pizza
Manam Saitam press meet
మరింత మందికి చేరువగా...మనం సైతం
You are at idlebrain.com > News > Functions
Follow Us

5 October 2017
Hyderabad

నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మనం సైతం సంస్థ సహాయ కార్యక్రమాలు మరింత విస్తృతమవుతున్నాయి. శుక్రవారం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా మనం సైతం మరో ఇద్దరు ఆపన్నులకు సహాయం అందించింది. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ కార్యాలయంలో జరిగిన మనం సైతం కార్యక్రమంలో కథానాయకుడు శ్రీకాంత్, నిర్మాత సి. కళ్యాణ్, నటి సన, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పి. కిరణ్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ అధ్యక్షులు అమ్మిరాజు, ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బందరు బాబ్జీ, సినీ కార్మిక సమాఖ్య నాయకులు వేణుగోపాల్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనారోగ్యం పాలై ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కాస్ట్యూమర్ ఏడుకొండలు, ప్రొడక్షన్ మేనేజర్ రమేష్ బాబు కొడుకు కేశవ మణిశంకర్ చదువుకు ఆర్థిక సహాయం అందజేశారు.

అనంతరం కాదంబరి కిరణ్ మాట్లాడుతూ...సహాయం కోసం వేచి చూసే వాళ్లు మన చుట్టూనే ఉంటారు. ఒక్క క్షణం ఆలోచిస్తే వాళ్ల అవసరాన్ని తీర్చగలుగుతాం. మనం కలిసి ఉండాలి, పరస్పరం సహాయం చేసుకోవాలనే తత్వం మనుషుల కంటే చిన్న చిన్న ప్రాణులకు ఎక్కువగా ఉంటుంది. పేదరికాన్ని మనం తొలగించలేకపోవచ్చు. కానీ కష్టాల్లో ఉన్న కొంతమందికైనా ఉపయోగపడాలనే లక్ష్యంతో మనం సైతం సంస్థ ను ఏర్పాటు చేశాం. ఎంతోమంది మాకు సహకారాన్ని అందిస్తూ అండగా నిలుస్తున్నారు. మాకు పరిచయం లేని వాళ్లు కూడా సంస్థ చేస్తున్న సహాయ కార్యక్రమాలు చూసి ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. వాళ్లందరికీ కృతజ్ఞతలు. అన్నారు.

నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ...కాదంబరిని చూస్తుంటే ఆయన కంటే మంచి స్థాయిలో ఉన్న మేమేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేయడం లేదు అని ఆలోచన వస్తోంది. అయినా మనం సైతం కార్యక్రమంలో మేమూ భాగస్వాములం అవుతాం. ఎలాంటి సహకారమైనా అందిస్తామని మాటిస్తున్నాను. చిత్ర పరిశ్రమలో ఎవరి హడావుడిలో వారు ఉంటున్నాం. మనకు పరిచయం ఉన్న వ్యక్తి కష్టాల్లో ఉన్నా తెలియడం లేదు. ఇలాంటి సంస్థల వల్ల అవసరాల్లో ఉన్నవాళ్ల గురించి అందరికీ తెలుస్తుంది. తరతరాలుగా మనం సైతం సంస్థ ఆపదలో ఉన్న వాళ్లకు ఉపయోగపడాలని కోరుకుంటున్నా. ఇండస్ట్రీ గురించి అవగాహన, ఇండస్ట్రీపై అభిమానం, ప్రేమ ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వ్యక్తి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండటం మా అదృష్టం. అన్నారు.

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ...ఎప్పుడూ సాటి వాళ్ల గురించే కాదంబరి ఆలోచిస్తుంటాడు. నేనూ ఎన్నో సందర్భాల్లో ఈ సంస్థ తరుపున సహాయం చేశాను. ఇకపై కూడా నా వంతు సహకారం ఉంటుందని చెబుతున్నాను. అన్నారు. ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు పి. కిరణ్ మనం సైతం సంస్థ స్ఫూర్తిని అభినందించారు. తన సహకారం ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి, ఆయనపై ప్రత్యేకంగా రూపకల్పన చేసిన పాటను శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ పాటను చిర్రావూరి విజయ్ రచించగా, ప్రద్యోదన్ సంగీతాన్ని అందించారు. గాయకుడు సింహా పాడారు.

కార్యక్రమంలో మనం సైతం సంస్థ సభ్యులు అనితా చౌదరి, పద్మావతి పాల్గొన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved