pizza
TVPC Awards 2016
ఘనంగా జరిగిన టి.వి.పి.సి. అవార్డుల ప్రదానోత్సవం
ou are at idlebrain.com > News > Functions
Follow Us

24 April 2016
Hyderabad

గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా టెలివిజన్‌ రంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు అవార్డులను ప్రదానం చేసింది టెలివిజన్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌. ఈ అవార్డుల ప్రదానోత్సవం ఏప్రిల్‌ 22న హైదరాబాద్‌, సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ హాజరయ్యారు. తొలుత బుర్రె భీమయ్య స్మారక అవార్డును, 10 వేల రూపాయల చెక్‌ను ప్రముఖ రచయిత, రేడీయో జర్నలిస్టు డి. వెంకట్రామయ్యకు, అగస్త్య మెమోరియల్‌ అవార్డును, 10 వేల రూపాయల చెక్‌ను నిర్మాత, దర్శకుడు, కెమెరామన్‌ జి.ఆర్‌.ప్రభుకు అందచేశారు. ఎల్‌.కె.శ్రీధర మెమోరియల్‌ అవార్డును ప్రముఖ కెమెరామెన్‌ సి.సురేంద్రకు అందజేయాల్సి వుండగా అనారోగ్య కారణాల వల్ల ఈ అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన హాజరు కాలేకపోయారు. దీంతో టెలివిజన్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ అధ్యక్షులు మహమ్మద్‌ షరీష్‌ ఆధర్యంలో కౌన్సిల్‌ సభ్యులు సి.సురేంద్ర వుంటున్న వృద్ధాశ్రమానికి వెళ్లి ఆయనకు స్వయంగా మెమెంటోను పదివేల రూపాయల నగదును అందజేశారు.

ఈ అవార్డుల ప్రదానోత్సవంలో టెలివిజన్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ అధ్యక్షులు మహమ్మద్‌ షరీఫ్‌ మాట్లాడుతూ - ''2000 లో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ ద్వారా కొంత మందికి శిక్షణ కూడా ఇస్తున్నాం. వారి వారి అభిరుచులకు తగ్గట్టుగా వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. గతంలో తుఫాను వచ్చినప్పుడు ఈ సంస్థ ద్వారా పలు సహాయ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు, ఇళ్ళ స్థలాలు మంజూరు చేయవలసినదిగా ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాము. ఈ ఏడాది జూలైలో 3 నుంచి 10 నిమిషాల నిడివిగల షార్ట్‌ ఫిలిం చిత్రీకరణ పోటీలను నిర్వహిస్తున్నాం. అందులో ఉత్తమ చిత్రానికి మొదటి బహుమతి ఒక లక్ష నగదు, రెండో బహుమతి రూ. 75వేలు, మూడవ బహుమతి రూ.50వేలు అందజేయబోతున్నాం'' అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి మాట్లాడుతూ - ''షరీష్‌గారు ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ద్వారా చాలా మంచి పనులు చేస్తున్నారు. టెలివిజన్‌ రంగంలో విశిష్ట సేవలందంచిన వారికి ప్రతి ఏడాది ఇలా అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాను. షరీఫ్‌గారు మా ముందు వుంచిన సమస్యల పరిష్కరించడానికి నా శాయశక్తులా కృషి చేస్తాను'' అన్నారు.

ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ మాట్లాడుతూ - ''నాకు ఇక్కడ ఎవ్వరూ పరిచయం లేదు. అంతా కొత్తే. అయినాగానీ డి.వెంకట్రామయ్యగారికి నేను పెద్ద అభిమానిని. అప్పట్లో ఆకాశవాణి ద్వారా ఆయన వార్తలు వింటూనే ఆనందపడేవాళ్ళం. షరీఫ్‌గారి డిమాండ్‌ను నెరవేర్చే ప్రయత్నం చేస్తాం. ఈ అవార్డు గ్రహీతలందరూ వారి వారి రంగాలలో ఎన్నో సేవలందించారు కాబట్టే ఈ అవార్డుకు అర్హులయ్యారు. ఈ కార్యక్రమానిక రావడం చాలా ఆనందంగా ఉంది'' అన్నారు.

అవార్డు గ్రహీత డి.వెంట్రామయ్య గారు మాట్లాడుతూ - ''ఈ తరం వారికి నా పేరు తెలియదు. కానీ పదేళ్ళ ముందు వరకు కూడా నేనంటే రేడియో శ్రోతలందరికీ తెలుసు. వయస్సు పైబడిన రీత్యా ప్రస్తుతం ఏ కార్యక్రమం కూడా చేయడంలేదు. 27 సంవత్సరాలు ఆకాశవాణిలో పనిచేశాను. ఒక్క టైపు రైంటింగ్‌ తప్పితే మిగతా అన్ని విభాగాల్లోను పనిచేశాను. రేడియో జర్నలిజంలో అలుపెరుగని కృషి చేశాను. ఈ అవార్డు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రానున్న రోజుల్లో టీవీలే సినిమాలకు స్పూర్తి కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

అవార్డు గ్రహీత జి.ఆర్‌.ప్రభు మాట్లాడుతూ - ''చాలా సంవత్సరాల నుండి టీవీ రంగంలో పనిచేస్తున్నాను. నాకు ఇప్పటి వరకు చాలా అవార్డులు వచ్చాయి. కానీ ఈ అవార్డు చాలా ప్రధానం. ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అన్నారు.

ఈ కార్యక్రమంలో టీవీపీసీ ఉపాధ్యక్షులు గోపాలక ష్ణ, కోశాధికారి త్రినాథ్‌రావు, సభ్యులు మధుసూదన్‌ గుప్తా, శ్రీనివాస్‌రావు, నల్లూరి సుధీర్‌కుమార్‌, రఫీ తదితరులు పాల్గొన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved