pizza
P Sunil Kumar Reddy interview about Gulf
`గ‌ల్ఫ్‌` చిత్రం నా రెండున్న‌రేళ్ల క‌ష్టం - పి.సునీల్‌కుమార్ రెడ్డి
You are at idlebrain.com > news today >
Follow Us

10 October 2017
Hyderabad

శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు, యమ్. రామ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న `గల్ఫ్`. అక్టోబ‌ర్ 13న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు పి.సునీల్‌కుమార్ రెడ్డితో ఇంట‌ర్వ్యూ...

రెండున్న‌రేళ్ల క‌ష్టం...
- ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేసిన సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే ఈ నెల 13న విడుద‌ల కాబోతున్న `గ‌ల్ఫ్` చిత్రం మ‌రో ఎత్తు. సాధారణంగా నా సినిమాకు రీసెర్చ్ వ‌ర్క్‌ను నేను ఎక్కువంటే ఎక్కువ‌గా ఆరు నెల‌లు తీసుకుని ఉంటాను. కానీ గ‌ల్ఫ్ సినిమాకు అలాకాదు. చాలా స‌మ‌యం ప‌ట్టింది. రెండున్న‌రేళ్ల క‌ష్ట‌మిది. నా గుండెకు ద‌గ్గ‌రైన చిత్రం. చాలా క్లిష్ట‌మైన సబ్జెక్ట్ కాబ‌ట్టి సినిమా కోసం చాల రీసెర్చ్‌ చేయాల్సి వచ్చింది. అందుకే ఎక్కువ స‌మ‌యం ప‌ట్టింది.

అందుకే చేశాను...
- ఇప్ప‌టి వ‌ర‌కు అమెరికా వ‌ల‌స‌లు మీద సినిమాలొచ్చాయి. కానీ గ‌ల్ఫ్ వ‌ల‌స‌లు గురించి ఇప్ప‌టి వ‌ర‌కు ఓ సినిమా కూడా రాలేదు. ముఖ్యంగా తెలుగులో గ‌ల్ఫ్ కు సంబంధించిన సినిమా లేదు. చాలా సెన్సిటివ్ పాయింట్ అందుకనే నేను సినిమా చేద్దామ‌నుకున్నాను. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల నుండే గ‌ల్ఫ్ దేశాల‌కు ఎక్కువ మంది జీవ‌నోపాధి కోసం వ‌ల‌స వెళుతుంటారు. వెళ్లిన వారిలో 95 శాతం క‌ష్టాలు ప‌డుతున్న‌వారే.ముఖ్యంగా ఆడ‌వాళ్ల ప‌రిస్థితి ఇబ్బందిగా ఉంటుంది. వారిపై హింన ఎక్కువ‌గా జ‌రుగుతుంటుంది. ఇటువ‌లంటి వారి పట్ల ప్రభుత్వాలు కాస్త ఎక్కువగా స్పందించాలి. కానీ అలా జరగడంలేదు. ప్రభుత్వంలో, నాయకుల్లో ఆ స్పందన తీసుకురావడం కోసమే ఈ సినిమా చేశాను.

ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు...
- గ‌ల్ఫ్ బాధితుల‌ను ప్ర‌భుత్వాలు కానీ, నాయ‌కులు కానీ ప‌ట్టించుకోవ‌డం లేదు. పోనీ ఎందుకులే అనుకుందామా అని అనుకుంటే.. ఏటా మన తెలుగు రాష్ట్రాలకు వాళ్ళ ద్వారా 30,000 కోట్ల రూపాయలు వస్తోంది. అలాంటి వారిని గురించి ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ గ‌ల్ఫ్ కంట్రీస్‌లో ఎక్కువ‌గా తెలుగువారే ప‌నిచేస్తున్నారు. కొంత‌మందైతే ఎళ్ల త‌ర‌బ‌డి కుటుంబాల‌ను వ‌ద‌లి అక్క‌డే క‌ష్ట‌ప‌డుతున్నార‌ని నా రీసెర్చ్‌లో తెలిసింది.

న‌మ్మ‌కంతో చేశాను..
- సినిమాలో మంచి ప్రేమ‌క‌థ ఉంటుంది. తెలంగాణ నుండి అక్క‌డి కూలీగా వెళ్లిన అబ్బాయికి, ఆంధ్ర నుండి బ్ర‌తుకు తెరువుకు గ‌ల్ఫ్ దేశానికి వెళ్లిన అమ్మాయికి మ‌ధ్య న‌డిచే ప్రేమ‌క‌థ‌. కష్టాల నైపథ్యంలోనే నడిచే ప్రేమ కథ అది. మన తెలుగువారిలో 50 లక్షల మందికి గల్ఫ్ దేశాల గురించి తెలుసు. అక్క‌డి ప‌రిస్థితులు తెలుసు. అటువంటివారు ఈ సినిమా చూసినా చాలు, సినిమా స‌క్సెస్ అవుతుంద‌ని న‌మ్మ‌కంతో చేశాను.

interview gallery

రిలీజ్ గురించి...
- రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా 250-300 థియేట‌ర్స్‌లో విడుద‌ల కానుంది.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌?
- ఇదివరకు నా ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన 'ఒక రొమాంటిక్‌ క్రైమ్‌ కథ, ఒక క్రిమినల్‌ క్రైమ్‌ కథ' సినిమాలకు మూడవ భాగంగా రొమాంటిక్‌ క్రిమినల్స్‌ అనే సినిమా చేస్తున్నాను. అది కూడా త్వరలోనే ఉండనుంది.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved