ముగ్గురు కలిసి 'త్రిపుర' టీం కు అందించారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజ కిరణ్ మాట్లాడుతూ "మళ్ళీ కోనవెంకట్ తో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. 'త్రిపుర' గా స్వాతి పాత్ర ఈ చిత్రానికి హైలైట్ గా ఉంటుంది. ఈ చిత్రంలో 'అందాలరాక్షసి' ఫేమ్ హీరో నవీన్ చంద్ర ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. 'గీతాంజలి'కి మించిన ఉత్కంట భరితంగా ఈ చిత్రం ఉంటుంది" తెలిపారు.
కోన వెంకట్ మాట్లాడుతూ "ఈ సినిమా స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా దర్శకుడు యొక్క ప్రతిభా పాటవాలు నాకు చాలా బాగా తెలుసు. కథ విషయానికి వస్తే కథ విన్న వెంటనే ఎగ్జైట్ మెంట్ కు గురయ్యాను" అని తెలిపారు.
నిర్మాత చినబాబు మాట్లాడుతూ "ఇంత సక్సెస్ ఫుల్ టీమ్ తో కలిసి మా బ్యానర్ లో పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నాం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 15 నుండి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మరియు ఫిలింసెంటర్ లో షూటింగ్ కార్యక్రమం జరుపుకుంటుంది. ఈ కార్యక్రమంలో రచయిత వెలిగొండ శ్రీనివాస్, మాటల రచయిత రాజా, నిర్మాత ఎం.వి.వి. సత్యనారాయణ, ప్రత్యేక పాత్రలో నటిస్తున్న నటుడు నవీన్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రవికుమార్ సానా, సంగీతం: కామ్రాన్, ఎడిటింగ్: ఉపేంద్ర, ఫైట్స్: విజయ్, డాన్స్: బాబా భాస్కర్, కో-డైరెక్టర్: ఎమ్.వి.ఎస్.మురళి.