13 December 2015
Hyderabad
నాకు కథే ముఖ్యం! - రాధామోహన్
అధినేత, ఏమైంది ఈ వేళ, ప్యార్ మే పడిపోయానే, తాజాగా బెంగాల్ టైగర్ సినిమాలను నిర్మించిన నిర్మాత రాధామోహన్. ఆయన తెరకెక్కించిన బెంగాల్ టైగర్ ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాలో రవితేజ హీరో. సంపత్ నంది దర్శకత్వం వహించారు. ఈ సినిమా గురించి రాధామోహన్ ఆదివారం విలేకరులతో మాట్లాడారు.
రాధామోహన్ మాట్లాడుతూ ``బెంగాల్ టైగర్‌కు అన్ని చోట్ల నుంచి మంచి స్పందన వస్తోంది. కథ డిమాండ్ చేసిన దాన్ని బట్టి మేం ఖర్చుపెట్టాం. సినిమా మొదలు పెట్టేటప్పుడు ఏ రేంజ్ హిట్ అవుతుందో ఊహించుకోలేదు. సినిమా ఆడేదాన్ని బట్టి హిట్ రేంజ్ తెలుస్తుందని నా నమ్మకం. జనవరి వరకు మన సినిమా తప్పకుండా ఆడుతుందని డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మా సినిమా అక్టోబర్‌లోనే సిద్ధమైంది. కాకపోతే సరైన రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేశాం. ముందు అఖిల్ సినిమాకు గ్యాప్ ఇచ్చాం. ఆ తర్వాత నేను డేట్ అనౌన్స్ చేశాను. కానీ ఆ డేటును పీవీపీ గారు ఎప్పుడో అనౌన్స్ చేశారని తెలిసి ఫైనల్‌గా ఈ నెల 10న విడుదల చేశాం. శంకరాభరణం వాళ్ళకు కూడా మేమే గ్యాప్ ఇచ్చాం. ఈ రిలీజ్ డేట్ మాకు బాగా కలిసొచ్చింది. మధ్యలో వరదలు ఇతరత్రా చాలా జరిగాయి. మా సినిమాకు వాటి ఎఫెక్ట్ లేదు. కానీ కిక్2 ఎఫెక్ట్ తో మా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కాస్త డల్‌గా జరిగిన మాట వాస్తవమే. అదేంటో నేను ఏ సినిమా తీసినా, తర్వాత తీసే వారికి చాలా హెల్ప్ అవుతుంది. కానీ నాకు ఏ సినిమానూ హెల్ప్ కాదు. నాకు సినిమాలు మాత్రమే బిజినెస్ కాదు. మరో రెండు మూడు
బిజినెస్‌లున్నాయి. ఇది ప్యాషన్ మాత్రమే ప్రతి సినిమానూ దగ్గరుండి అన్నీ చూసుకుంటాను. నన్ను కాదని నా ప్రొడక్షన్‌లో ఏదీ జరగదు. నాకు కథే ముఖ్యం. కాంబినేషన్ తర్వాత. సంపత్ నంది ఇప్పటిదాకా మూడు సినిమాలు చేస్తే, అందులో రెండు చిత్రాలు మా బ్యానర్‌లోనే జరగడం ఆనందంగా ఉంది. ఈ సినిమా కథను తను చెప్పిన తీరు నాకు బాగా నచ్చింది. అలాగే భీమ్స్ చేసిన ట్యూన్లు కూడా నచ్చడంతో వెంటనే ఎంపిక చేశాం. బ్యాక్‌గ్రౌండ్ చిన్నాగారు చేశారు. చిన్నా పెద్దా తేడా లేకుండా మంచి కథలతో సినిమాలు చేయాలన్నది నా కోరిక. మా సంస్థలో తదుపరి సినిమా గురించి ఇంకా ఏమీ అనుకోలేదు. నెక్స్ట్ ప్రాజెక్ట్ వివరాలను జనవరిలో ప్రకటిస్తాం`` అని తెలిపారు.