pizza
KVR Mahendra interview about Dorasani
ఆమెను చూడ‌గానే `దొర‌సాని` అని ఫిక్స‌య్యా - కేవీఆర్ మ‌హేంద్ర‌
You are at idlebrain.com > news today >
Follow Us

11 July 2019
Hyderabad

ఆనంద్ దేవరకొండ, శివాత్మక లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ ‘దొరసాని’. జులై 12న సినిమా విడుద‌ల‌వుతుంది. కేవీఆర్ మ‌హేంద్ర ద‌ర్శ‌కుడు. మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి, య‌ష్ రంగినేని నిర్మాత‌లు. ఈ సినిమా గురించి ద‌ర్శ‌కుడు హైద‌రాబాద్‌లో గురువారం విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు...

* మీ గురించి చెప్పండి?
- మాది వరంగ‌ల్‌లోని జ‌య‌గిరి గ్రామం. 17 ఏళ్లుగా సినిమా ఇండ‌స్ట్రీలోనే ఉన్నా. సినిమా క‌ష్టాల‌న్నీ ప‌డ్డాను. 2014లో తెలంగాణ వ‌చ్చిన‌ప్పుడు ఒక రోజు నా ఫ్రెండ్ కారులో ట్యాంక్‌బండ్ మీద వెళ్తున్నాను. అప్పుడు అంద‌రూ సంబురాలు చేసుకుంటున్నారు. ఇంత మంది ఇంత ఆనందంగా ఉండ‌టానికి కార‌ణం అమ‌ర‌వీరులే క‌దా అని అనిపించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇలాంటి చాలా పోరాటాలు జ‌రిగి ఉంటాయి. వాటి వెనుక ఎంద‌రో ప్రాణ త్యాగం చేసి ఉంటారు. అలాంటి నేప‌థ్యంతో నేను `నిశీథి` అనే షార్ట్ ఫిల్మ్ చేశాను. దాదాపు 18 దేశాల్లో 39 జాతీయ‌, అంత‌ర్జాతీయ అవార్డుల‌ను గెలుచుకుంది ఆ షార్ట్ ఫిల్మ్. బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. ఇది చేస్తున్న‌ప్పుడే నాకు వెంక‌ట్ సిద్ధారెడ్డి, త‌రుణ్ భాస్క‌ర్ వంటి వారంద‌రూ ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆ షార్ట్ ఫిల్మ్ వ‌ల్ల నేనేం రాయ‌గ‌ల‌ను. నా బ‌లాలేంటో తెలిసింది. శ్యామ్‌బెన‌గ‌ల్‌లాంటి వారు న‌న్ను అప్రిషియేట్ చేస్తూ మెయిల్స్ చేశారు. అప్పుడు కూర్చుని `దొర‌సాని` క‌థ రాశాను. దాదాపు 42 వెర్ష‌న్లు రాశాను. వెంక‌ట్ సిద్ధారెడ్డి ద్వారా సురేష్‌బాబుగారిని క‌లిసి క‌థ చెప్పా. ఆయ‌న‌కు చెప్పింది 32వ వెర్ష‌న్‌. ఆ త‌ర్వాత 42వ వెర్ష‌న్ చేసుకుంటున్న‌ప్పుడు నాకు ఫుల్‌ఫిల్‌గా అనిపించింది.

* దొర‌సాని య‌థార్థ‌ఘ‌ట‌న‌ల‌తో తెర‌కెక్కించారా?
- నా చిన్న‌త‌నంలో నేను స్కూల్‌కి వెళ్తున్న‌ప్పుడు అక్క‌డ గ‌డీ ఉండేది. పెద్ద పెద్ద ప్ర‌హ‌రీలు ఉండేవి. అందులో దొర‌సాని ఉంటే ఎలా ఉంటుందోన‌ని నేను అప్పుడు ఊహించుకునేవాడిని. అలా నా ఊహ‌లో అప్పుడు బీజం వేసుకుందే దొర‌సాని. ఓ దొర‌సానికి, ఓ కూలోని కొడుకుకు ప్రేమ పుడితే ఎలా ఉంటుంద‌నే కాన్సెప్ట్ తో అల్లుకుని రాసుకున్నా. 87లో ఈ క‌థ జ‌రిగిన‌ట్టు చూపించాలి. అందువ‌ల్ల అప్ప‌టి స‌మాజం గురించి తెలిసి ఉండాలి. అందుకే అల్లం రాజ‌య్య‌, రంగాచారి, కేవీ న‌రేంద్ర వంటి వారి ర‌చ‌న‌లు దాదాపు మూడేళ్లు స్ట‌డీ చేశా. ఈ క‌థ రాసుకోవ‌డానికే నాకు మూడేళ్లు ప‌ట్టింది. నాకు సంతృప్తిక‌రంగా అనిపించాక నేను వెంక‌ట్ సిద్ధారెడ్డికి చెప్పా. ఆయ‌న‌కు చెప్పిన 25 రోజుల‌కు న‌న్ను సురేష్ బాబు ముందు కూర్చోబెట్టారు. 5 గంట‌ల సేపు క‌థ చెప్పా. విన్న త‌ర్వాత ఆయ‌న ఏమీ మాట్లాడ‌లేదు. ఆ త‌ర్వాత మాత్రం 2 గంట‌లు నాన్‌స్టాప్‌గా మాట్లాడారు.

* శివాత్మిక ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వ‌చ్చారు?
- దొర‌సాని అంటే చూడ్డానికే రాయ‌ల్‌గా ఉండాలి. మంచి హైట్ ఉండాలి. మంచి ప‌ర్స‌నాలిటీ ఉండాలి. రిజ‌ర్వ్డ్ గా మాట్లాడాలి. ఏం చెప్పాల‌నుకున్నా, క‌ళ్ల‌తోనే చెప్పాలి. అవ‌న్నీ శివాత్మిక‌లో ఉన్నాయి. మ‌ధుర శ్రీధ‌ర్‌రెడ్డిగారి ద్వారా నేను జీవిత‌గారిని క‌లిశా.వాళ్లింటికి వెళ్లి కూర్చున్న కాసేప‌టికి శివాత్మిక రూమ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆమెను తొలిసారి చూసిన‌ప్పుడే నా దొర‌సాని దొరికిన‌ట్టు అనిపించింది.

* చంటి సినిమాలోనూ మీనగారు దొర‌సాని త‌ర‌హా పాత్ర చేశారు క‌దా?
- ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరు. అయినా సినిమా ఇండ‌స్ట్రీలో దానికే కాదు, మ‌రే సినిమాకైనా మా సినిమాతో ఉన్న ఏకైక పోలిక రిచ్ గ‌ర్ల్, పూర్ బోయ్ కాన్సెప్ట్ మాత్ర‌మే. మిగిలిందంతా వేరు. `సితార‌`లోనూ అలాంటి కాన్సెప్టే ఉంటుంది. అయినా వాట‌న్నిటినీ దాటుకుని మా సినిమాలో చాలా విష‌యాలున్నాయి.

* ఈ త‌ర‌హా సినిమాలు వేరు. క‌మ‌ర్షియ‌ల్ అంశాలు వేరు క‌దా?
- నిజ‌మే. వీటిలో 200 శాతం క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌ను మేం మేళ‌వించాం. కాక‌పోతే ఆర్టిస్టిక్ వేల్యూస్‌ను పోగొట్టుకోకుండా చూసుకున్నాం. బ్యూటీఫుల్‌గా చెప్పాం.

* ఆనంద్ దేవ‌ర‌కొండ గురించి చెప్పండి?
- ఇన్నొసెంట్ గై. కూలోని కొడుకు. 20 ఏళ్ల కుర్రాడిలాగానే అత‌నికి ప్రేమ పుడుతుంది. అయితే అది దొర‌సాని మీద పుడుతుంది. అదే స్పెష‌ల్‌.

* లిప్‌లాక్‌లుంటాయా?
- అదేదో లిప్‌లాక్‌ల‌న్న‌ట్టు కాదు. హై ఇంటెన్ష‌న్ ప్రేమ‌ను చెప్పే ట‌ప్పుడు జ‌రిగేవే ఇందులోనూ ఉంటాయి. అంతే కానీ, పెద‌వులు క‌లిపి ఎంగిలి చేయాల‌ని క‌దు.

* హ్యాపీ ఎండింగేనా?
- ఒక ధ‌నిక అమ్మాయికి, ఒక పేద అబ్బాయికి మ‌ధ్య జ‌రిగిన క‌థ ఎలాంటి షేప్ తీసుకోవాలో, క్లైమాక్స్ అలాంటి షేపే తీసుకుంటుంది.

* మీ త‌ర్వాతి చిత్రం విజ‌య్‌తోనా? రాజ‌శేఖ‌ర్‌తోనా?
- ఇంకా ఏమీ అనుకోలేదు. నా ద‌గ్గ‌ర చాలా ఐడియాలున్నాయి. రాజ‌శేఖ‌ర్‌గారు క‌నిపించిన ప్ర‌తిసారీ సినిమా చేద్దామ‌ని అంటున్నారు. ఈ సినిమా చూశాక విజ‌య్ నాతో ప‌నిచేయాల‌ని అన్నారంటే, ద‌ర్శ‌కుడిగా ఆయ‌న‌కు నా వ‌ర్క్ న‌చ్చిన‌ట్టే. కెమెరా చెప్పిన క‌థ‌కు ఆయ‌న బాగా క‌నెక్ట్ అయ్యార‌న్న‌మాట‌.

* పాట‌ల గురించి?
- ప్ర‌శాంత్ ట్యూన్లు చాలా బావున్నాయి. చాలా మంచి సంగీతం వ‌చ్చింద‌ని అనుకున్నా. రీరికార్డింగ్ విన్నాక అంత‌కు మించి చేశాడ‌నిపించింది.

* హైలైట్స్ ఏమ‌వుతాయి?
- స‌న్నీ కెమెరా వ‌ర్క్ హైలైట్‌. సినిమా థియేట‌ర్‌లో కూర్చున్న ఎవ‌రైనా ప‌ది నిమిషాల్లో 80ల్లో ఉన్న‌ట్టు ఫీల‌వుతారు. అందుకు ఆయ‌న చేసిన కెమెరా వ‌ర్క్ కీల‌కం. పాత లెన్స్ లు వాడాం. అలాగే వైడ్ లెన్స్ లు కూడా వాడాం. క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌, సిద్ధిపేట‌, న‌ల్గొండ‌లోని రియ‌ల్ లొకేష‌న్ల‌లో సింక్ సౌండ్‌తో సినిమా చేశాం. అప్ప‌ట్లో తెలంగాణ‌లో ఎలా మాట్లాడుకునేవారో, అలాంటి భాష‌నే రాశాం.

* ఎలాంటి రిజ‌ల్ట్ ఎదురుచూస్తున్నారు?
- ప్ర‌తి ప‌దేళ్ల‌కు ఒక‌సారి ఓ గొప్ప ల‌వ్ స్టోరీ వ‌స్తుంది క‌దా, అలాంటి సినిమా కావాల‌ని ఉంది. అలాగే రెగ్యుల‌ర్ చిత్రాల‌క‌న్నా భిన్న‌మైన క‌లెక్ష‌న్లు ఎక్స్ పెక్ట్ చేస్తున్నా.

* ఇంత‌కీ మీ అనుభ‌వాలు ఈ సినిమాలో ఉన్నాయా?
- ఏ ర‌చ‌యిత అయినా, త‌న‌కు జ‌రిగిన‌వో, త‌నకు తెలిసిన వారికి జ‌రిగిన‌వాటినో ఎక్క‌డో ఒక‌చోట రాస్తారు. నాలోనూ అలాంటివే ఉన్నాయేమో.

* ఇంత‌కీ మీది ప్రేమ వివాహ‌మా?
- అవునండీ.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved