pizza
Naga Shaurya interview (Telugu) about Chalo
ఆ రూమర్స్‌తో నాకు సంబంధం లేదు - నాగశౌర్య
You are at idlebrain.com > news today >
Follow Us

31 January 2018
Hyderabad

నాగశౌర్య, రష్మిక మండన్నా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఛలో'. వెంకీ కుడుమల దర్శకుడు. ఉషా ముల్పూరి నిర్మాత. ఈ సినిమా ఫిబ్రవరి 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నాగశౌర్యతో ఇంటర్వ్యూ...

ఐరా క్రియేషన్స్‌ ఎలా పుట్టింది?
- నాకు ఏనుగులంటే చాలా ఇష్టం. అలాగే ఇష్టదైవం వినాయకుడు. కాబట్టి ఇంద్రుడు వాహనం పేరుతో ఐరా క్రియేషన్స్‌ అనే బ్యానర్‌ను పెట్టి సినిమా చేశాను. బుజ్జి అంకుల్‌, శ్రీనివాసరెడ్డిగారు మాకు బ్యాక్‌బోన్‌లా నిలబడ్డారు. వారు లేకుంటే 'ఛలో' మూవీ ఉండేది కాదు. నాపై వారికున్న అంచనాలను ఎప్పటికీ తగ్గనీయను. మొదటి సినిమానే అయినా చాలా బాగా వచ్చింది. ఇదొక మర్చిపోలేని అనుభవం.

ఛలో సినిమా గురించి?
- సాధారణంగా ఎవరైనా అనుకున్న సినిమా కంటే బాగా అయినా డైరెక్ట్‌ చేస్తారు లేదా తక్కువగా అన్నా డైరెక్ట్‌ చేస్తారు. ఇక ఛలో విషయానికి వస్తే ఇదొక మ్యాజిక్‌లా జరిగింది. సాయిశ్రీరాంగారు ఉండటం వల్ల సినిమాను అనుకున్న దానికంటే బాగా తీయగలిగాం. రేపు సినిమా చూస్తే ఆయనెంత ముఖ్య భూమిక పోషించారో అర్థమవుతుంది.

'ఛలో' అనే టైటిల్‌ను ఎందుకు పెట్టాల్సి వచ్చింది?
- ముందు ఎలాంటి టైటిల్‌ పెట్టాలో అస్సలు తోచలేదు. మా నాన్నేగారేమో రోజు టైౖటిల్‌ విషయంలో తెగ తొందర పెట్టారు. దాంతో నేను, వెంకీ ఆలోచించసాగాం. ఓసారి రామ్‌చరణ్‌ బ్రూస్‌లీ సినిమాలో లేచలో...సాంగ్‌ చూసిన తర్వాత లేచలో అనే టైటిల్‌ అనుకున్నాం. కానీ అది బాగోదనిపించి చలో అనే టైటిల్‌ పెట్టాం.

దర్శకుడు వెంకీ కుడుముల, రష్మికలతో వర్కింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌?
- ఈ సినిమాతో దర్శకుడు వెంకీ కుడుమల మంచి డైరెక్టర్‌గా పేరు తెచ్చుకుంటాడు. వెంకీ నాకు మంచి మిత్రుడు. 'జాదూగాడు' సమయంలో నాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. స్నేహం కారణంగా నాతో సినిమా చేయాలనుందని అడగలేకపోయేవాడు. ఆ విషయం తెలిసిన నేను తనకు ఫోన్‌ చేసి కథ తయారు చేసుకో..సినిమా చేద్దాం అని అన్నాను. (తను సాధారణంగా నన్ను చిట్టి అని పిలుస్తుంటాడు) 'చిట్టి.నాకు సినిమా కంటే స్నేహం ముఖ్యం' అని అన్నాడు. 'పర్లేదు..కథ తీసుకురా! సినిమా చేద్దాం'అని అన్నాను. సరేనని తను ఒక లైన్‌ చెప్పాడు. నేను ఇంకేదైనా చేద్దామని అన్నాను. అప్పుడు క్రైమ్‌ కామెడీ కథ చెప్పాడు. కానీ నువ్వు పెద్ద డైరెక్టర్‌వి అవుతావు.. కాబట్టి నువ్వు ఓ కమర్షియల్‌ సినిమా చేద్దామని అన్నాను. అప్పుడు తను 'ఛలో' కథను సిద్ధం చేశాడు. అలాగే హీరోయిన్‌ రష్మిక కూడా మంచి సపోర్టివ్‌ ఆర్టిస్ట్‌. అందరికీ నచ్చే ఎలిమెంట్స్‌తో సినిమా ఉంటుంది.

సినిమాలో ఎంత వరకు ఇన్‌వాల్వ్‌ అయ్యారు?
- గతంలో నా సినిమాల విషయంలో నేను ఇన్‌వాల్వ్‌ అయ్యేవాణ్ణి కాను. అయితే సినిమా పోతే మాత్రం ముందు నన్నే క్వశ్చన్‌ చేస్తున్నారు. ఫలితంగా దెబ్బలు కూడా తిన్నాను. అందుకే కొంచెం ఎక్కువ భాద్యత తీసుకుని ఈ కథ కోసం వెంకీతో కలిసి 7-9 నెలల పాటు కష్టపడ్డాం. నాకు ఏదైనా నచ్చకపోతే వెంకీకి చెప్పి మార్పించుకునేవాడిని. బాధ్యత నాదే అయినప్పుడు సినిమాలో నేను ఇన్‌వాల్వ్‌ కావాలని నిర్ణయించుకున్నాను. అది కూడా షూటింగ్‌కు వెళ్లడానికి ముందుగానే ఇన్‌వాల్వ్‌ అవుతానే తప్ప.. షూటింగ్‌ స్టార్ట్‌ అయిన తర్వాత ఇన్‌వాల్వ్‌ కాను.

మీ క్యారెక్టర్‌ ఎలా ఉంటుంది ?
- నిజ జీవితంలో నేనె ఎలా అయితే రఫ్‌గా, జోవియల్‌గా ఉంటానో సినిమాలో కూడా అలానే ఉంటాను. డైరెక్టర్‌ వెంకీ కావాలనే నా పాత్రను అలా డిజైన్‌ చేశాడు. హీరోయిన్‌తో ఉన్న సన్నివేశాలే తప్ప మిగతా అన్ని సన్నివేశాల్లో నిజ జీవితంలో ఎలా ఉంటానో అలాగే కనపడ్డాను.

సినిమా కథేంటి ?
- ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులోని ఒక ఊరు కొన్ని కారణాల వలన తెలుగు, తమిళం అని రెండుగా విడిపోతుంది. రెండు ఊళ్లకు మధ్యన కంచె ఉంటుంది. ఎవరైన కంచె దాటితే సాంప్రదాయం ప్రకారం చంపేసుకుంటారు. అలాంటి ఊళ్లోకి నేను ఎందుకు వెళతాననేదే కథ. క్లైమాక్స్‌లో క్లాసులు పీకాను, అలాగే క్లైమాక్స్‌లో విలన్స్‌ను కొట్టను. మరి ఏం చేశాననేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

interview galleryసినిమా బిజినెస్‌ ఎలా జరిగింది?
- సినిమా బిజినెస్‌ అంతా పూర్తయ్యింది. ఒక్క నైజాం మాత్రమే ఉంచుకుని మిగతా అన్ని ఏరియాలు అమ్మేశాం. హిందీ రైట్స్‌ కూడా అమ్ముడైపోయాయి.

సంగీతానికి మంచి రెస్పాన్స్‌ వచ్చినట్లుంది?
- అవునండీ ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వచ్చింది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ సాగర్‌ మహతిగారు ఇచ్చిన ట్యూన్స్‌ అందరికీ నచ్చాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా ఎక్సలెంట్‌గా కుదిరింది.

నిర్మాణ బాధ్యతలు ఎలా అనిపించాయి?
- ప్రొడక్షన్‌ వ్యవహారాలను అమ్మ, నాన్నలే దగ్గరుండి చూసుకున్నారు. కొత్త సినిమా కాబట్టి మొదట్లో ఏవీ తెలీక కొంత ఇబ్బందిపడినా తర్వాత తర్వాత తెలుసుకుని చేసుకున్నాం. 11 రోజుల్లో మూడు సీన్లని గుంటూరులో చేశాం. అవి చూశాక అమ్మకి ఫోన్‌ చేసి ప్రొడక్షన్‌ వాల్యూస్‌ చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయని అన్నాను. అప్పటి నుండి అమ్మ అన్నింటినీ స్వయంగా దగ్గరుండి చూసుకుని సినిమా బ్రహ్మాండంగా వచ్చేలా చేశారు.

మీకు నిహారికతో పెళ్లి అని వార్తలు వస్తున్నాయి కదా?
- నిన్న రాత్రి నా స్నేహితులు చెబితే నాకా విషయం తెలిసింది. నాకు, వస్తున్న వార్తలకు ఏ సంబంధం లేదు. నాకు ఎవరితో సంబంధం లేదు. మూడునాలుగేళ్ల తర్వాత మా అమ్మగారు బలవంతం పెడితే, పెళ్లి చేసుకుంటాను.

తదుపరిచిత్రాలేంటి?
- సినిమాటోగ్రాఫర్‌ సాయి శ్రీరామ్‌తో సినిమా చేయబోతున్నాను. ఇది ఫిబ్రవరి నెలాఖరులో ప్రారంభం అవుతుంది. ఇది లవ్‌స్టోరీ. రెండున్నర ఏళ్ల క్రితమే ఆ సినిమా చేయాల్సింది. కానీ ఇప్పటికి కుదిరింది. దాని తర్వాత శ్రీనివాస్‌ అనే కొత్త దర్శకుడితో 'నర్తనశాల' సినిమాను చేస్తాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved