pizza
Rajasekhar interview (Telugu) about Garuda Vega
నా ఇమేజ్‌, అనుభ‌వానికి త‌గ్గ సినిమా `పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం` - డా.రాజ‌శేఖ‌ర్‌
You are at idlebrain.com > news today >
Follow Us

1 November 2017
Hyderabad

డా.రాజశేఖర్ హీరోగా పవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం’. ఈ చిత్రంలో రాజశేఖర్ ఎన్.ఐ.ఎ. ఆఫీసర్‌గా కనిపిస్తారు. రాజశేఖర్ కెరీర్‌లోనే హయ్యుస్ట్ బడ్జెట్ వుూవీగా, టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా డా. రాజశేఖర్ వూట్లాడుతూ..

నా కెరీర్‌లోనే బిగ్ బ‌డ్జెట్‌...
నా కెరీర్‌లోనే బిగ్ బ‌డ్జెట్ మూవీ `పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం`. దాదాపు ముప్పై కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టి సినిమా తీశాం. అంత‌కు ముందు నేను తీసిన `గ‌డ్డం గ్యాంగ్`..త‌మిళ చిత్రం `సూదు క‌వ్వుమ్‌`కు రీమేక్‌. అలాగే, `మ‌హాంకాళి`..ఓ హిందీ సినిమాకు రీమేక్‌. ఆ రెండు సినిమాలు నా ఇమేజ్ కంటే త‌క్కువ‌గా ఉండ‌టంతో ప్రేక్షకాద‌ర‌ణ పొందలేదు. అయితే `పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం` నా ఇమేజ్‌కు, అనుభ‌వానికి స‌రిపోయే చిత్రం.

సినిమా ఎలా ప్రారంభ‌మైంది..
- ఏడాదిన్న‌ర నుండి నాకు హిట్స్ లేన‌ప్పుడు, న‌న్ను అంద‌రూ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా నటిస్తారా? లేదా విల‌న్‌గా న‌టిస్తారా? అని అడుగుతుండేవారు. ఆస‌మ‌యంలో ప్ర‌వీణ్ స‌త్తారుగారు న‌న్ను క‌లిశారు. ఆయ‌న నా `మగాడు` సినిమా చూసి దాని ఇన్‌స్పిరేష‌న్‌తో `మ‌గాడు 2` అనే టైటిల్‌తో 2006లో ఓ క‌థ‌ను త‌యారు చేసుకున్నారు. నేను మంచి హిట్స్ మీదున్నప్పుడు హ‌లీవుడ్ బాండ్ త‌ర‌హా సినిమాలు చేద్దామ‌ని చాలా మంది ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో అంటే చేద్దాం సార్..అనే వారు కానీ, ఎవ‌రూ చేయ‌డానికి ముందుకు రాలేదు. ఈ క‌థ విన‌గానే నాకు హాలీవుడ్ సినిమాలే గుర్తుకు వ‌చ్చాయి. స‌బ్జెక్ట్ విన‌గానే స్ట‌న్ అయ్యాను. త‌ను పూర్తి బౌండెడ్ స్క్రిప్ట్‌తో వ‌చ్చాడు. నాకు క‌థ చాలా బాగా న‌చ్చ‌డంతో సినిమా చేస్తాన‌ని త‌న‌తో అన్నాను.

క్యారెక్టర్ గురించి..
పోలీస్, ఫారెస్ట్, ఆర్మీ, నేవీ ఇలా పలు డిపార్ట్‌మెంట్స్‌లో సమర్ధులైన వారిని ఎన్.ఐ.ఎ సభ్యులుగా సెలక్ట్ చేసుకుంటారు. వీరికి చక్కగా శిక్షణ ఇస్తారు. ఈ సినిమా విషయానికి వస్తే నేను, రవివర్మ సహా మిగిలినవారంతో ఎన్‌ఐఎ సభ్యులుగా కనిపిస్తాం. మా పై అధికారి పాత్రలో నాజర్‌గారు కనపడతారు. ఇక నా పాత్ర విషయానికి వస్తే ఎన్‌ఐఎ ఆఫీసర్ అయినా నాకు కూడా కుటుంబం ఉంటుంది. ఒక పక్క కుటుంబం, మరో పక్క వృత్తి..రెంటిని ఎలా బ్యాలెన్స్ చేశాననేదే సినిమా. సాధారణంగా ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు బాండ్ తరహాలో తెరకెక్కిస్తుంటారు. కానీ దర్శకుడు ప్రవీణ్ సత్తారుగారు బాండ్ తరహాలోనే సినిమాను తెరకెక్కిస్తూ, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కూడా మిక్స్ చేశారు.

నిర్మాత కోటేశ్వ‌ర్ రాజు గురించి...
- నేను ఈ సినిమా చేయడానికి మరో ప్రధాన కారణం జీవిత. ‘ఈ సినిమా నీకు కచ్చితంగా కమ్ బ్యాక్ మూవీ అవుతుంది..తప్పకుండా చేద్దాం’ అని చెప్పింది. ఈ కథతో కోటేశ్వరరాజుగారిని కలిశాం. ఆయనకు కథ నచ్చింది. సినిమాను భారీగానే చేద్దామని అన్నారు. అన్నట్లుగానే మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీగా సినిమా నిర్మించారు.

ఫిట్‌గా ఉండటానికని..
వందేమాతరం, ప్రతిఘటన, అంకుశం సినిమాల సమయంలో నేను ఎంత ఫిట్‌గా అయితే ఉన్నానో, ఇప్పుడు కూడా అంతే ఫిట్‌గా ఉన్నాను. స్టంట్స్ విషయంలో మీరు కాంప్రమైజ్ కావద్దు, నేను కష్టపడటానికి రెడీ అని ప్రవీణ్‌కు చెప్పాను. అలాగే ఫిట్‌గా ఉండాలని నేను ట్రయినర్‌ను అపాయింట్ చేసుకుని రెడీ అయ్యాను.

హార్ట్ ఎటాక్ వచ్చింది...
మరో వారం పది రోజుల్లో షూటింగ్‌కు వెళదాం అనుకంటున్న తరుణంలో హార్ట్ ఎటాక్ వచ్చింది. ఛాతి అంతా నొప్పిగా ఉండేది. చెకప్ చేయిస్తే, అంతా నార్మల్‌గానే ఉందని చెప్పేవారు. చెన్నై అపోలో హాస్పిటల్‌కు వెళ్లి చెకప్ చేయించాను. వారు కూడా ఏం లేదని చెప్పారు. సరే హైదరాబాద్‌కు వచ్చేద్దామని బయలుదేరాం. దారిలో వాంతులు అయ్యాయి. దాంతో ఇంటికి కూడా వెళ్లకుండా నేరుగా హాస్పిటల్‌కు వెళ్లాం. ట్రాప్‌మాయ్ అనే టెస్ట్ ఉంది. దాన్ని చేసి చూద్దామని మళ్లీ అపోలోకు వెళ్లాం. అప్పుడు గుండెనొప్పి కారణమయ్యే ఓ ప్రొటీన్ శరీరంలో ఉంది. దాని వల్ల గుండె నొప్పి వస్తుందని అన్నారు. వెంటనే స్కానింగ్ సహా అన్నీ టెస్టులు మళ్లీ చేయించారు. ఆపరేషన్ చేసి స్టంట్ పెట్టారు. డాక్టర్స్ మూడు నెలలు విశ్రాంతి అవసరం అని అన్నారు. దీంతో యూనిట్ అంతా డల్ అయిపోయింది. కానీ నేను రెండు వారాల సమయం మాత్రమే తీసుకోమని, నేను షూటింగ్‌కు అటెండ్ అవుతానని చెప్పాను. ఎందుకంటే ఇంత మంచి సబ్జెక్ట్‌ను వదిలేస్తే, మళ్లీ జరగకపోవచ్చు అనుకుని, అన్నట్లుగానే రెండు వారాల్లో సిద్ధమయ్యాను.

interview gallery

రిస్క్ చేశాం...
సినిమా రంగంలో మంచి నటుడు, సినిమా బావుంది అనుకుంటారు. కానీ బిజినెస్ విషయానికి వస్తే, ఆ స్టార్ గత సినిమా ఎంత కలెక్ట్ చేసిందని ఆలోచిస్తాస్తారు. ఇలాంటి తరుణంలో నాపై పాతికకోట్లకు పైగా బడ్జెట్ పెట్టి సినిమా చేయడం అంటే కచ్చితంగా రిస్కే. అయితే టీజర్, ట్రైలర్ చూసి చాలా మంది బయ్యర్స్ సినిమాను కొనడానికి ముందుకు వచ్చారు. ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పటి వరకు నా సినిమాలకు ఓవర్‌సీస్ మార్కెట్ ఉండేది కాదు, ఈ సినిమా ప్రారంభంలోనే ఓవర్‌సీస్ మార్కెట్ పూర్తయ్యింది. అలాగే ఇక్కడ కూడా ఒక్కొక్క ఏరియాను కొనుక్కొవడానికి ఇద్దరు, ముగ్గురు బయ్యర్లు పోటీ పడ్డారు. అలాగే హిందీ డబ్బింగ్ హక్కులు కూడా అడుగుతున్నారు.

అమ్మ దూరం కావడం చాలా బాధించింది..
సినిమా రంగంలోని వారందరూ సినిమాలు తీసే చెడిపోతారని మా అమ్మగారు అనుకునేవారు. నేను కూడా సినిమాల్లోనే నష్టాలను ఫేస్ చేశాను. అవన్నీ చూసి ఆవిడ భయపడిపోయారు. నా ఫ్యామిలీ కోసమే, నేను ఇకపై స్వంతంగా సినిమాలు నిర్మించకూడదని నిర్ణయం తీసుకున్నాను. అయితే నేను ఈ సినిమాతో నన్ను నేను నిరూపించి అమ్మకు చూపించాలనే కోరిక బలంగా ఉండేది. నాకు మళ్లీ డబ్బులు, పేరు వస్తుందని అమ్మకు చూపించాలనుకున్నాను. ముఖ్యంగా ఈ సినిమా చూడాలని ఆమె చాలా అనుకున్నారు. టీజర్ విడుదల సమయంలో కూడా ఆమె ప్రెస్‌మీట్‌కు వచ్చారు. టీజర్ చూసి బావుందని అప్రిసియేట్ చేశారు. అంతా బావుంది. అని అనుకుంటున్న తరుణంలో అనుకోకుండా మమ్మల్ని విడిచి పెట్టేసి వెళ్లిపోయారు.

సబ్జెక్ట్‌లో విషయం ఉండాలి..
నేను విలన్‌గా అయినా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అయినా చేయడానికి సిద్ధమే. అయితే సబ్జెక్ట్‌లో విషయం ఉంటేనే చేస్తాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved