సునీల్, మన్నార్ చోప్రా హీరో హీరోయిన్లుగా ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం `జక్కన్న`. వంశీ కృష్ణ అకెళ్ళ దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 29న సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో ...
దర్శకుడు వంశీకృష్ణ అకెళ్ళ మాట్లాడుతూ ``దర్శకుడుగా నాకు ఇది రెండవ సినిమా. జక్కన్న అనే టైటిల్ ప్రేక్షకుల్లో బాగా పాపులర్ అయ్యింది. అలాగే దినేష్ చాలా మంచి మ్యూజిక్ అందించాడు. పాటలు చాలా పెద్ద విజయాన్ని అందుకున్నాయి. నిర్మాత సుదర్శన్ రెడ్డిగారు నన్ను నమ్మి ఈ సినిమా దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చారు. ఈ సినిమా సక్సెస్ అయిందని అనను. మెగా సక్సెస్ అయిందని అంటాను. మెగాస్టార్‌గారు మాకు ఇచ్చిన ఆశీస్సులు ఫలించాయి. కలెక్షన్లు చాలా బాగా వస్తున్నాయి. ప్రతి ఆర్టిస్టూ చాలా బాగా చేశారు. సునీల్‌గారు నన్ను నమ్మి ఈ సినిమా చేశారు. బీసీల్లో ఫుల్స్ అవుతున్నాయి. ఒంగోలులో ఈ రోజు ఉదయం కూడా 80 శాతం ఫుల్స్ అయ్యాయని నాగినీడుగారు ఫోన్ చేశారు. సినిమా దూసుకుపోతున్నందుకు ఆనందంగా ఉంది`` అని అన్నారు.
నిర్మాత ఆర్.సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ``ఐదు రోజుల్లో మా చిత్రం రూ.15కోట్లు కలెక్ట్ చేసింది. ఎవరైనా అడిగినా డీటైల్డ్ గా చెబుతాను. భవానీ ప్రసాద్ మాటలు మంచి ఆదరణ పొందాయి. దినేష్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సప్తగిరి మంచి కామెడీ చేశారు. సినిమా సక్సెస్ అవుతుందని ఆయనా, పృథ్విగారూ ముందు నుంచి చెబుతూనే ఉన్నారు`` అన్నారు.
హీరో సునీల్ మాట్లాడుతూ ``ఈ సక్సెస్ నా ఒక్కడి వల్ల వచ్చింది కాదు. ఇది టీమ్ కృషి. రామ్‌ప్రసాద్‌గారు సినిమా చూసొచ్చి చాలా పెద్ద హిట్ అవుతుందని చెప్పారు. ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డా పడ్డట్టే అనిపించలేదు. ఇందులో ప్రతి పాత్రా బాగా పండింది. నిర్మాతగారు రాజీపడకుండా చేశారు. డైలాగులకు మంచి పేరొస్తుంది. పది మందిని నవ్విద్దామని మేం చేసుకున్న ప్లాన్ సక్సెస్ అయింది`` అని అన్నారు.
సప్తగిరి మాట్లాడుతూ ``సునీల్ హీరోగా కావడం వల్ల చాలా మంది కమెడియన్లకు కామెడీ చేసుకునే అవకాశం దొరికింది`` అని తెలిపారు.
దామోదరప్రసాద్ మాట్లాడుతూ ``రిటర్న్స వచ్చాయని డబ్బులు తెచ్చిచ్చే డిస్ట్రిబ్యూటర్లు కరువైపోతున్న ఈ తరుణంలో మల్కాపురం శివకుమార్‌లాంటి డిస్ట్రిబ్యూటర్లు రావడం ఆనందంగా ఉంది. సినిమా విడుదలైన తర్వాత చేతులు దులుపుకోకుండా బాధ్యతగా దాని బాగోగులు చూసుకుంటున్న సునీల్‌ను చూస్తే ముచ్చటేస్తుంది. ఆయనతో కలిసి సినిమా చేద్దామనుకున్నా. కానీ అది కుదరలేదు`` అని తెలిపారు.
పృథ్వి మాట్లాడుతూ ``వెళ్లిన ప్రతి చోటా మంచి సినిమా అనే టాక్ విని ఆనందంగా అనిపించింది`` అని చెప్పారు.
మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ ``మా సురక్ష్ బ్యానర్ లో చేసిన తొలి డిస్ట్రిబ్యూషన్ ఇదే. ఐదు రోజుల్లో రూ5కోట్లు కలెక్షన్ వచ్చింది. ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. తొలిరోజు 75 శాతం పైగా ఫుల్స్ అయ్యాయి. మిగిలిన చోట్ల కూడా 80 శాతం నిండాయి`` అని తెలిపారు.
రఘు మాట్లాడుతూ ``డైలాగులకు మంచి స్పందన వస్తోంది`` అని అన్నారు.
భవానీ ప్రసాద్ మాట్లాడుతూ ``మంచి మాటలు రాసే అవకాశం వచ్చింది. ఈ సినిమా సక్సెస్ జరుపుకుంటున్న ఈ రోజు నాకు పాప పుట్టడం చాలా ఆనందంగా ఉంది`` అని చెప్పారు.
కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ ``మంచి పాటలు రాసే అవకాశం వచ్చింది`` అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
కబీర్ సింగ్, సప్తగిరి, పృథ్వీ, పోసాని, నాగినీడు, రాజ్యలక్ష్మి, చిత్రం శ్రీను, అదుర్స్ రఘు, రాజా రవీంద్ర తదితరులు ఇతర తారాగణంగా నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్, మ్యూజిక్: దినేష్, ఫైట్స్: కనల్ కణ్ణన్, డ్రాగన్ ప్రకాష్, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, డైలాగ్స్: భవాని ప్రసాద్, కో ప్రొడ్యూసర్స్: ఆయుష్ రెడ్డి, అక్షిత్ రెడ్డి, నిర్మాత: ఆర్.సుదర్శన్ రెడ్డి, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వంశీకృష్ణ అకెళ్ళ.