అల్లు అర్జున్, రకుల్ ప్రీత్‌సింగ్, కేథరిన్ ట్రెసా కీలక పాత్రల్లో నటించిన చిత్రం `సరైనోడు`. అల్లు అరవింద్ నిర్మాత. గీతా ఆర్ట్స్ పతాకంపై రూపొందుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రెస్‌మీట్ హైదరాబాద్‌లో బుధవారం ఉదయం జరిగింది.
అల్లు అరవింద్ మాట్లాడుతూ ``ఈ నెల 22న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. మోస్ట్ స్టైలిష్డ్ చిత్రమిది. సాంకేతికపరంగా కొత్తగా ఉంటుంది. మన సినిమాలు సాంకేతికంగా హిందీ చిత్రాలతో సరితూగడం లేదు అనుకునేవారికి ఈ సినిమా సమాధానమవుతుంది. బోయపాటి స్టైల్లోని హీట్ ఉంటుంది. అయితే ఆ హీట్ బన్నీని మింగలేదు. ఆయన సినిమాల్లోని హీట్ ను ఉంచుతూనే బన్నీని బన్నీగా చూపించారు. రిషి పంజాబీ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా చేశారు. 500లకు పైగా యాడ్ ఫిల్మ్స్ చేసిన ఆయన పనితీరు నచ్చి బన్ని ఈ సినిమాకు ఎంపిక చేశారు. చాలా రిచ్‌గా ఉంటుంది సినిమా. బన్ని, బోయపాటి ఇప్పుడు ప్రసవ వేదనను అనుభవిస్తున్నారు. నేను మాత్రం వరండాలో తండ్రి పచార్లు చేస్తున్నట్టు చేస్తున్నాను`` అని అన్నారు.
బోయపాటి మాట్లాడుతూ ``ప్రస్తుతం కాపీ టెస్ట్ చేసుకుంటున్నాను. నా చేతికి మైక్ టైసన్‌ని ఇస్తే అతనికి ఇంకా ఎక్కువ ఇన్‌పుట్స్ ఇచ్చి మంచి బాక్సింగ్ సినిమా చేస్తా. మైకిల్ జాక్సన్‌ని ఇస్తే మంచి డ్యాన్స్ సినిమా చేస్తా. నా హీరోకి ఏం కావాలో ఆ ఎలిమెంట్స్ ప్రకారం చేస్తా. ఏ హీరోతో సినిమా చేస్తే ఆ జోనర్‌లో చేస్తా. అందరు హీరోలతో సినిమా చేయడానికే నేను పరిశ్రమకి వచ్చాను. ఈ సినిమా పండగలాంటి సినిమా అవుతుంది. నా టీమ్ అందరూ మంచి వారు. మంచివారితో సినిమా చేసినందుకు గర్వంగా ఫీలవుతున్నా. వెనుక బరువునంతా వేసుకుని నేను ఇంజిన్‌లాగా వెళ్తున్నప్పటికీ , నాకు ట్రాక్‌లాగా నిలిచి సపోర్ట్ చేసిన నిర్మాతను మర్చిపోలేను. గుండెలమీద చెయ్యి వేసుకుని అందరూ చూడదగ్గ చిత్రమిది`` అని అన్నారు.
Glam gallery from the event
రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ``యాక్షన్, ఎమోషన్ ఉన్న సినిమా ఇది. ఎమోషన్ అనే వెన్నెముకకు రొమాన్స్, డ్రామా, ఫ్యామిలీ వంటి అంశాలతో పూత వేశారు. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. చిన్న డీటైల్స్ కూడా మిస్ కాకుండా దర్శకుడు చెప్పేవారు. ఆయన ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్ గ్రేట్`` అని చెప్పారు.
తమన్ మాట్లాడుతూ ``ఏప్రిల్ 10 నుంచి ఈ సినిమా పాటల గురించి చాలా మంది ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. గత ఎనిమిది నెలలుగా శ్రీనుగారితో ట్రావెల్ అవుతున్నాను. సూపర్ స్టైలిష్ చిత్రమిది`` అని చెప్పారు.
రిషి పంజాబీ మాట్లాడుతూ ``ఈ టీమ్‌తో ఫెంటాస్టిక్ జర్నీ కుదిరింది. తమన్ మంచి సంగీతాన్నిచ్చారు`` అని అన్నారు.
ఆది పినిశెట్టి మాట్లాడుతూ ``ఊర మాస్ ఓపెనింగ్స్ రానున్న సినిమా ఇది. మామూలుగా సినిమాపట్ల ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతుంటే భయం ఉంటుంది. కానీ ఈ సినిమా పట్ల నాకు అలాంటి భయాలేమీ లేవు. ఈ సినిమాకు స్పెయిన్ అరవింద్‌గారు, బ్రెయిన్ బోయపాటిగారు. ఫేస్ బన్నీ. ఈ ముగ్గురి నమ్మకం సినిమాను నిలబెడుతుంది. పూర్తిగా టెక్నికల్ సపోర్ట్ ఉన్న చిత్రమిది. ఏప్రిల్ 22న విడుదలవుతుంది. హీరోగా చేస్తున్న నువ్వు విలన్‌గా ఎందుకు మారావు అని చాలా మంది అడుగుతున్నారు. వారందరికీ ఈ సినిమా ఓ సమాధానమవుతుంది`` అని చెప్పారు.