pizza
Mammootty interview (Telugu) about Yatra
వై.ఎస్‌.ఆర్‌ని ఇమిటేట్ చేయాల‌నుకోలేదు - మ‌మ్ముట్టి
You are at idlebrain.com > news today >
Follow Us

1 February 2019
Hyderabad

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి జీవిత చరిత్రలో ఆయన చేపట్టిన పాదయాత్ర ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకుంది. ఆ పాదయాత్రలోని కీలక ఘట్టాలను ఆధారంగా చేసుకుని రూపొందించిన సినిమా 'యాత్ర'. మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి పాత్రలో నటించారు. 70 ఎం.ఎం.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మహి.వి.రాఘవ్‌ దర్శకత్వంలో విజయ్‌ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మించిన 'యాత్ర' చిత్రం ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మ‌మ్ముట్టి ఇంట‌ర్వ్యూ...

తెలుగులో చాలా కాలం త‌ర్వాత సినిమా చేయ‌డానికి కార‌ణం?
- చాలా కాలం త‌ర్వాత నేను చేసిన తెలుగు సినిమా `యాత్ర‌`. ఈ సినిమా గురించి విన‌గానే నాకు స‌రిపోయే పాత్ర అనిపించింది. `స్వాతి కిర‌ణం`లో ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాన‌ని అంటున్నారు. అందుకు కార‌ణం ఏంటో నాకు తెలియ‌దు. అయితే నేను ఎప్పుడు మంచి గురించే ఆలోచిస్తాను.

మ‌హి వంటి కొత్త ద‌ర్శ‌కుడితో ఎందుకు ప‌నిచేయాల‌నుకున్నారు?
- నా కెరీర్‌లో నేను 70కిపైగా డెబ్యూ డైరెక్ట‌ర్స్‌తో ప‌నిచేశాను. అలా చూస్తే మ‌హి వి.రాఘ‌వ్ డెబ్యూ డైరెక్ట‌ర్ కాదుగా. ఈ 70 మంది ద‌ర్శ‌కుల్లో ఎక్కువ మంది ఇంకా ద‌ర్శ‌కులుగా కొన‌సాగుతున్నారు. ఇద్ద‌రు త‌మిళంలో కూడా ద‌ర్శ‌కులుగా వ‌ర్క్ చేస్తున్నారు. ఇప్పుడు అంద‌రూ పెద్ద ద‌ర్శ‌కులుగా మారారు. కొత్త ద‌ర్శకులు ఓ విష‌యాన్ని కొత్త‌గా చెప్ప‌డానికి ప్ర‌య‌త్నిస్తార‌ని బాగా న‌మ్ముతాను.

రాజ‌కీయ నాయ‌కుడిగా న‌టించారెందుకు?
- మ‌హి పూర్తి స్క్రిప్ట్‌తో పాటు నాపై న‌మ్మ‌కంతో వ‌చ్చారు. మంచి నిర్మాత‌లు ఉన్నారు. ఓ లెజెండ్రీ క్యారెక్ట‌ర్ చేయాలి. నా వంతుగా నేను ఏమైనా చేయ‌వ‌చ్చున‌నే భావ‌న రావ‌డంతో సినిమా చేయ‌డానికి అంగీక‌రించాను. సాధార‌ణంగా రెండు గంట‌ల్లో ఓ మ‌నిషి జీవిత చ‌రిత్ర‌ను చెప్పలేమ‌ని నా భావన‌. నేను చ‌దివిన స్క్రిప్ట్‌లో నిజ ఘ‌ట‌న‌లు ఉండొచ్చు.. ఉండ‌క‌పోవ‌చ్చు. అయితే వై.ఎస్‌.ఆర్‌గారి జీవితంలో కొన్ని ఘ‌ట‌న‌లను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కించిన బ‌యోపిక్ ఇది. ఇది ఆయ‌న ఫుల్ బ‌యోపిక్ కాదు. ఆయ‌న పాద‌యాత్ర ప్ర‌ధానంగా సాగే క‌థ‌. అలాగే యాత్ర అంటే పాద‌యాత్ర మాత్ర‌మే కాదు.. వ్య‌క్తుల‌ను క‌లుసుకోవ‌డం.. వారి బాధ‌ల‌ను తెలుసుకోవ‌డం, ఎమోష‌న్స్‌ను పంచుకోవ‌డం. దాని ఆధారంగానే స్క్రిప్ట్‌ను మ‌హి త‌యారు చేశాడు. రెండు గంట‌ల పాటు పాదయాత్ర‌ను ఆధారంగా చేసుకుని సినిమా చేయ‌డం అంటే కుద‌రదు. పాద‌యాత్ర చేసే క్ర‌మంలో వివిధ ర‌కాల వ్య‌క్తుల‌ను క‌లుసుకున్నారు. వారి క‌ష్ట‌సుఖాల‌ను తెలుసుకున్నారు.

వై.ఎస్‌.ఆర్‌లా న‌టించారా?
- నేను సినిమాలో న‌టించేట‌ప్పుడు వై.ఎస్‌.ఆర్‌గారిని ఇమిటేట్ చేయాల‌నుకోలేదు. ఆయన‌లా మాట్లాడి, న‌డిచి, ప్ర‌వ‌ర్తించ‌డం అనేది సాధ్యం కాదు. ఆయ‌నలా ఉండే పాత్ర‌ను ఆధారంగా చేసుకుని సినిమా చేస్తే ఆది మంచిది కాదు..స‌క్సెస్ కాదు. ఆయన క్యారెక్ట‌ర్‌లోని సోల్‌ను ఆధారంగా చేసుకుని సినిమా చేశాం.

పాత్ర కోసం రీసెర్చ్ చేశారా?
- సినిమా కోసం నేను ఎలాంటి రీసెర్చ్ చేయ‌లేదు. మ‌హి స్క్రిప్ట్ ఇచ్చాడు. దాన్ని చ‌దివి ఫాలో అయ్యానంతే. ప్ర‌జలు వేరే భాష‌ల్ని మాట్లాడొచ్చు. అంద‌రూ ఒక‌టే. అంతే త‌ప్ప పేదరికానికి రంగు ఉంటుందా? ఉండ‌దు క‌దా..

ఇప్ప‌టి వ‌ర‌కు మీరు ఎన్ని బ‌యోపిక్స్‌లో న‌టించారు?
- ఇప్ప‌టి వ‌ర‌కు నేను అంబేద్క‌ర్‌, బ‌షీర్ అనే వారి బ‌యోపిక్స్‌లో మాత్ర‌మే న‌టించాను. మ‌రే బ‌యోపిక్స్‌లో న‌టించ‌లేదు. నాతో ప‌నిచేసిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల కార‌ణంగా సినిమాను పూర్తి చేశాను.

రాజ‌కీయాల్లోకి వెళ్లాల‌నుకుంటున్నారా?
- నేను 38 ఏళ్లుగా సినిమా రంగంలో ఉన్నాను. ఇప్పుడు రాజ‌కీయాల్లోకి ఎందుకు? వెళ్లాలి. ఇవే నా రాజ‌కీయాలు.

డ‌బ్బింగ్ చెప్పే సంద‌ర్భంలో ఎలా ఇబ్బందులు ఎదురైయ్యాయి?
- తెలుగు, మ‌ల‌యాళంలో చాలా ప‌దాలు ఒకేలా ఉంటాయి. కొన్ని చోట్ల కొన్ని ప‌దాల‌ను ఒత్తి ప‌ల‌కాల్సి ఉంటాయి. వాటి విష‌యంలో కాస్త జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ డబ్బింగ్ చెప్పాను.

చాలా కాలం త‌ర్వాత తెలుగులో న‌టించారు క‌దా? ఈ గ్యాప్‌లో తెలుగు సినిమాల్లో ఎలాంటి మార్పులు క‌న‌ప‌డుతున్నాయి?
- ప్ర‌తి ఆర్టిస్టుల పాత్ర‌ల ఎంపిక‌లో సెల‌క్టివ్‌గానే ఉంటున్నారు. నేను ఒక‌ప్పుడు కె.విశ్వానాథ్‌గారి సినిమాలో న‌టించాను. ఓ ర‌కంగా చెప్పాలంటే అందులో గ్రేషేడ్ ఉన్న పాత్ర‌లో న‌టించాను. త‌ర్వాత కోడి రామ‌కృష్ణ‌గారి దర్శ‌క‌త్వంలో రైల్వే కూలి సినిమా చేయాల్సింది. కానీ కుద‌ర‌లేదు. ఇప్పుడు చేశాను. అయితే ఏదీ ప్లాన్ చేయ‌లేదు. ఈ మ‌ధ్య‌లో ప్ర‌తి సినిమా ప‌రిశ్ర‌మ‌లో చాలా మార్పులే వ‌చ్చాయి. తెలుగు సినిమా గురించి చెప్పాలంటే వైవిధ్య‌మైన సినిమాల‌కు ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. మంచి ప‌రిణామ‌మే.

ఈ మ‌ధ్య కాలంలో తెలుగులో ఏ సినిమాల‌ను చూశారు?
- `రంగ‌స్థ‌లం`, `భ‌ర‌త్ అనే నేను` సినిమాలు చూశాను.

ఇత‌ర ద‌ర్శకులు మిమ్మ‌ల్ని అప్రోచ్ అయ్యారా?
- లేదు. మంచి క‌థ‌, ద‌ర్శ‌కుడు వ‌స్తే త‌ప్ప‌కుండా సినిమా చేస్తాను.

మీరు చేయాల్సిన డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా?
- నేను చేసేవ‌న్నీ నా డ్రీమ్ రోల్స్‌.

వై.ఎస్‌.జ‌గ‌న్‌ని క‌లిశారా?
` లేదు.. క‌ల‌వ‌లేదు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved