6 August 2018
Hyderabad
అడివిశేష్, శోభితా ధూళిపాళ హీరో హీరోయిన్‌గా అభిషేక్ పిక్చర్స్, విస్తా డ్రీమ్ మర్చంట్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో.. శశి కిరణ్ తిక్క దర్శకుడిగా.. అభిషేక్ నామ, టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన చిత్రం `గూఢచారి`. ఆగస్ట్ 3న సినిమా విడుదలైంది. ఈ సందర్బంగా దర్శకుడు శశికిరణ్ తిక్క పాత్రికేయులతో మాట్లాడుతూ...
- చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమా చూసిన వాళ్లు తిట్టారు. మెచ్చుకుంటారనుకున్నాం కానీ.. పొగడ్తల్లో ముంచెత్తుతారని అనుకోలేదు.
- ఇంగ్లీష్ సినిమాల ప్రభావం ఉంది. కారణం చిన్నప్పట్నుంచి ఇంగ్లీష్ సినిమాలు చూశాం. అలాగని తెలుగు సినిమాలు చూడలేదని కాదు. చూస్తూనే ఉంటాం. సడెన్‌గా ఓ హాలీవుడ్ స్క్రిప్ట్ ఇచ్చి సినిమా చేయమంటే చేయలేను. ఎందుకంటే కల్చర్ ప్రకారం నేను తెలుగువాడిని. షాట్ మేకింగ్, స్టైలిష్ నెస్ ఇంగ్లీష్ సినిమాలా అనిపించవచ్చు కానీ.. కంటెంట్ పరంగా తెలుగు సినిమానే.
- శేఖర్ కమ్ములగారి దగ్గర లీడర్ సినిమాకు పనిచేశాను. నేను, శేష్ కలిసి రాయడం వల్ల.. యాక్షన్ సినిమా చేశాం. ఈ సినిమా చేయడానికి ముందు యాక్షన్ సీన్స్ ఎలా చేయాలని నేర్చుకుని తీశాం.
- రిజల్ట్ గురించి ఆలోచించలేదు. హిట్ కొట్టాలని సినిమా తీయలేదు. మంచి సినిమా తీయాలని చేశాం. ఓ మొండి ధైర్యంతో ముందుకెళ్లిపోయాను.
- శేష్‌లేకుండా నేను సినిమా తీసుంటే ఓ డ్రామా బేస్‌తోనే, రొమ్ కామ్ మూవీనో చేసేవాడిని. గూఢచారి లాంటి సినిమా చేయలేకపోయేవాడిని. యాక్షన్ సినిమా చేయలేకపోయేవాడిని. ఎందుకంటే నాకు గొడవలంటే ఇష్టం ఉండదు.
- మనం చిన్నప్పుడు తిన్న స్వీటు రుచిని మనం మరచిపోయుంటాం. చాలా సంవత్సరాల తర్వాత తింటే మనకు ఆ రుచి ఇంకా బాగుంటుందనిపిస్తుంది. అలా స్పై సినిమాలు వచ్చిచాలా కాలమైంది. అంత గ్యాప్ రావడం కూడా మాకు మంచిదే అయింది. అప్పట్లో కృష్ణగారు, చిరంజీవిగారు చేసిన స్పై మూవీస్ అప్పటి టెక్నాలజీకి తగ్గట్టు అప్‌డేటెడ్‌గా ఉంటాయి. ఇప్పటి విషయానికి వస్తే ఇది డిజిటిల్ యుగం. దీనికి తగ్గట్టు సినిమా చేయాలి. ఇప్పటి టెక్నాలజీ ప్రకారం సినిమానే చేయాలి.
- సుప్రియగారిని ఈ సినిమాలో నటింప చేయాలనేది అడివిశేష్ ఆలోచనే. తనకు సుప్రియ మంచి ఫ్రెండ్. నాకు ఆమె ముఖ పరిచయమే. రా ఆఫీసర్ రోల్‌కి సుప్రియగారైతే సూట్ అవుతారనిపించింది. అన్నపూర్ణ స్టూడియో మూవీ మేకింగ్‌లో కమాండింగ్‌గా ఉండే సుప్రియగారు అంతే కమాండింగ్‌గా కనపడితే బావుంటుందనిపించింది. ముందు ఆవిడ నటించడానికి ఒప్పుకోలేదు. అడగ్గ అడగ్గా.. సరే ఆడిషన్ చేద్దామని అన్నారు. చేసిన తర్వాత కూడా ఆమె చేద్దామా వద్దా? అనే ఆలోచనలోనే ఉండిపోయారు. మొదటిరోజు షూటింగ్‌కి వచ్చిన ఆవిడ.. `నేను సరిగ్గా చేయకపోతే బ్యాక్ అప్ పెట్టుకన్నారు కదా` అన్నారు. ఏం కాదు మీరు చేయండి అని మేం ఆమెను ఒప్పించాం.
- గూఢచారి సీక్వెల్ చేస్తే బావుంటుందని శేష్ కూడా అన్నారు. ఇలాంటి సిరీస్‌లో ఎన్ని కథలైనా చేసుకోవచ్చు. శేష్ కూడా వేరే సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. నేను బయట సినిమా చేసిన తర్వాత ఈ సీక్వెల్ గురించి ఆలోచిస్తాం.
- ప్రస్తుతం ఏ సినిమా చేయడం లేదు. నా మైండ్‌లో కథలకు సంబంధించిన ఐడియాలున్నాయి. పూర్తిస్థాయి కథలు ప్రిపేర్ చేయలేదు.