pizza

Chiranjeevi pays homage to Vijaya Bapineedu
స్వర్గీయ విజయ బాపినీడు గురించి చిరంజీవి

You are at idlebrain.com > news today >
Follow Us

12 February 2019
Hyderabad

ఇవాళ నాకెంతో దుర్దినం. విజయ బాపినీడు గారు మరణించారనేది నమ్మలేకుండా ఉంది. ఆయన నన్ను ఓ కొడుకులా, ఓ తమ్ముడిలా చూసుకునే వారు. ఆయనతో నా అనుబంధం కేవలం ఓ దర్శకుడు, నిర్మాతలా ఉండేది కాదు. నా మనసుకు అతి దగ్గరైన వ్యక్తి బాపినీడు గారు. వారితో నా పరిచయం 'పట్నం వచ్చిన పతివ్రతలు' సినిమా నుండీ. అప్పట్నించి ఆరు సినిమాలకు పైగా ఆయన నాతో చేయడం జరిగింది. 'ఇతర హీరోలతో కూడా మీరు సినిమాలు చేయొచ్చు కదా' అని ఆయనతో అంటూ ఉండేవాడి. 'మీతో సినిమాలు తీయడం ప్రారంభించిన తర్వాత ఆ కంఫర్ట్ గానీ, సెంటిమెంట్ గానీ మరొకరితో నాకు కుదురడం లేదు. వేరే వారితో చేయలేకపోతున్నాను' అని చెబుతూ చాలా కాలం నా పట్ల ఆ అభిమానాన్ని, ప్రేమను చూపించిన గొప్ప వ్యక్తి.

నేను హైదరాబాద్ కు షిఫ్ట్ అయిన కొత్తలో ఎక్కడ ఉండాలి అని అనుకుంటున్న సమయంలో 'హైదరాబాద్ లో నా గెస్ట్ హౌస్ ఉంది. మీరు అందులో ఉండొచ్చు' అని చెప్పి.... పై ఫ్లోర్ లో ఉండే వారిని కింద కు పంపించి, పై రెండు ఫోర్లు నాకు ఇచ్చారు. చాలా కాలం అక్కడే ఉన్నాను. ఎప్పుడూ నా పై తమ్ముడిలా, కొడుకులా వాత్సల్యం చూపించేవారు. ఆయనతో ఎన్నో స్వీట్ మెమొరీస్. ఒకరోజు 'మగమహారాజు' 100 రోజుల ఫంక్షన్ జరుగుతుంటే... ఓ ఏనుగును నాకు బహుమతిగా ఇచ్చారు. ఇదేమిటంటీ... దీనిని నేను ఏం చేసుకోనూ! అంటే... 'మీతో నాకు ఉన్న అనుబంధానికి, మీరు నా పట్ల చూపించే ప్రేమకు తగ్గట్టుగా ఏ బహుమతి ఇస్తే బాగుంటుందని ఆలోచించాను. ఏనుగును ఇస్తే దానికి మ్యాచ్ అవుతుందనిపించింది. అందుకే దీనిని ఇచ్చాను' అంటూ నా మీద ప్రేమను అలా చూపిన గొప్ప మనసున్న మనిషి ఆయన. అలానే 'గ్యాంగ్ లీడర్' ఫంక్షన్ ను ఒకే రోజు నాలుగు సిటీస్ లో గ్రాండ్ గా జరిపించిన అరుదైన రికార్డ్ మా ఇద్దరి కాంబినేషన్ లో ఉంది. ఆయన ఏం చేసినా... చాలా వినూత్నంగా, కొత్తగా ఉంటుంది. ముఖ్యంగా నా అభిమానులకు ఆయన అంటే చాలా ఇష్టం. వారికి ఎంతో దగ్గరగా ఉండేవారు. దానికి కారణంగా 'చిరంజీవి' అనే మ్యాగజైన్ ను ఆయన పబ్లిషర్ గా, ఎడిటర్ గా తీసుకొచ్చారు. అందులో నాకు సంబంధించిన ఫోటోలను, వార్తలను ప్రత్యేకంగా పొందుపరిచి అందించేవారు. బాపినీడు గారి మ్యాగజైన్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులంతా ఎదురుచూసేలా చక్కగా ప్రింట్ చేసేవారు. ఆ రకంగా కూడా నా మీద ప్రేమ చూపించారు. అలాంటి వ్యక్తిని ఇవాళ కోల్పోవడం అనేది చాలా బాధకరంగా ఉంది. చాలా దురదృష్టంగా భావిస్తున్నాను. బాపినీడు గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, నా సానుభూతిని తెలియచేస్తున్నాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved