
17 July 2016
Hyderabad
శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై నందమూరి బాలకృష్ణ, మోహిని హీరోహీరోయిన్లుగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాతగా రూపొందిన చిత్రం `ఆదిత్య 369`. 1991, జూలై 18న విడుదలైన ఈ చిత్రం ఈ ఏడాదికి పాతిక వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంలో నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తో ఇంటర్వ్యూ...
`ఆదిత్య 369`సినిమా అలా ప్రారంభమైంది....
శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై స్టార్ట్ చేసిన తొలి చిత్రం చిన్నోడు పెద్దోడు. మంచి సక్సెస్ వచ్చింది. ఇరవై రోజుల తర్వాత ఎస్.పి.బాలసుబ్రమణ్యంగారు నాకు ఫోన్ చేసి నన్ను ఇంటికి పిలిస్తే వెళ్లాను. ఆయన నాతో కృష్ణ నాకు సింగీతం శ్రీనివాసరావుగారు మంచి కథ చెప్పారు. నాకు నచ్చింది. నువ్వు విని, సినిమా చేస్తే నీకు మంచి స్థానం ఏర్పడుతుందని చెప్పారు. ఆయన మాటలపై సింగీతంగారిని కలిశాను. టైమ్ ట్రావెల్‌పై ఓ కథ ఉందండి. దానికి ప్రేరణగా చాలా సినిమాలున్నప్పటికీ దానికేం సంబంధం లేకుండా గతంలో కృష్ణదేవరాయల కాలంలోకి వెళితే ఎలా ఉంటుంది. అలాగే భవిష్యత్‌లోకి వెళితే ఎలా ఉంటుంది అనే కథను వివరించారు. చాలా కొత్తగా ఉంది సార్ అని వెంటనే బాలుగారిని కలిసి ఈ సినిమా తప్పకుండా చేద్దామని అన్నాను. ఆయన కథ చెప్పేటప్పుడు కృష్ణదేవరాయులు అంటే ఇప్పుడు బాలకృష్ణగారు చేస్తే బావుంటుందని అన్నారు. మేం బాలకృష్ణగారిని కలిశాం. ఆయన మా థాట్ వినగానే కొత్త నిర్మాతనైనా ఏ మాత్రం ఆలోచించకుండా సినిమా చేద్దామని అన్నారు. సినిమా అలా ప్రారంభమైంది.జంధ్యాలగారు, ఇళయరాజాగారు ఇలా మంచి టెక్నిషియన్స్ ఈ సినిమాకు వర్క్ చేశారు.
ఇప్పుడు 60 కోట్లు అవుతుంది...
పదకొండు నెలలు పాటు అందరూ కష్టపడి చేశాం. ఇలాంటి సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. ఇంజనీర్‌గా, రాయలవారుగా బాలకృష్ణగారు అద్భుతంగా నటించారు. 110రోజులు వర్కింగ్ డేస్ జరిగాయి. 1కోటి 52 లక్షల రూపాయలు ఖర్చయ్యింది. అదే ఇప్పుడు ఎంతో ప్లానింగ్‌తో చేస్తే ఇదే సినిమాకు 60 కోట్ల సినిమా అవుతుంది. పిల్లలు, క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ చూశారు. అమ్రిష్ పురి విలన్, తెనాలి రామకష్ణగా చంద్రమోహన్, సైంటిస్ట్‌గా టిను ఆనంద్ తదితరులు చక్కగా వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు. కొంత మంది ఆడియెన్స్ అయితే సినిమా అడ్వాన్స్ అని అన్నారు కూడా అయితే సక్సెస్ వల్ల మా బడ్టెట్‌ను రాబట్టుకోగలిగాం.
సీక్వెల్ గురించి ఇప్పుడే చెప్పలేను...
- `ఆదిత్య 369` సినిమాకు సీక్వెల్‌ను సింగీతంగారు, బాలయ్యగారు చేస్తున్నారని వార్తలు వచ్చింది. అయితే కార్యరూపం దాల్చేలోపు బాలయ్యగారు వందవ చిత్రంతో బిజీ అయిపోయారు. అయితే సీక్వెల్ చేస్తానా లేదా అని ఇప్పుడే చెప్పలేను.
ఈ ఏడాది బాగా కలిసి వచ్చింది....
- ఈ ఏడాది నాకు బాగా కలిసి వచ్చింది. నేను నిర్మాతగా చేసిన జెంటిల్‌మన్ మంచి సక్సెస్ సాధించి 50రోజుల వేడుకను జరుపుకోవడానికి సిద్ధమైంది. అలాగే నేను గర్వంగా ఫీలయ్యే ఆదిత్య 369 చిత్రం కూడా 25 వసంతాలు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉంది. ఈ ఏడాది డబుల్ ధమాకాలా ఫీల్ అవుతున్నాను.
అది నాలోని లోపమే....
- `ఆదిత్య 369` సినిమా తర్వాత నాపై అంచనాలు ఏర్పడిన మాట వాస్తవమే. అయితే నాలో అగ్రెసివ్ నెస్ లేకపోవడంతో నేను వెంటనే సినిమాలు చేయలేకపోయాను. అది నాలోని లోపమే అని అనుకుంటున్నాను. చాలా మంచి అవకాశాలు వచ్చాయి కూడా. ఉదాహరణ చెప్పాలంటే ఆదిత్య 369 విడుదల తర్వాత నేను చిరంజీవిగారిని కలిసి చిన్నపిల్లలను ఆకట్టుకునేలా ఓ రెండు యాడ్స్ కావాలని అడిగాను. ఆయన ఏమాత్రం కాదనకుండా వెంటనే దూరదర్శన్‌లో యాడ్స్ ఇచ్చారు. అలాగే విజయశాంతిగారు కూడా యాడ్స్ చేశారు. చాలా మంది ఇలాంటి సినిమా చేశానని మెచ్చుకున్నా నేను నా తప్పిదంతో నా తలుపులు నేనే మూసుకున్నానని చెప్పాలి. అంతెందుకు బాలయ్యగారినే మళ్ళీ అప్రోచ్ కావడానికి మూడేళ్ళు పట్టింది. అభిమన్యు, యోధ, హు యామ్ ఐ ఇలా సినిమాలు డబ్ చేసుకుంటూ వెళ్ళాను. అలా స్లో అయ్యాను. ఇప్పుడు వేగంగా పరిగెత్తాలనుకుంటున్నాను.
ఆడియెన్స్ లో చాలా మార్పు వచ్చింది...
- ఇప్పుడు ప్రేక్షకుల్లో చాలా మార్పు వచ్చింది. ఉదాహరణ చెప్పాలంటే పితామగన్ సినిమాను నన్ను కొనమంటే , సినిమా నాకు నచ్చినా ఆడియెన్స్ కు నచ్చేదేమోనని వద్దన్నాను. కానీ శివపుత్రుడు పేరుతో ఇక్కడ పెద్ద సక్సెస్ అయ్యింది. అలాగే రీసెంట్‌గా బిచ్చగాడు డబ్బింగ్ సెన్నేషనల్ హిట్ అయ్యింది. కానీ నన్ను తెలుగులో విడుదల చేయాలంటే మాత్రం ఆలోచించేవాడిని. కానీ సినిమాల సక్సెస్ చూస్తే ఆడియెన్స్‌లో మార్పు వచ్చిందనిపిస్తుంది.
బాలకృష్ణగారితో వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్...
- ఆదిత్య 369 సినిమా కోసం బాలకృష్ణగారు చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా శ్రీ కృష్ణదేవరాయల గెటప్ విషయంలో లుక్, కాస్ట్యూమ్స్ విషయలో జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ డేడికేషన్ ఆయనలో ఇప్పటికీ కనపడుతుంది. స్వర్గీయ నందమూరి తారకరామారావుగారు సినిమా చూసి బావుందని మెచ్చుకున్నారు. ముఖ్యంగా శ్రీ కృష్ణదేవరాయల గెటప్‌లో బాలకృష్ణగారి నటనను బాగా అప్రిసియేట్ చేశారు. బాలకృష్ణగారితో మంచి అనుబంధం ఏర్పడింది.
అప్పట్లోగ్రాఫిక్స్ చేయడం కుదరలేదు...
- అప్పట్లో గ్రాఫిక్స్ అంత డెవలప్ కాలేదు. ఏదో చిన్న చిన్న విషయాలకు తప్ప మిగతావాటికి వస్తువులను ఉపయోగించాం. టైమ్ మిషన్‌ను తయారీలో సింగీతంగారు చాలా కష్టపడ్డారు. దాన్ని తీసుకోవాలంటే లారీల్లో తీసుకెళ్ళేవాళ్లం. ఏడారి సెట్‌ను చెన్నై గోల్డెన్ బీచ్‌లో చిత్రీకరించాం. సినిమా చిత్రీకరణ అవగానే టైమ్ మిషన్‌ను బీచ్ వారికే డొనేట్ చేశాం. అయితే కంటెంట్‌ను తెప్పించి డిజిటిలైజ్ చేయాలనే ఆలోచన ఉంది. అపూర్వశక్తి369 పేరుతో తమిళంలో, మిషన్ 369 పేరుతో హిందీలో విడుదల చేశారు. రెండు భాషల్లోనూ సక్సెస్ అయ్యింది.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్...
- రెండు స్క్రిప్ట్స్ సిద్ధంగా ఉన్నాయి. వాటిని తుది మెరుగులు దిద్దుతున్నాం.