pizza
Suresh Kondeti interview (Telugu) about Lisaa
క‌ష్ట‌ప‌డి ప‌నిచేయ‌డంలో చిరంజీవిగారే నాకు స్ఫూర్తి - సురేష్ కొండేటి
You are at idlebrain.com > news today >
Follow Us

22 May 2019
Hyderabad

సినిమా నిర్మాత‌ల్లో అభిరుచి గ‌ల నిర్మాత‌లు, ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ నిర్మాత‌లు అని రెండు ర‌కాలుగా ఉంటారు. మంచి అభిరుచితో సినిమాల‌ను నిర్మించి, వాటిని క‌మ‌ర్షియ‌ల్‌గా క్యాష్ చేసుకునే నిర్మాత సురేష్ కొండేటి. `ప్రేమిస్తే`, `షాపింగ్ మాల్‌`, `జ‌ర్నీ..`... ఇలా ఆయ‌న తీసిన చిత్రాల‌ను ప‌రిశీలిస్తే ఈ విష‌యం అర్థ‌మ‌వుతుంది. తాజాగా అంజ‌లీ న‌టించిన `లీసా` కు కూడా ఆయ‌నే నిర్మాత‌. ఈ నెల 24న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అంజ‌లి- సురేష్ కొండేటి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్ర‌మిది. ఈ సంద‌ర్భంగా సురేష్ కొండేటి హైద‌రాబాద్‌లో స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు.

* ఏంటి `లీసా` స్పెషాలిటి?
- నేను 1985లో చ‌దువుతుండ‌గా `చిన్నారి చేత‌న్‌` అనే సినిమా వ‌చ్చింది. త్రీడీలో ఆ సినిమాను చూసి పొంగిపోయా. ఎప్ప‌టికైనా అలాంటి సినిమా చేయాల‌ని అనుకుంటూనే ఉన్నా. స‌రిగ్గా ఆ స‌మ‌యంలోనే `లీసా` గురించి తెలిసింది. వాళ్లు న‌న్ను పీఆర్వోగా పెట్టుకుందామ‌ని ఫోన్ చేశారు. నాకు కాన్సెప్ట్ న‌చ్చి వెంట‌నే నిర్మాత‌గా మారిపోయా.

* సినిమా ఏ జోన‌ర్‌లో ఉంటుంది?
- హార‌ర్ ప్ర‌ధానంగా ఉంటుంది. హార‌ర్‌లో కామెడీ కూడా క‌ల‌గ‌లిసి ఉంటుంది. దాంతో పాటు ఈ సినిమా స్పెష‌ల్ సెంటిమెంట్‌. సెంటిమెంట్ ప్ర‌ధానంగా సాగే సినిమా అవుతుంది. తెలుగు తెర‌మీద ఫ్రెష్‌గా కూడా ఉంటుంది.

* అంజ‌లి ఈ సినిమాను స‌జెస్ట్ చేశారా?
- ఇంత‌కు ముందు షాపింగ్‌మాల్‌, జ‌ర్నీని ఆమె స‌జెస్ట్ చేశారు. ఈ సినిమాను ఆమె చెప్పారు. ద‌ర్శ‌కుడు కూడా చెప్పారు.

* ఈ మ‌ధ్య న‌టిస్తున్న‌ట్టున్నారు?
- ఎర్ర‌చీర అనే ఒక సినిమా చేస్తున్నా. ఇక మీద కూడా వ‌రుస‌గా సినిమాలు చేస్తా. `మా`లో స‌భ్య‌త్వం ఉంది.

* ఓ వైపు `మా`, మ‌రోవైపు `ఎఫ్ ఎన్‌సీసీ`, ఇంకోవైపు, మ్యాగ‌జైన్‌, డిస్ట్రిబ్యూష‌న్‌, నిర్మాణం.. ఎలా సాధ్య‌మ‌వుతోంది?
- నేను ఎవ‌రికీ భ‌జ‌న చేయ‌ను. నాకు చెప్పిన ప‌నిని ప‌ర్ఫెక్ట్ గా చేసుకుంటూ పోతాను. నేను ఒక ఆర్గ‌నైజేష‌న్‌లో ఉన్నానంటే, నావ‌ల్ల అక్క‌డ అర్ధ‌రూపాయి కూడా న‌ష్టం రాకుండా చూసుకుంటాను. నా వ‌ల్ల వీలైనంత సాయం త‌ప్ప‌కుండా చేస్తాను.

* ఇన్నిటికి టైమ్ మేనేజ్ ఎలా చేస్తున్నారు?
- ఈ విష‌యంలో నాకు చిరంజీవిగారే స్ఫూర్తి. చాలా క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తారాయ‌న‌.

* చిరంజీవిగారితో సినిమాను నిర్మించే ఆలోచ‌న‌లున్నాయా?
- ఇప్పుడు కాదు.. 2004లోనే ఆయ‌న `ఏమో... రేపు నాతో కూడా సినిమా చేస్తాడేమో` అని అన్నారు. ఆ మాట నిజంగా నాకు బ్లెస్సింగే.

* సంతోషం అవార్డులు 18వ ఏట అడుగుపెట్ట‌బోతున్న‌ట్టున్నాయి?
- సంతోషం మ్యాగ‌జైన్ ప్రారంభోత్స‌వానికి వ‌చ్చి నాగార్జున‌గారు మంచి అవార్డులు తెలుగులో రావాల‌ని అంటే వెంట‌నే నేను మొద‌లుపెట్టాను. 18 ఏళ్లు నిర్విరామంగా అవార్డులు ఇవ్వ‌డం ఆనందంగా ఉంది.

* డిజిట‌ల్ మీడియా పెరుగుతున్న ఈ కాలంలోమ్యాగ‌జైన్‌ను నిర్వ‌హించ‌డం ఎలా ఉంది?
- అది క‌ష్ట‌మైనా, న‌ష్ట‌మైనా నేను ఉన్నంత కాలం సంతోషం వ‌స్తూనే ఉంటుంది. నేను దాన్ని మాన‌ను. దాన్ని మానేస్తే త‌ల్లిని మ‌ర్చిపోయిన‌ట్టే. ఆ ప‌ని నేను చేయ‌ను.

* ఎలా అప్‌డేట్ అవుతుంటారు?
- నాకు సినిమాలంటే ఇష్టం. సినిమా రంగంలో జ‌రిగే ప్ర‌తిదీ తెలుసుకోవాల‌ని అనుకుంటా. సినిమా ఇండ‌స్ట్రీకి సంబంధించిన ఏదైనా చేయ‌డానికి శ్ర‌మ‌కోర్చి ప‌నిచేస్తా. ఇక్క‌డి నుంచి బ‌య‌ట‌కు జ‌రిగి నేను ఏ ప‌నీ చేయ‌లేను. అది నాకు బాగా తెలుసు.

* ష‌క‌ల‌క శంక‌ర్‌తో ఇంకో సినిమా చేస్తార‌ని...
- ఎనీటైమ్‌. శంక‌ర్‌తో `శ్రీకాకుళం` అని ఓ స‌బ్జెక్ట్ అనుకున్నాం. మంచి క‌థ అది.

*ఎన్ని థియేట‌ర్ల‌లో లీసాను విడుద‌ల చేస్తున్నారు?
- దాదాపు 400 థియేట‌ర్లు. మ‌న ద‌గ్గ‌ర ప్ర‌తి సెంట‌ర్‌లోనూ త్రీడీ థియేట‌ర్లున్నాయి. లేని చోట్ల 2డీల్లో విడుద‌ల చేస్తాం. చాలా బాగా వ‌చ్చింది సినిమా. చూసిన వాళ్లంద‌రూ ఎంజాయ్ చేస్తారు.

* బిజినెస్ ఎలా జ‌రిగింది?
- నేను సినిమా తీసుకున్నాన‌ని ఇంకా ప్రెస్‌కి కూడా న్యూస్ ఇవ్వ‌క‌ముందే.. అంటే నాలుగ్గంటల్లో ఆరు జిల్లాలు అమ్ముడుపోయాయి. మ‌రుస‌టి రోజుకు మొత్తం అమ్ముడుపోయాయి. అభిరుచితో సినిమాలు తీసుకుని, వాటిని క‌మ‌ర్షియ‌ల్ చేయ‌డం నాకు బాగా తెలుసు. ఇన్నేళ్ల నా అనుభ‌వం నాకు నేర్పింది అదే.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved