12 April 2015
Hyderabad
'వైద్యం చాలా పవిత్రమైనది'. అందుకే వైద్య వృత్తిలో ఉండి, ప్రాణం పోసే డాక్టర్లను దేవుడితో సమానంగా భావిస్తారు. కొంతమంది వైద్యులు కేవలం తమ ఆస్పత్రికి వచ్చేవారికి చికిత్స చేయడంతో పాటు విడిగా సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. అలాంటి వైద్యులు అరుదుగా ఉంటారు. వాళ్లల్లో 'డా. సిహెచ్. ఉమేష్ చంద్ర' ఒకరు. నగరంలోని పలు ప్రముఖ ఆస్పత్రుల్లో కన్సల్టంట్ డాక్టర్ గా చేస్తున్నారు సిహెచ్. ఉమేష్ చంద్ర. ఇక.. ఆయన చేస్తున్న 'ఉచిత సేవ' గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి.
ప్రతి నెలా రెండో ఆదివారం 150 నుంచి 200 మందికి ఉచితంగా సేవలందిస్తున్నారు ఉమేష్ చంద్ర. గుండెకి సంబంధించిన వ్యాధులకు పరీక్షలు, బీపీ, షుగర్ టెస్టులు చేసి, ఎనిమిది రోజులకు సరిపడా ఉచితంగా మందులు కూడా ఇస్తుంటారాయన. హైదరాబాద్ లోని అబిడ్స్ లోని బొగ్గులకుంటలో గల 'ఉమా హార్ట్ కేర్ క్లినిక్'లో ఈ సేవా కార్యక్రమం జరుగుతుంది. 2000వ సంవత్సరంలో ఆయన ఈ మహత్కార్యానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల రెండో వారానికి సంబంధించిన ఈ సేవా కార్యక్రమం ఈరోజు (12.04.) శ్రీకాంత్ చేతుల మీదగా ఆరంభమైంది.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ - ''ఈరోజు ఈ క్యాంపెయిన్ నా చేతుల మీదగా ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. ఉమేష్ చంద్రగారు చేస్తున్న ఈ సేవా కార్యక్రమం కొనియాడదగ్గది'' అన్నారు.
సిహెచ్. ఉమేష్ చంద్ర మాట్లాడుతూ - ''ఇప్పటివరకు 184 నెలలు నిరాటంకంగా ఈ కార్యక్రమాన్నికొనసాగిస్తూ వచ్చాం. ముందు ముందు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా ఇది కొనసాగాలని కోరుకుంటున్నాను. నాకెంతో ఆత్మసంతృప్తిని మిగులుస్తున్న కార్యక్రమం ఇది'' అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత శ్రీమిత్ర చౌదరి, ఫిజియోథెరపిస్ట్ దినకర్, నటులు చంటి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.