pizza
Manam Saitham Press Meet
మానవతను చాటుతున్న మనం సైతం...
You are at idlebrain.com > News > Functions
Follow Us


25 November 2018
Hyderabad

ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ నిర్వహిస్తున్న మనం సైతం సేవా సంస్థ మానవతను చాటుకుంటోంది. తెలుగు చిత్ర పరిశ్రమలోని 24 విభాగాల కార్మికులకే కాకుండా దేశంలో ఎక్కడ ఏ విపత్తు జరిగినా తమ వంతు సహాయం అందిస్తున్నారు. కేరళ తుఫాన్, తిత్లీ తుఫాన్ బాధితులకు నిత్యావసరాలు ఆర్థిక సాయం అందించిన మనం సైతం సంస్థ...భూదాన్ పోచంపల్లి నేతన్నలకు అండగా నిలబడింది. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో పేదలకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నటి, నిర్మాత మంచు లక్ష్మీ ప్రసన్న, నిర్మాతలు కేఎల్ నారాయణ, దామోదర ప్రసాద్, నటుడు నందు, గాయకుడు శ్రీకృష్ణ, బుల్లితెర దర్శకుడు మీర్, జాయింట్ లేబర్ కమిషనర్ డాక్టర్ గంగాధర్, స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ సీఈవో డాక్టర్ గంగయ్య తదితరులు పాల్గొన్నారు. అతిథుల చేతుల మీదుగా నేతన్నలు బైల నరసింహా, బోగ హరిప్రసాద్, పరిశ్రమకు చెందిన బొంగు గణేష్, వేణుగోపాల్, గారిబాబు, ఇసంపల్లి రహేలు, లలిత, హరిత శ్రావణిలకు చెక్ లు అందజేశారు.

ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ...చిత్ర పరిశ్రమలో అనేక చేదు అనుభవాలు చూశాను. వాటిని గురించి, కారణమైన వాళ్లను గురించి ఆలోచించే కంటే ఆ శక్తిని పేదలకు ఉపయోగపడేందుకు వినియోగించాలనుకున్నాను. పేదలకు చాలినంత డబ్బు ఇవ్వలేకున్నా, గుండెల నిండా ధైర్యాన్నివ్వాలి అనే సంకల్పంతో నాలుగేళ్ల క్రితం మనం సైతం ప్రారంభించాను. నా తోటి హాస్య నటుడు పొట్టి రాంబాబు చనిపోతే..ఆ విషయం నాకు తెలిసి పరిశ్రమలోని కొందరిని కొంత డబ్బు సహాయం చేయమని అడిగాను. వాళ్లెవరూ స్పందించలేదు. ఒక వ్యక్తి వచ్చి మంచు లక్ష్మి ఇమ్మని చెప్పారని 20 వేల రూపాయలు ఇచ్చి వెళ్లారు. మంచు లక్ష్మి గొప్ప హృదయం అది. ఇలాంటి వాళ్లంతా మనం సైతం కార్యక్రమాలకు అండగా నిలబడుతుంటే ఎంతో శక్తి వచ్చినట్లు అనిపిస్తోంది. ఇటీవల భూదాన్ పోచంపల్లి వెళ్లాను. అక్కడ చేనేత కార్మికుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. వారిలో బైల నరసింహా, బోగ హరిప్రసాద్ లకు ఇవాళ సాయం చేస్తున్నాం. మనం సైతం ఎప్పుడైనా ఎక్కడికైనా సాయం అందించేందుకు సిద్ధంగా ఉందని చెబుతున్నాను. అన్నారు.

మంచు లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ...పేద వాళ్లకే కాదు డబ్బున్న వాళ్లకూ కష్టాలు వస్తాయి. నాకే బాధ కలిగినా నాన్నకు చెప్పకుండా దాసరి గారి దగ్గరకు వెళ్లేదాన్ని. ఇవాళ ఆయన లేకపోవడం నాకు తీరని లోటు. మేము సైతం అంటూ నేను టెలివిజన్ కార్యక్రమం చేశాను. నాన్న గారు విద్యా సంస్థల ద్వారా సేవ చేస్తున్నారు. కాదంబరి గారు చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. మీరు చేసే సేవా కార్యక్రమానికి ఎవరి అండా అక్కర్లేదు దేవుడే మీకు అండగా ఉంటాడు. మనం సైతం ఒక ప్రాంతానికో, ఊరికో పరిమితం కావడం లేదు. అవసరం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. మనిషి జన్మ ఎత్తిన తర్వాత మనం తిని, మనం తాగి, మనం బతికితే కాదు, పదిమందికి సహాయపడుతూ జీవితాన్ని కొనసాగించాలి. ఈ సంస్థకు మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుంది. మళ్లీ పిలిచినా ఈ కార్యక్రమానికి వస్తాను. అన్నారు.

నిర్మాత కేఎల్ నారాయణ మాట్లాడుతూ...కాదంబరి గారు నాకు చాలా కాలంగా తెలుసు. ఆయన ఇంత పెద్ద సేవా సంస్థను నడిపిస్తున్నారని ఆలస్యంగా తెలిసింది. పరిశ్రమలోనే కాదు బయట అవసరంలో ఉన్న వాళ్లకు సహాయం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలకు ప్రచారం అవసరమా అని మొదట అనిపించింది కానీ...ఎంత ఎక్కువ మందికి తెలిస్తే అంత సహాయం పేదలకు చేయగలం అని తెలుస్తోంది. సేవకు ప్రాంతం అనే బేధం లేదు. ప్రకృతి విలయాలు ఎప్పుడు వచ్చినా చిత్ర పరిశ్రమ ప్రభుత్వాలతో పాటు నిలబడుతోంది. హుదూద్ వచ్చినప్పుడు మేమంతా కలిసి 15 కోట్ల రూపాయలు సహాయం అందించాం. పరిశ్రమ అంతా కలిసి చేయడం వేరు ఒక్క కాదంబరి ముందుకొచ్చి సహాయ కార్యక్రమాలు చేయడం వేరు. ఆయన సేవా దృక్పథాన్ని అభినందిస్తున్నాను. అన్నారు.

నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ...ఈ సేవా కార్యక్రమాల వెనుక నీ ఆలోచన ఏంటని కాదంబరిని అడిగితే...నిజమైన సంతృప్తి సేవే అన్నాడు. పరిశ్రమలోని వాళ్లు డబ్బులు ఇవ్వనక్కర్లేదు. ఇలాంటి మంచి కార్యక్రమానికి వస్తే వాళ్ల వల్ల మరింత ప్రచారం లభిస్తుంది. విరాళాలు పెరిగి ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం వస్తుంది. అన్నారు.
ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ, మనం సైతం సభ్యులు బందరు బాబీ మాట్లాడుతూ...ఎవరికైనా కష్టముందని పరిశ్రమలోని కొందరికి ఫోన్ చేస్తే డబ్బులు మీకు కావాలా అని అడుగుతున్నారు. మాకు వద్దు మేము బాగానే ఉన్నాం అంటే...ఫర్లేదు మీకేనని చెప్పండి అంటున్నారు. అందుకే పేదల కోసం మా కార్యక్రమానికి రమ్మని మాత్రమే మేము కోరుతున్నాం. ఎవరినీ ఆర్థిక సహాయం చేయమని కోరడం లేదు. అన్నారు.

ఈ కార్యక్రమంలో మనం సైతం సభ్యులు వినోద్ బాలా, సురేష్, అనిత, శైలజా, సీసీ శ్రీను, జేవీవీ రెడ్డి, విశ్వనాథ్, వల్లభనేని అనిల్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved