
01 June 2026
Hyderabad
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా 'పెద్ది' దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. అద్భుతమైన గ్లింప్స్, చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు. ఈ నేపధ్యంలో చిత్ర బృందం విజయవాడలో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. భారీ సంఖ్యలో అభిమానులు, ప్రేక్షకులు హాజరైన ఈ వేడుక కన్నుల పండగలా అత్యద్భుతంగా జరిగింది. ఏఆర్ రెహ్మాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులుని మెస్మరైజ్ చేసింది.
గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. నమస్తే విజయవాడ ఇది ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌లా లేదు, ఒక సక్సెస్ మీట్‌లా అనిపిస్తోంది. ఇంత ప్రేమ, ఆదరణ చూపిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎంపీ కేసినేని చిన్ని గారికి, మంత్రి కందుల దుర్గేష్ గారికి, అలాగే ఈ గ్రాండ్ ఈవెంట్ విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మీ అందరి ఎనర్జీని నేను ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను. విజయవాడ మా కుటుంబానికి ఎంతో లక్కీ. నాన్నగారి ‘ఇంద్ర’, ‘ఖైదీ నంబర్ 150’ సహా ఎన్నో విజయోత్సవాలు ఇక్కడే జరిగాయి. ఈ వేడుకకు వచ్చిన అన్నలు, తమ్ముళ్లు, అక్కలు, చెల్లెళ్లు, అలాగే టీవీల్లో చూస్తున్న మా అభిమానులందరికీ ధన్యవాదాలు. కొన్ని కథలు విన్నప్పుడు నచ్చుతాయి, కొన్ని ఆశ్చర్యపరుస్తాయి. కానీ ‘పెద్ది’ కథ విన్నప్పుడు మాత్రం నా మనసుకు చాలా దగ్గరగా అనిపించింది. మా నాన్నగారు చెప్పినట్టు ఇలాంటి కథలు పది సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తాయి. అలాంటి కథను తీసుకొచ్చిన సుకుమార్ గారికి, బుచ్చిబాబు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ‘పెద్ది’ సినిమా నా మూవీ జర్నీలో టాప్ సినిమాగా నిలిస్తుంది. ఈ సినిమా నన్ను వ్యక్తిగతంగా కూడా ఎంతో మార్చింది. ఒక నటుడిగా నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది. బుచ్చిబాబు గారు దీన్ని కేవలం సినిమా కథలా కాకుండా, ఒక మనిషి జీవిత ప్రయాణంలా చెప్పారు. ఇది ఎగిసిపడే వ్యక్తి కథ కాదు... పడిపోయి మళ్లీ లేచి నిలబడే వ్యక్తి కథ. ఈ సినిమా కోసం నేను చాలా కష్టపడ్డానని అందరూ అంటున్నారు. కానీ ఇలాంటి సినిమా కోసం కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం? ఇది కష్టంతో చేసిన పని కాదు, ఇష్టంతో చేసిన పని. ప్రతిరోజూ ఉదయం లేచి జిమ్ చేసి, షూటింగ్‌కు వెళ్లాలని అనిపించిన అరుదైన సినిమాల్లో ఇది ఒకటి. ‘మగధీర’, ‘రంగస్థలం’, ఆర్ఆర్ఆర్ సినిమాల సమయంలో నాకు ఎలా అనిపించిందో, మళ్లీ ‘పెద్ది’ సమయంలో కూడా అలాగే అనిపించింది. బుచ్చిబాబు భవిష్యత్తులో భారతదేశంలోని టాప్ డైరెక్టర్లలో ఆయన పేరు తప్పకుండా ఉంటుంది. ఇలాంటి సినిమాలు చేయడానికి నాకు బలం ఇచ్చేది మీరే. అభిమానులు, ప్రేక్షకులు కోసం చేయి విరగ్గొట్టుకోవడమే కాదు, రక్తం చిందించి కూడా పని చేస్తాను. చిరంజీవి గారి కొడుకుగా పుట్టడం, పవన్ కళ్యాణ్ బాబాయ్ గా ఉన్నందుకు.. నాకు తెలిసింది సినిమా మాత్రమే. నేను ఉన్నంత కాలం మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాను... ఇది రాసిపెట్టుకోండి. రత్నవేలు గారితో ఇది నా నాలుగో సినిమా. ఆయన నన్ను అద్భుతంగా ప్రజెంట్ చేశారు. అవినాష్ కొల్లా గారికి, నవీన్ నూలి గారికి, మా టెక్నీషియన్స్ అందరికీ ధన్యవాదాలు. నిర్మాత సతీష్ కిలారు గారు తొలి సినిమా చేస్తున్న నిర్మాతలా కాకుండా, యాభై సినిమాలు చేసిన నిర్మాతలా వ్యవహరించారు. ప్రతి క్షణం మా వెంట ఉండి ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు నడిపించారు. మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారికి, రవి గారికి ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఏఆర్ రెహమాన్ గారు ‘పెద్ది’కి బిగ్గెస్ట్ పిల్లర్. మేము రెండున్నర సంవత్సరాలు, దాదాపు 280 రోజుల కష్టం పెట్టిన ఈ సినిమాకు ఆయన సంగీతంతో ప్రాణం పోశారు. ఆయన అంకితభావం అసాధారణం. జాన్వీ కపూర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీదేవి గారు ఎక్కడ ఉన్నా, జాన్వీని చూసి గర్వపడుతుంటారు. ఆమె శ్రీదేవి గారికంటే కూడా పెద్ద స్టార్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక ఆట ఓడిపోతే అది ఆటగాడి ఓటమి మాత్రమే కాదు, ఒక దేశం ఓడిపోయినట్టే.‘పెద్ది’ ఆడలేదు... పోరాడాడు. మీ అందరి ఆశీస్సులు, కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ‘పెద్ది’ ఆత్మగౌరవాన్ని మీరు మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని కోరుతున్నాను. జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి. మీ కుటుంబ సభ్యులందరినీ అడిగానని చెప్పండి. అందరికీ ధన్యవాదాలు.
డైరెక్టర్ బుచ్చిబాబు సానా మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ఈ వేడుకకు విచ్చేసిన మంత్రులకు, ఎంపీ కేసినేని చిన్ని గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వారి ప్రోత్సాహంతో ఈ వేడుక అద్భుతంగా జరుగుతోంది. ఉప్పెన సినిమా చేసిన ఐదేళ్ల తర్వాత పెద్ది చేశాను. ఉప్పెనకు జాతీయ అవార్డు వచ్చింది, నిర్మాతలకు మంచి విజయాన్ని తీసుకొచ్చింది. ‘ఇంత సమయం ఎందుకు తీసుకున్నావు?’ అని చాలామంది అడిగారు. నేను పెద్ది కోసం తీసుకున్నాను. ఉప్పెన కథను కూడా విజయవాడలోనే రాసుకున్నాను. కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయి. నన్ను రామ్ చరణ్ గారి దగ్గర కూర్చోబెట్టిన మా గురువుగారు సుకుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఉప్పెనను నాకు మెగాస్టార్ చిరంజీవి గారు ఇస్తే, పెద్దిని రామ్ చరణ్ గారు ఇచ్చారు. ఈ కథ చెప్పిన తర్వాత చరణ్ గారు ఒక్క కరెక్షన్ కూడా చెప్పలేదు. అంత నమ్మకం ఉంచారు. పెద్ది ఒక కమర్షియల్ సినిమా లాగానే కనిపించినా, లోపల బలమైన ఎమోషనల్ డ్రామా ఉంటుంది. ఒక ఆటగాడి ప్రయాణం, అతని ఆత్మగౌరవం, గుర్తింపు కోసం చేసే పోరాటం, తన విజయం తన చుట్టూ ఉన్న వారి జీవితాలను ఎలా మారుస్తుందనే కథ ఇది. పెద్ది ఎగిసిపడే మనిషి కథ కాదు... పడిపోయి మళ్లీ లేచే మనిషి కథ. నేను ఇప్పటివరకు ఈ సినిమాను దాదాపు వందసార్లు చూసుంటాను. చూసిన ప్రతిసారీ ఎమోషనల్ అవుతాను. కళ్లల్లో నీళ్లు వస్తాయి. సినిమా చూసిన వాళ్లందరూ కూడా అదే చెబుతున్నారు. జూన్ 4న ఈ సినిమా విడుదల అవుతోంది. కుటుంబ సమేతంగా వెళ్లి చూడండి. మీ పిల్లలను కూడా తీసుకెళ్లండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందుకు సాగే ఒక యువకుడి స్ఫూర్తిదాయకమైన ప్రయాణం ఇది. పెద్ది సాధించే విజయం ఎలా ఉంటుందో థియేటర్‌లో చూస్తారు. నన్ను నమ్మి ఈ సినిమా అవకాశం ఇచ్చిన రామ్ చరణ్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. జాన్వీ కపూర్ గారు ఈ సినిమాకు మరింత అందాన్ని తీసుకొచ్చారు. ఆమె నటనలో కూడా ఒక ప్రత్యేకమైన హీరోయిజం ఉంటుంది. ఇంత పెద్ద సినిమాలో నన్ను నమ్మి, ఒక్కరోజు కూడా ఒత్తిడి చేయకుండా పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన నిర్మాత సతీష్ కిలారు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. జగపతి బాబు గారు చేసిన అప్పలసూరి పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఆ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు వచ్చినప్పుడు ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తిరగడం ఖాయం. రత్నవేలు గారు నేను రాసుకున్న ప్రతి అక్షరానికి ప్రాణం పోశారు. రామ్ చరణ్ గారి నటనను ఆయన అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు. ఏఆర్ రెహమాన్ గారు అందించిన ప్రతి పాట ఇప్పటికే హిట్ అయింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా స్టైలిష్‌గా, మాస్‌గా ఉంటుంది. రెహమాన్ గారితో పని చేయడం నా చిరకాల కోరిక. ఆ కోరిక ఈ సినిమాతో నెరవేరడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరోసారి రామ్ చరణ్ గారికి కృతజ్ఞతలు. జూన్ 4న కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లి పెద్దిని చూడండి. మీరు పెద్దిని ప్రేమిస్తారు, ఇష్టపడతారు. రామ్ చరణ్ గారి నటన చూస్తుంటే మీ కళ్లలో నీళ్లు రావడం ఖాయం. జూన్ 4న థియేటర్లలో కలుద్దాం...ఎమోషనల్ అవుదాం.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత వై. రవిశంకర్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. మేమంతా విజయవాడలో పుట్టి పెరిగిన వాళ్లమే. ఈ వేడుక చూస్తుంటే చిరంజీవి గారి విజేత, గ్యాంగ్ లీడర్, ఇంద్ర సినిమాల విజయోత్సవాలు గుర్తుకొస్తున్నాయి. వాటిని తలదన్నే స్థాయిలో చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ గారి సినిమా వేడుక విజయవాడలో జరగడం చాలా ఆనందంగా ఉంది. పెద్ది సినిమా మొత్తం ఒక ఈవెంట్‌లా ఉంటుంది. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు మైమరచిపోతారు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇందులోని ఎన్నో అద్భుతమైన పాత్రలు గుర్తుండిపోతాయి. ముఖ్యంగా రామ్ చరణ్ గారి పెద్ది పాత్ర జీవితాంతం ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను దాదాపు వందమందికి చూపించాం. అందరూ ఎక్స్‌ట్రార్డినరీగా ఉందని చెప్పారు. ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొడుతుందని మేము బలంగా నమ్ముతున్నాం. చిరంజీవి గారి లెగసీని ముందుకు తీసుకెళ్లాలంటే ఎంతో కష్టపడాలి. రామ్ చరణ్ గారు అదే అంకితభావంతో పని చేస్తున్నారు. సినిమా కోసం ఎంత కష్టమైనా భరించడానికి సిద్ధంగా ఉంటారు. రంగస్థలంలో ఆయన పెర్ఫార్మెన్స్ చూశారు. కానీ పెద్దిలో దానికంటే మరో స్థాయిలో కనిపిస్తారు. ఏఆర్ రెహమాన్ గారు ఒక లెజెండ్. ఇప్పటికే ఆస్కార్ అవార్డుతో భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు. అలాగే జగపతి బాబు గారికి, జాన్వీ కపూర్ గారికి, రత్నవేలు గారికి, మా టీమ్‌లోని ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. బుచ్చిబాబుతో మేము ఉప్పెన సినిమా చేశాం. అప్పటి నుంచి ఆయన ఎదుగుదల చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. దర్శకుడిగా ఆయన మరో స్థాయికి వెళ్లారు. ఈ వేడుకకు సహకరించిన ఎంపీ కేసినేని చిన్ని గారికి, మంత్రి కందుల దుర్గేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రులకు పోలీస్ శాఖకు, అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాను అవార్డు కమిటీలు చూసిన తర్వాత ఒకటి కాదు, రెండేసి అవార్డులు ఇవ్వాల్సి వస్తుంది. అంత అద్భుతంగా రామ్ చరణ్ గారు నటించారు. ప్రతి ఫ్రేమ్ మైండ్‌బ్లోయింగ్‌గా ఉంటుంది. ఇది ఒక ఎక్స్‌ట్రార్డినరీ బ్లాక్‌బస్టర్ సినిమా. జూన్ 4న థియేటర్లలో కలుద్దాం.
నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ: హాయ్ విజయవాడ... థాంక్యూ సో మచ్! మాది పెనమలూరు. నేను విజయవాడలోనే చదువుకున్నాను. నా తొలి సినిమా వేడుకను ఈ ఊర్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందుకు కారణం రామ్ చరణ్ గారు. మా డైరెక్టర్ బుచ్చిబాబు గారు కనిపించడానికి చిన్నగా ఉంటారు కానీ, తనకు కావాల్సినది సాధించే వరకు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. ఈ సినిమాను మీరందరూ కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లి చూడండి. ఇది ఒక గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. మాకు సహకరించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారికి, మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. విజయవాడలో ఏఆర్ రెహమాన్ గారు ప్రత్యక్షంగా ప్రదర్శన ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఆయన అందించిన సంగీతం, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులందరికీ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. రామ్ చరణ్ గారు నాకు ఒక సోదరుడు, స్నేహితుడు, శ్రేయోభిలాషి. ఈ సినిమా కోసం ఆయన రెండేళ్లకు పైగా ఎంతో కష్టపడి పనిచేశారు. షూటింగ్ సమయంలో ఆయనకు దాదాపు మూడు సార్లు గాయాలయ్యాయి. ఇప్పటికీ ఆయన చేతికి కట్టుతోనే కనిపిస్తున్నారు. ఆయన కష్టం ఎప్పటికీ వృథా కాదు. ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ ప్రాజెక్ట్‌ను అడుగడుగునా వెన్నంటి ఉండి నడిపించిన వ్యక్తి రామ్ చరణ్ గారే. ఈ సినిమా ప్రేక్షకులను మూడు గంటల పాటు మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. జూన్ 3న ప్రీమియర్స్, జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. అందరూ తప్పకుండా థియేటర్లలో చూసి ఆదరించండి. ఒక చిన్న ఊరి నుంచి వచ్చిన వ్యక్తి దేశవ్యాప్తంగా ఎలా ఎదిగాడు? తన గుర్తింపు కోసం ఎలా పోరాడాడు? అనేది ‘పెద్ది’లో చూస్తారు. ఇది ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే కథ. అన్ని హీరోల అభిమానులు ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆనందిస్తారని నమ్ముతున్నాను. మాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. విజయవాడలో ఇంత అద్భుతమైన వేడుకను నిర్వహిస్తున్న నిర్మాత సతీష్ గారికి, సుకుమార్ గారికి, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు, దర్శకుడు బుచ్చిబాబు గారికి, రామ్ చరణ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఈ కార్యక్రమాన్ని ఘన విజయవంతం చేసిన మెగా అభిమానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ‘పెద్ది’ ఒక అద్భుతమైన దృశ్యకావ్యం. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎంత గొప్పగా రూపొందిందో అర్థమవుతోంది. ఇలాంటి సినిమాల్లో నటించడం అంత సులువు కాదు. అలాంటి పాత్రలను పోషించాలంటే కఠోర శ్రమ, క్రమశిక్షణ, అంకితభావం అవసరం. రామ్ చరణ్ గారు ఈ సినిమా కోసం అదే స్థాయిలో కష్టపడ్డారు. ఈ చిత్రంలోని పాటలన్నీ ఇప్పటికే సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. ఏఆర్ రెహమాన్ గారి సంగీతం ప్రేక్షకులందరినీ కట్టిపడేస్తోంది. అలాగే జగపతి బాబు గారి నటన ఈ సినిమాకు మరింత వన్నె తెచ్చింది. బుచ్చిబాబు గారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం కలిగిన దర్శకుడు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు విజయవంతమైతే వందలాది కుటుంబాలు నిలబడతాయి. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోనే నేను ఈరోజు మంత్రిగా మీ ముందున్నాను. పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా చిత్ర బృందానికి, అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉంది. తెలుగు సినిమా మరింత ఉన్నత స్థాయికి ఎదగడానికి అవసరమైన సహకారం అందిస్తూనే ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన చిత్ర బృందానికి మరోసారి ధన్యవాదాలు. ‘పెద్ది’ ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడలో మెగా అభిమానులతో కలిసి ఒక ఎలక్ట్రిఫైయింగ్ వాతావరణం నెలకొంది. అందుకు కారణమైన రామ్ చరణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. విజయవాడకు తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో శతదినోత్సవ వేడుకలు ఇక్కడ జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి గారి ‘ఇంద్ర’ సిల్వర్ జూబ్లీ వేడుక కూడా విజయవాడలోనే జరిగింది. అలాగే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ‘తొలిప్రేమ’, ‘బద్రి’, ‘ఖుషి’ వంటి ఎన్నో చిత్రాలను విజయవాడ, తెలుగు ప్రజలు ఘన విజయాలు అందించారు. రామ్ చరణ్ గారు తండ్రికి మించిన తనయుడు, బాబాయ్‌కు మించిన అబ్బాయి. ‘పెద్ది’ సినిమా ఇప్పటికే సూపర్ హిట్ అయిపోయింది. విజయవాడ నుంచి ఈ సినిమాకు భారీ రికార్డులను బహుమతిగా ఇస్తామని మాటిస్తున్నాం. ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్లతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించబోతోంది. రామ్ చరణ్ గారు కష్టం, క్రమశిక్షణకు ప్రతిరూపం. అందుకే ఈరోజు గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగారు. యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని జీవితంలో కష్టపడి ఎదగాలని కోరుకుంటున్నాను. ఇలాంటి గొప్ప వేడుకలు మరిన్ని విజయవాడలో, ఆంధ్రప్రదేశ్‌లో జరగాలని కోరుకుంటున్నాను. జగపతి బాబు గారు మా విజయవాడ వ్యక్తి. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ చూస్తుంటే హీరోలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ రోజు ఇద్దరు ఆస్కార్ విజేతలు — రామ్ చరణ్ గారు, ఏఆర్ రెహమాన్ గారు విజయవాడకు రావడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ‘పెద్ది’కి అద్భుతమైన విజయాన్ని అందించి, మళ్లీ రామ్ చరణ్ గారిని విజయవాడకు తీసుకురావాలని కోరుకుంటున్నాను.
జాన్వీ కపూర్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ‘పెద్ది’ సినిమా చూసిన తర్వాత కూడా ఇదే ప్రేమతో థియేటర్ల నుంచి బయటకు వస్తారని ఆశిస్తున్నాను. మీ ప్రేమ, అభిమానమే మమ్మల్ని మరింత కష్టపడి పనిచేసేలాచేస్తుంది. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. మన జీవితానికి అర్థం ఏమిటి? మన గుర్తింపు అంటే ఏమిటి? అనే అంశాలను ‘పెద్ది’ చాలా అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. నా జీవితానికి అర్థం ప్రేక్షకులను అలరించడం, నటించడం, మంచి సినిమాలు చేయడం. నా గుర్తింపు కూడా మీ అందరితో ఎంతో బలంగా ముడిపడి ఉంది. మీరు నాపై చూపించిన ప్రేమకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని. మీరందరూ గర్వపడేలా మరిన్ని మంచి పనులు చేస్తానని మాటిస్తున్నాను. ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను. రామ్ చరణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన అద్భుతమైన నటుడు, గొప్ప వ్యక్తి. జై చరణ్! బుచ్చిబాబు గారు నాకు తెలిసిన అత్యంత ప్యాషనేట్ దర్శకుల్లో ఒకరు. రెహమాన్ గారు ఒక లెజెండ్. మా నిర్మాత సతీష్ గారు ఈ మొత్తం ప్రయాణాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ‘పెద్ది’ ఒక గ్రాండ్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్. మీరు తప్పకుండా బిగ్ స్క్రీన్‌పై ఈ సినిమాను ఆస్వాదిస్తారు. ఈసారి నన్ను మీరు ఇంకొంచెం ఎక్కువగాచూస్తారు.
దివ్యేందు శర్మ మాట్లాడుతూ: విజయవాడ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ‘పెద్ది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం రావడానికి కారణమైన దర్శకుడు బుచ్చిబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన అద్భుతమైన ప్రతిభ, నాపై చూపించిన ప్రేమ, నమ్మకం వల్లే నేను ఈ సినిమాలో భాగమయ్యాను. తెలుగు ప్రేక్షకులు నాపై ఎంతో ప్రేమ, ఆదరణ చూపించారు. మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అద్భుతమైన వ్యక్తి. ఆయనతో కలిసి నటించడం ఒక గొప్ప అనుభవం. ఆయనతో నటిచండం అంత ఈజీ కాదు. కానీ సెట్స్‌లో నాకు ఎంతో కంఫర్ట్‌గా ఉండేలా చూసుకున్నారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. మా నిర్మాత సతీష్ గారికి కూడా ధన్యవాదాలు. ఆయన ఈ సినిమాను ఎంతో ప్రేమతో, అంకితభావంతో నిర్మించారు. ఇక్కడ అభిమానుల స్పందన చూస్తుంటే చాలా ఎనర్జిటిక్‌గా ఉంది. ఇదే ఎనర్జీని మీరు జూన్ 4న థియేటర్లలో ‘పెద్ది’ చూస్తున్నప్పుడు కూడా చూపిస్తారని నమ్ముతున్నాను. ఒక వ్యక్తి తన గుర్తింపు కోసం చేసే పోరాటమే ‘పెద్ది’. అందరికీ కనెక్ట్ అయ్యే ఎమోషనల్ జర్నీ. ఈ చిత్రం గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాను. మీ అందరూ ‘పెద్ది’ సినిమాను చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
జగపతి బాబు మాట్లాడుతూ: నమస్తే విజయవాడ. నేను 1962లో బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్న సరోజినీ దేవి హాస్పిటల్‌లో పుట్టాను. అప్పట్లో అది బెజవాడ. నేను మీతో పాటు పెరిగిన వాడిని. మీతో పాటే ఉండిపోయేవాడిని. నేను ఇక్కడ పుట్టానన్నది ఎంత వాస్తవమో, ‘పెద్ది’ సినిమా ఇండస్ట్రీకి, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు పెద్ద దిక్కుగా నిలుస్తుందనేది కూడా అంతే వాస్తవం. ఇది మరో స్థాయికి వెళ్లిపోయే సినిమా. తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం ఊపిరి పీల్చుకునే సమయం వచ్చింది. అందరి ఆకలి, దాహం తీర్చే సినిమా ఇది. నాకు ఈ సినిమాలో అద్భుతమైన పాత్ర దక్కింది. ‘పెద్ది’లో నేను చేసిన అప్పలసూరి పాత్ర నా కెరీర్‌లోనే బెస్ట్ క్యారెక్టర్‌గా నిలుస్తుంది. రామ్ చరణ్ గారి మెగా పవర్ ఏంటో ఈ సినిమాలో చూస్తారు. సినిమాలో ఆయన చేసిన ప్రతి షాట్ ఒక సిక్సర్‌లా ఉంటుంది. చరణ్ కేవలం విజయవంతమైన నటుడే కాదు, గొప్ప మనిషి కూడా. ఆయన మంచి మనసు, ఆప్యాయత ఆయన మాటల్లో, చూపుల్లో, పలకరింపులో కనిపిస్తాయి. బుచ్చిబాబు అన్‌లిమిటెడ్ టాలెంట్ ఉన్న దర్శకుడు. ప్రతి పాత్రను ఆయన డిజైన్ చేసిన తీరు అద్భుతంగా ఉంటుంది. రెహమాన్ గారికి నా సెల్యూట్. ఆయన సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. జాన్వీ కపూర్ కూడా అద్భుతంగా నటించింది. రామ్ చరణ్ గారు, సతీష్ గారు నిర్మాణ సమయంలో ప్రతిరోజూ సెట్స్‌కి వచ్చి మాతో కలిసి ఉండేవారు. ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఇలాంటి అద్భుతమైన టీమ్‌తో కలిసి పనిచేయడం నా జీవితంలో ఒక గొప్ప అనుభవం. ‘పెద్ది’ నా కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్‌గా, ‘అప్పలసూరి’ నా కెరీర్‌లో బెస్ట్ క్యారెక్టర్‌గా నిలుస్తుందని గర్వంగా చెబుతున్నాను.
డీవోపీ రత్నవేలు మాట్లాడుతూ: విజయవాడ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంత ప్రేమగా స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు. సతీష్ గారు అద్భుతమైన నిర్మాత. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ను నిర్మించడం మామూలు విషయం కాదు. ఆయన ప్రతిరోజూ చిరునవ్వుతో, ఎంతో పాజిటివ్‌గా ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లారు. ఆయన మరెన్నో గొప్ప సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నా టీమ్ మొత్తానికి ప్రత్యేక కృతజ్ఞతలు. నాకు ఇంత అద్భుతమైన కథ, స్క్రిప్ట్ ఇచ్చిన బుచ్చిబాబు గారికి థాంక్యూ. ‘పెద్ది’ ప్రేక్షకులకు ఒక గొప్ప సినీ అనుభూతిని ఇవ్వాలనే ఉద్దేశంతో రూపొందించిన సినిమా. ప్రతి ఫ్రేమ్ ఒక వేడుకలా ఉంటుంది. ప్రతి ఫ్రేమ్‌లో రామ్ చరణ్ గారి అంకితభావం, పాత్ర పట్ల ఆయన చూపించిన కమిట్‌మెంట్ కనిపిస్తుంది. అలాగే ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులు సినిమాను సెలబ్రేట్ చేసుకునేలా ఉంటుంది. జూన్ 4న మీ అందరూ థియేటర్లలో ఈ విజువల్ స్పెక్టాకిల్‌ను ఎక్స్ పీరియన్స్ చేస్తారని ఆశిస్తున్నాను.
లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ మాట్లాడుతూ: తెలుగు సినిమాను చూసి ప్రపంచం మొత్తం ఉలిక్కిపడే రోజు, రామ్ చరణ్ రూపంలో తెరపై ఒక అద్భుతాన్ని చూసి హాలీవుడ్ సైతం ఆశ్చర్యపోయే రోజు జూన్ 4న. ఆ రోజు ‘పెద్ది’ బల్లగుద్ది మరీ రికార్డులను బద్దలు కొట్టి తన సత్తా చాటుకునే రోజు. ఆ రోజు నుంచి మీ జోరు, హుషారును ఎవ్వరూ ఆపలేరు. ఈ సినిమాలో నేను రాసిన పాటలకు వందల మిలియన్ల వ్యూస్ ఇచ్చి ఆదరించిన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒక గేయరచయితగా ఇంతకంటే పెద్ద విజయం మరొకటి ఉండదు. ఈ సినిమాలో రామ్ చరణ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. గాయాలపాలైనా షూటింగ్‌లో పాల్గొనడం, పాత్ర కోసం చూపిన అంకితభావం, మల్లయోధుడిలా తన శరీరాన్ని మలుచుకున్న తీరు గురించి వింటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. రామాయణం ఎంతకాలం నిలివుంటుందో ‘పెద్ది’ కథ కూడా అంతకాలం ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుంది. పదేళ్లకు ఒకసారి వచ్చే అరుదైన సినిమాగా ఇది నిలుస్తుందని బల్లగుద్ది మరీ చెబుతున్నాను.


