pizza
K. V. Vijayendra Prasad interview (Telugu) about Srivalli
విషాదం నుండి పుట్టిన కథే 'శ్రీవల్లీ' - విజయేంద్రప్రసాద్‌
You are at idlebrain.com > news today >
Follow Us

13 September 2017
Hyderabad

తెలుగులో ఎన్నో బ్లాక్‌బస్టర్‌ చిత్రాలకు కథను అందించిన స్టార్‌ రచయిత విజయేంద్ర ప్రసాద్‌. బాహుబలి, భజరంగీభాయ్‌జాన్‌ చిత్రాలతో జాతీయ స్థాయిలో రచయితగా పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు విజయేంద్రప్రసాద్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సైంటిఫిక్షన్‌ థ్రిల్లర్‌ 'శ్రీవల్లీ'. ఈ చిత్రం సెప్టెంబర్‌ 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్‌తో ఇంటర్వ్యూ...

'శ్రీవల్లీ' కథ ఎలా పుట్టింది?
- వాల్మీకి రామాయణం ఎలా విషాదం నుంచి పుట్టిందో, అలానే 'శ్రీవల్లీ' కూడా విషాదంలోంచే వచ్చింది. నాకు రమేష్‌ అనే ప్రాణ మిత్రుడు ఉండేవాడు. తనది విజయవాడ. ఇద్దరం కలిసే చదువుకున్నాం. నేను హైదరాబాద్‌ వచ్చిన తర్వాత తనతో సంబంధాలు తెగిపోయాయి. 2010లో వినాయక చవితికి తను బాగా గుర్తొచ్చాడు. దాంతో వాణ్ణి కలుద్దామని విజయవాడ వెళితే చనిపోయాడని తెలిసింది. నాకు గుర్తొచ్చిన వినాయకచవితి రోజునే రమేష్‌ కూడా నా గురించి పదే పదే తలచుకొన్నాడట. ఈ సంగతి తన డైరీలో రాసుకొన్నాడని వాళ్లమ్మగారు డైరీ చూపించారు. ఒకరి గురించి ఒకరం ఒకే సమయంలో ఆలోచించాం. ఇదెలా సాధ్యం? శబ్ద తరంగాల్లా మనిషిలోని భావ తరంగాలుంటాయా? అనిపించింది. ఈ ఆలోచన నుండి పుట్టిన కథే 'శ్రీవల్లీ'.

శ్రీవల్లీ కథేంటి?
-పుట్టుకతో ఎవరూ వ్యసనపరులు, దుర్మార్గులు కారు. పరిస్థితుల వల్ల అలా మారిపోతారు. మనిషి మనసును చూడటం వల్ల అతడిని సన్మార్గుడిగా మార్చవొచ్చనే అంశాలకు నాటకీయతను మేళవించి ఈ సినిమాను రూపొందించాం. అశోక్‌ మల్హోత్రా అనే శాస్త్రవేత్త మనిషి భావతరంగాలను కొలవగలిగే మిషన్‌ను తయారు చేస్తాడు. ఆ ప్రయోగాన్ని శ్రీవల్లీ అనే అమ్మాయిపై చేస్తాడు. ఈ ప్రయోగం వల్ల ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? రెండు జన్మల మధ్య ఏర్పడిన సంఘర్షణ నుంచి ఆమె ఎలా బయటపడింది? అన్నదే చిత్ర ఇతివ త్తం. ఈ చిత్రం ఒక మానసిక విశ్లేషణగా మొదలై ట్రైయాంగిల్‌ లవ్‌ స్టోరీగా మారుతుంది. అదే సమయంలో థ్రిల్లింగా కూడా ఉంటుంది. కథలో ఊహకందని చాలా ట్విస్టులు ఉంటాయి.

ఈ సినిమా విషయంలో మీకు అందిన బెస్ట్‌ కాంప్లిమెంట్‌?
- ఈ సినిమా విషయంలో మూడు రోజుల క్రితం జరిగిన ఓ సంఘటన పీహెచ్‌డీ వచ్చినంత గర్వాన్ని తెచ్చిపెట్టింది. ఇటీవలే ఈ చిత్రాన్ని రచయిత పరుచూరి గోపాలక ష్ణకు చూపించాను. సినిమాలో వచ్చే ప్రతి మలుపు తదుపరి వచ్చే సన్నివేశమేమిటో ఊహించి చెప్పమని ఆయన్ని అడిగాను. సినిమా మొదలైన తర్వాత ఆయన అందులో పూర్తిగా లీనమైపోయారు. మొత్తం చూసిన తర్వాత చాలా బాగా చేశావు, ఇంకో ముప్పై సెకన్లలో సినిమా అయిపోతుందనగా కూడా సస్పెన్స్‌ కొనసాగడం బాగుందని అన్నారు. ఎక్కడ నా ఊహలకు అందకుండా ఆసక్తికరంగా సాగిందని చెప్పారు. నా పాతికేళ్ల రచనా ప్రస్థానంలో ఆయన మాటలే పెద్ద అవార్డుగా అనిపించాయి. అంత గొప్ప రచయితను మెప్పించడం ఆనందాన్నిచ్చింది.

ఈ సినిమా ఆలస్యానికి కారణం?
కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ వల్లే ఆలస్యమైంది. థ్రిల్లర్‌ కథ చేయడమంటే నాకిష్టం. ఈతరం ప్రేక్షకులూ వీటిని బాగా ఇష్టపడుతున్నారు. కొంతమంది రచయితలకు, దర్శకులకు చూపించా. 'ఈ మలుపుల్ని వూహించలేదు' అన్నారు. రాజమౌళి ఇంకా ఈ సినిమా చూడలేదు. కథ మాత్రం తెలుసు.

interview gallery

తమిళ చిత్రం 'మెర్శెల్‌' గురించి?
- మెర్సల్‌ చిత్రంలో విజయ్‌ కథానాయకుడు. అట్లీ దర్శకుడు. చాలా మటుకు పూర్తయింది. దీనికి స్క్రీన్‌ప్లే అందించాను. ఈ సినిమా ఆడియో సమయంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహమాన్‌ నా దగ్గరకు వచ్చి తన దగ్గర ఓ పాయింట్‌ ఉందని, దాన్ని డెవలప్‌ చేయాల్సిందిగా కోరారు. ఆయన అలా అడగటం గొప్ప విషయం. కానీ నేనే ఇంకా ఏ మాటా చెప్పలేదు. చూద్దాం.

'మణికర్ణిక' గురించి?
- ఝాన్సీ లక్ష్మీబాయి గురించి కథ రాయమని అన్నప్పుడు 'క్రిష్‌ దర్శకుడు అయితేనే కథ రాస్తా' అన్నాను. అప్పటికే 'గౌతమిపుత్ర శాతకర్ణి' విడుదలైంది కాబట్టి నిర్మాతలు ఆనందంగా అంగీకరించారు. చరిత్రను ఎక్కడా వక్రీకరించలేదు. ఇలాంటి చారిత్రక చిత్రాలను ప్రజల్లో చైతన్యం కలిగేలా తెరకెక్కించాలి. మేం అదే పని చేస్తున్నాం. ఝాన్సీగా కంగనా రనౌత్‌ నటిస్తోంది. యాక్షన్‌ ఘట్టాలకు ప్రాధాన్యం ఉంది.

రాజమౌళి 'మహాభారతం' తీస్తానని అన్నారు కదా?
- రాజమౌళికి యుద్ధాలంటే చాలా ఇష్టం. వాటి కోసమైనా మహాభారతాన్ని తప్పకుండా తీస్తాడు కానీ అదెప్పుడనేది నేనూ చెప్పలేను.

'మగధీర-2' రాజమౌళి దర్శకత్వంలో రానుందా?
చిరంజీవి, రామ్‌చరణ్‌ల కోసం ఆ స్థాయిలో ఓ కథ రాయాలని ఉంది. రాజమౌళి వెసులు బాటును బట్టి ఎప్పుడ్కెనా ఆచరణలోకి రావచ్చు.

తదుపరి చిత్రాలు?
- రెండు సినిమాలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో ఓ చిత్రాన్ని బాలీవుడ్‌లో తీస్తా. ఈ చిత్రాల వివరాలు విజయదశమికి తెలియజేస్తాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved