pizza
Mahi V. Raghav interview (Telugu) about Yatra
ఒకరిని గొప్పగా చూపించాలంటే.. మరొకరిని తక్కువ చేసి చూపించనక్కర్లేదు - మహి వి.రాఘవ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

29 January 2019
Hyderabad

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి జీవిత చరిత్రలో ఆయన చేపట్టిన పాదయాత్ర ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకుంది. ఆ పాదయాత్రలోని కీలక ఘట్టాలను ఆధారంగా చేసుకుని రూపొందించిన సినిమా 'యాత్ర'. మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి పాత్రలో నటించారు. 70 ఎం.ఎం.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మహి.వి.రాఘవ్‌ దర్శకత్వంలో విజయ్‌ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మించిన 'యాత్ర' చిత్రం ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మహి వి.రాఘవ్‌ ఇంటర్వ్యూ...

'యాత్ర' సినిమా చేయడానికి కారణమేంటి?
- వై.ఎస్‌.ఆర్‌ గురించి మూవీ చేయాలని ఉద్దేశపూర్వకంగా అనుకోలేదు. ఒక మనిషి కథను ఈ టైంలో చెప్పాలనేంత నైపుణ్యం కూడా నాకు లేదు. ఏడెనిమిదేళ్ల కాలంలో చాలా మంది వ్యక్తులను కలిసినప్పుడు, చూసినప్పుడు వారు చెప్పిన విషయాలన్ని వై.ఎస్‌.ఆర్‌గారి చుట్టూ తిరిగేవి. 'ఆనందోబ్రహ్మ' సినిమా చేస్తున్నప్పుడు వై.ఎస్‌.ఆర్‌గారి క్యారెక్టర్‌ గురించి మరింత ఆసక్తి ఏర్పడింది. నేను సాధారణంగా ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ఆయన గురించి ఎవరినైనా అడిగితే వాళ్లు ఆయన గురించి చాలా మంచిగా చెప్పేవారు. ఆయన ధైర్యసాహసాల గురించి ఎవరూ నాకు చెప్పలేదు. ఆయన వల్ల ఆరోగ్యశ్రీ వచ్చిందనో.. ఇంకేదో వచ్చిందనో చెప్పారు. ఓ రాజకీయ నాయకుడి గురించి ప్రజలు మంచిగా చెప్పుకోవడం చాలా అరుదైన విషయం. అలాంటి వ్యక్తి గురించి ఓ సినిమా చేద్దామనిపించింది. ఆయన జీవితంలో పాదయాత్ర అనే పార్ట్‌ తీసుకున్నాను. పాదయాత్ర టైమ్‌లైన్‌కి, సినిమాటిక్‌ టైమ్‌లైన్‌కి చాలా తేడా ఉంటుంది. వై.ఎస్‌.ఆర్‌గారి గురించి సినిమా చేయాలనుకున్నప్పుడు సినిమాకు వచ్చే ప్రజలు ఇన్‌ఫర్మేషన్‌ గురించైతే రావడం లేదు. ఓ డ్రామా అవసరం. ఓ ఎమోషనల్‌ ఎక్స్‌పీరియెన్స్‌ కోసం వస్తారు. కాబట్టి ఓ దర్శకుడిగా వై.ఎస్‌.ఆర్‌గారి పాదయాత్రలో ఎమోషన్‌ను ఆట్టుకునేలా చూపించడమే ముఖ్యమని అనుకున్నాను.

సినిమా చేయడానికి ముందు వై.ఎస్‌.ఆర్‌ కుటుంబ సభ్యులను కలిశారా?
- వై.ఎస్‌.ఆర్‌గారి పాదయాత్ర మీద సినిమా కదా! ఎలాంటి కాంట్రవర్సీలు ఉండవని అనుకుని కథ రాసుకున్నాను.నేను వై.ఎస్‌.ఆర్‌గారి జీవితం గురించి చెప్పదలుచుకోలేదు. ఆయన పాదయాత్ర ఘట్టాన్ని మాత్రమే చెప్పాలనుకున్నాను. జగన్‌ అన్నను.. పోస్టర్‌ రెడీ అయిన తర్వాత గోదావరి జిల్లాలో ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు వెళ్లి కలిశాను. ఆయన నేను ఆల్‌ రెడీ చూశానని చెప్పారు.

మమ్ముట్టినే ఎందుకు ఎంచుకున్నారు?
- నేననే కాదు.. ఎవరు డైరెక్ట్‌ చేసినా టాప్‌ త్రీ స్థానంలో మమ్ముట్టిగారి పేరు ఒకటి కచ్చితంగా పరిగణనలోకి తీసుకునేవారు. ఆయన అన్ని రకాల సినిమాలు చేశారు. ఓ డైరెక్టర్‌గా నేను మమ్ముట్టిగారిని వై.ఎస్‌.ఆర్‌లా చూపించాలనుకోలేదు. ఉదాహరణకు 2004లో ఆయన బాడీ లాంగ్వేజ్‌ ఒకలా ఉండేది. దాన్ని క్యారెక్టర్‌లో చూపించాలనుకోలేదు. ఓ హృదయానికి హత్తుకునేలా, హంబుల్‌నెస్‌ ఉండే వ్యక్తిని చూపించాలనుకున్నామంతు.

interview gallery



మమ్ముట్టినే మొదటి చాయిస్‌గా తీసుకున్నారా?
- ఈ సినిమాకు ఆయనే మా మొదటి ఛాయిస్‌. అయితే ఆయన తెలుగు సినిమా చేసి చాలా కాలమైంది. ఈ క్యారెక్టర్‌ చేయాలంటే తెలుగు చక్కగా మాట్లాడగలగాలి. కథ, క్యారెక్టర్‌ వినగానే ఆయన ఈ సినిమాలో నటించాలనుకున్నారు. ఈ సినిమాలో నేను ఎందుకు నటించాలి? అని అడిగారు. 'దళపతి' సినిమాలో ఓ సీన్‌లో మీరు, రజనీకాంత్‌, అరవిందస్వామి ఉంటారు. అన్ని డైలాగ్స్‌ రజనీకాంత్‌కే ఉంటాయి. మీరు కేవలం కుదరదు అనే మాట చెప్పి ఆ స్క్రీన్‌ స్పేస్‌ను క్యారీ చేశారు. అలాంటి ఓ గర్వం లేని వ్యక్తి నాకు కావాలి అన్నాను. ఆయన ఒప్పుకున్నారు. నిజంగా మమ్ముట్టిగారిని చూస్తే ఆయన ముఖంలో గర్వం కనపడదు. హంబుల్‌గా కనపడతారు. ఆయనకు అద్భుతమైన వాయిస్‌ ఉంది.

సినిమా ఎలక్షన్స్‌లో ప్రజలను ప్రభావితం చేస్తుందనుకుంటున్నారా?
- 30-40 ఏళ్ల క్రితం ఓ సినిమా ప్రజలను ఎన్నికల్లో ప్రభావితం చేస్తుందని భావిస్తే నమ్మేవాడినేమో. కానీ ఇప్పుడు ఓటర్లు చాలా తెలివిగా ఉన్నారు. ఎవరికి ఓటేస్తే మాకేంటి లాభం? అని క్యాలిక్కులేటర్‌తో లెక్కలు వేసి మరీ చెబుతున్నారు. సినిమాకు వచ్చేటప్పుడు రెండు గంటల సమయాన్ని, 150 రూపాయలను ప్రేక్షకులు మనకు కేటాయిస్తారు. నిజంగా ఇప్పుడు సినిమాలు ఎన్నికలను ప్రభావితం చేస్తే సూపర్‌స్టార్స్‌ అందరూ ముఖ్యమంత్రులైపోతారు. కానీ సినిమాలకు, రాజకీయాలకు చాలా తేడా ఉందని ప్రజలకు చాలా బాగా తెలుసు. దీని వల్ల రెండు, మూడు ఓట్లు కూడా రావని అనుకుంటున్నాను.

'యన్‌.టి.ఆర్‌ మహానాయకుడు'తోనే ఈ సినిమాను ఎందుకు రిలీజ్‌ చేయాలనుకున్నారు?
- నేను పెద్ద డైరెక్టర్‌ని కాను. నా వెనుక పెద్ద సపోర్ట్‌ ఏమీ లేదు. మమ్ముట్టిగారు మన ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే కాదు. అలాంటప్పుడు రెండు ఒకే తరహా సినిమాలు ఒకేసారి విడుదలైతే ఇలాంటి ఆసక్తికరమైన వార్తలు రావచ్చు.

ప్రత్యేకంగా పాదయాత్ర ఘట్టాన్నే ఎందుకు తీసుకున్నారు?
- సినిమాలో కేవలం పాదయాత్రకు సంబంధించిన విషయాలే కాదు. చాలా సబ్‌ప్లాట్స్‌ కూడా ఉన్నాయి. ఉదాహరణకు వై.ఎస్‌.ఆర్‌గారు ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలు ఎందుకు పెట్టారనే విషయాలను హత్తుకునేలా సబ్‌ప్లాట్స్‌లో చూపించాం. అలా చూపించాలనుకున్నప్పుడు అందుకు తగ్గ డ్రామా అవసరం. సినిమాటిక్‌ టైం లైన్‌ వేరుగా ఉంటుంది. సినిమా వై.ఎస్‌.ఆర్‌గారు పాదయాత్ర ముగించడంతో ముగుస్తుంది. ఆయన మిగతా జీవితాన్ని పెంచలదాస్‌గారి ఎమోషనల్‌ సాంగ్‌లో సింపుల్‌గా చూపించాం.

వై.ఎస్‌.ఆర్‌ ప్రవేశ పెట్టిన పథకాలను వేటిని చూపిస్తున్నారు?
- ఏ పథకాలను వై.ఎస్‌.ఆర్‌గారు ప్రవేశ పెట్టారనే కోణంలో కాకుండా అందుకు దారి తీసిన పరిస్థితులను టచ్‌ చేశాం. ఉదాహరణకు ఆరోగ్య శ్రీ పథకం పెట్టడానికి ఆయన బలమైన సిచ్యువేషన్‌ను ఎక్కడో చూశారు. 2003 వరకు ప్రజలు వై.ఎస్‌.ఆర్‌గారిని చూసింది వేరుగా ఉండొచ్చు. ఎప్పుడైతే ఆయన ప్రజలకు దగ్గరగా వెళ్లారో ఈయన ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి అని అర్థం చేసుకున్నారు. అలాగే వై.ఎస్‌.ఆర్‌గారు కూడా అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారనే విషయాన్ని దగ్గరగా వెళ్లినప్పుడు బాగా అర్థం చేసుకున్నారు.

దర్శకుడిగా ఈ కథ తయారు చేసేటప్పుడు మీలో ఆసక్తిని పెంచిన అంశాలేంటి?
- సినిమా ప్రేక్షకులను చేరడానికి ముందు కథకుడిగా, దర్శకుడిగా ఓ కథ నాకు నచ్చాలి. వై.ఎస్‌.ఆర్‌గారి గురించి నాకు తెలిసిన విషయాలు కాకుండా నాకు తెలియని విషయాలను సేకరించి సినిమా చేస్తే ఆ క్యూరియాసిటీ నాలో కంటిన్యూ అవుతుంది.

సినిమా చేసే క్రమంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా?
- అలాంటివేం లేవండీ.. ఎందుకంటే నాకు చాలా మంచి టీం దొరికింది. మంచి టీం దొరికినప్పుడు దర్శకత్వం వహించడాని కంటే సులభమైన పని మరొకటి ఉండదు. అలాంటి మంచి టీం వల్ల నాకెలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు.

చంద్రబాబు నాయుడు పాత్ర ఈ సినిమాలో ఉంటుందా?
- లేదండీ.. చంద్రబాబునాయుడుగారి పాత్ర సినిమాలో కనపడదు. ఒకరిని గొప్పగా చూపించడానికి మరొకరిని తక్కువ చేసి చూపించాల్సిన అవసరం లేదు. నా కథ ప్రకారం ఆయన పాత్రను చూపించే అవసరం రాలేదు.

వై.ఎస్‌.జగన్‌ పాత్రను ఎలా చూపిస్తున్నారు?
- వై.ఎస్‌.జగన్‌గారి పాత్ర సినిమాలో ఉండదు. అయితే రియల్‌ విజువల్స్‌ కొన్నింటిని చూపించాం. అందులో జగన్‌గారు కనపడతారు. స్క్రిప్ట్‌లో రాశాం. కానీ చివర్లో వద్దనుకున్నాం. అందుకు కారణమేమంటే.. రెండు గంటల పాటు వై.ఎస్‌గారి పాత్రతో కనెక్ట్‌ అయ్యుంటాం. అంత ఎమోషనల్‌ ఆర్క్‌లో సడెన్‌లో బాగా తెలిసిన యాక్టరో, స్టారో కనపడి వెళ్లిపోతే, ఆడియెన్స్‌కు నచ్చవచ్చు. కానీ అప్పటి వరకు ఉన్న ఎమోషనల్‌ జర్నీ పోతుందనిపించింది.

వై.ఎస్‌.జగన్‌ టీజర్‌ చూసి ఏమన్నారు?
- చూశారు. బావుందన్నారు. 'సినిమా చూస్తారా సార్‌' అని అడిగితే 'మీ నాయకుడి కథ మీరు చెప్పారు' అన్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలనేది చెబితే క్రియేటివిటీగా అది దెబ్బతింటుంది' అన్నారు. నిజంగా వాళ్లు సినిమా చేయాలనుకుంటే నేను డైరెక్టర్‌ని అయ్యుండేవాడిని కాను. ఇది ప్రొడక్షన్‌ హౌస్‌ అయ్యుండేది కాదు. వాళ్లు ఇంకా బాగా చేసుకుని ఉండేవాళ్లు ఏమో. 'ఎవరో వాళ్ల కోణంలో వాళ్ల నాయకుడిని చూపించాలనుకుంటున్నారు' అని వాళ్లు అనుకున్నారు.

మమ్ముట్టి డబ్బింగ్‌ చెప్పాలనుకున్న నిర్ణయం ఎవరిది?
- మమ్ముట్టిగారిదే. పెర్ఫామెన్స్‌ అంటే నటన, డబ్బింగ్‌ కలిస్తేనే బాగా వస్తుందని ముమ్మట్టిగారి నమ్మకం. వేరే వాళ్లతో సూట్‌ అయ్యేలా మనం డబ్బింగ్‌ చెప్పించి ఉండుంటే ఆయనంత బాగా కుదిరి ఉండేది కాదేమోనని నా అభిప్రాయం.

తదుపరి చిత్రం?
- నేను ఫిబ్రవరి 8 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. కొన్ని ఆలోచనలు ఉన్నా కూడా.. సినిమా ఫలితాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కదా.. దాన్ని బట్టి నా నిర్ణయం ఉంటుంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved