pizza
Chiranjeevi condolences to Gollapudi Maruthi Rao
మాది గురుశిష్యుల సంబంధం గొల్లపూడి మృతి పై మెగాస్టార్ చిరంజీవి స్పందన
You are at idlebrain.com > news today >
Follow Us

12 December 2019
Hyderabad

గొల్లపూడి మారుతిరావుతో తనకున్నది గురుశిష్య సంబంధమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన మరణం పై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 'ఆ మధ్య తన కుమారుడు పేరున నిర్వహించే గొల్లపూడి శ్రీనివాస్ అవార్డ్ ఫంక్షన్‌కి నేను వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ నేను  ఆయన్ని కలిసే అవకాశం దొరకలేదు. ఆరోగ్యంగా ఉండేవారు. ఇంతలో ఇలా అవుతుందని ఊహించలేదు. ఆయనకి నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. గురు శిష్యుల్లాంటి సంబంధం. నేను 1979లో ఐలవ్‌యూ అనే సినిమా చేసినప్పుడు, ఆ సినిమా ప్రొడ్యూసర్ భావన్నా రాయణగారు నాకు గొల్లపూడి మారుతిరావుగారిని పరిచయం చేశారు. అప్పటికే గొల్లపూడి మారుతిరావుగారు చాలా పెద్ద రచయిత, నాటక రచయిత, జర్నలిస్టు గా కూడా పనిచేశారు. సాహిత్య పరంగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి, విద్యాధికుడు. ఆయన దగ్గర డైలాగ్స్ నేర్చుకో అని నన్ను పంపించారు. ఆ రకంగా గొల్లపూడి మారుతిరావుగారు డైలాగులు ఎలా పలకాలో క్లాస్‌లు తీసుకున్నారు. ఈ విధంగా ఆయన నాకు గురువనే చెప్పగలను. ఆ సరదా పరిచయం మాకు స్నేహంగా మారింది. ఖాళీ ఉన్నప్పుడల్లా నేను టి.నగర్‌లో వాళ్ళింటికి వెళ్తుండేవాడిని. ఆయన నాతో ఎన్నో సాహిత్య పరమైన విషయాలు చెప్పేవారు. తన గతం గురించి, గొప్ప గొప్ప కవులు, రచయితల గురించి చెప్తుంటే చాలా ఆసక్తికరంగా వింటుండేవాడిని. నాకుకూడా సాహిత్యం పట్ల, గొప్ప రచయితల గురించి తెలుసుకునే అవకాశం ఆయన ద్వారానే కలిగింది. 1982లో కోడిరామకృష్ణగారు నాతో ‘ఇంట్లో రామయ్య వీధిలో క‌ృష్ణయ్య’ సినిమా తీయాలనుకున్నప్పుడు ఆకథలో ఈ పాాత్రని గొల్లపూడి మారుతిరావుగారు వేస్తే బాగుంటుందని అనగానే నాకు కూడా అది మంచి చాయిస్ అనిపించింది. ఒకరకమైన శాడిజం భర్త, కామెడీగా ఉండే క్యారెక్టర్ . ఆయన ఆ పాత్రలో ఒదిగిపోయి అద్బుతం గా నటించి అందరి మన్ననలు పొందారు, ఆ విధంగా నా సహనటుడుగా ఆయన చేయడం అనేది మంచి అనుభూతి నాకు. ఆ తర్వాతనుంచి ‘ఆలయ శిఖరం‘ , ‘అభిలాష’, ’ఛాలెంజ్‘ లాంటి వరుసగా ఎన్నో సినిమాలు నాతో కలిసి నటించారు. మేం ఎప్పుడు కలుసుకున్నా గతాన్ని గుర్తు చేసుకుంటూ చాాల ా ఆప్యాయంగా మాట్లాడేవారు. అలాంటి గొప్ప బహుముఖ ప్రజ్నాశాలి, సాహిత్యవేత్త, గొప్ప నటుడు, నాటక రచయిత అయిన గొల్లపూడి మారుతిరావుగారు దూరమవ్వడం అన్నది చాలా బాధాకరం. వారి కుటుంబానికే కాదు, యావత్తు సినీ ప్రపంచానికే తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అన్నారు.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved