pizza
Teja interview (Telugu) about Nene Raju Nene Mantri
ప్రతి మనిషిలో పాజిటివ్‌, నెగటివ్‌ అంశాలు రెండూ ఉంటాయి - తేజ
You are at idlebrain.com > news today >
Follow Us

08 August 2017
Hyderabad

రానా, కాజల్‌ అగర్వాల్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి'. తేజ దర్శకుడు. డి.సురేష్‌బాబు, భరత్‌చౌదరి, కిరణ్‌రెడ్డి నిర్మాతలు. ఈ సినిమా ఆగస్ట్‌ 11న విడుదలవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు తేజతో ఇంటర్వ్యూ...

నేనే రాజు నేనే మంత్రి' సినిమాను రానాతోనే ఎందుకు చేయాలనుకున్నారు?
- ముందు 'నేనే రాజు నేనే మంత్రి' కథను రెడీ చేసిన తర్వాత ముందుగా అనుకున్న టైటిల్‌ 'అహం'. ఈ కథను వేరే హీరోకు వినిపించాను. ఆయనతో వర్కవుట్‌ కాలేదు. నేను దర్శకుడిగా కంటే కథకుడిగా గత చిత్రాల్లో ఫెయిలయ్యానేమోనని అనుకుంటున్నాను. అందుకనే కథ విషయంలో చాలా స్ట్రాంగ్‌గా ఉండాలని అనుకున్నాను. ముందు వేరే హీరోతో డిస్కస్‌ చేసిన తర్వాత నేను కథకు న్యాయం చేయలేనేమోననిపించింది. అయితే ఈ కథకు ఎవరైతే బెటర్‌ అని ఆలోచించాను. రానా అయితే బావుంటుందనిపించింది. సురేష్‌బాబుగారిని కలిసి కథను డిస్కస్‌ చేశాను. హెల్దీగా మార్పులు చేర్పులు చేశాం. తర్వాత కథను రానాకు వినిపించాను. రానాకు కథ నచ్చగానే 'ఎప్పుడు మొదలుపెడతాం' అని అన్నారు. నేను నెలరోజుల సమయం అడిగాను. అప్పటికింకా బాహుబలి2 మొదలు కానే లేదు. ఆ ఏడాది సమ్మర్‌లో బాహుబలి2 మొదలవక ముందే సినిమాను పూర్తి చేసేద్దామనుకున్నాం. అయితే స్క్రిప్ట్‌ మేకింగ్‌లో సమయం పట్టేసింది. మేం సినిమాను మొదదలు పెట్టిన కొన్నిరోజులకే బాహుబలి 2 కూడా ప్రారంభమైంది. బాహుబలి 2 విడుదలైన తర్వాత ఈ సినిమాను స్టార్ట్‌ చేశాం. కథ అంతా ఓకే కాగానే సురేష్‌బాబుగారు హీరో భార్య పాత్రలో కాజల్‌ అయితే బావుంటుందని అన్నారు. నేను సరేనని కాజల్‌కు కథ చెప్పగానే 'బావుంది ఎప్పుడు చేద్దాం' అని అడిగింది. అలా రానా, కాజల్‌తో సినిమా స్టార్ట్‌ అయ్యింది.

హీరోకు నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయా?
- ఒక దర్శకుడిగా నేను సూపర్‌హిట్‌ మూవీస్‌ తీయగలను, అట్టర్‌ప్లాప్‌ మూవీలను చేయగలను. అలాగే ప్రతి మనిషిలో పాజిటివ్‌, నెగటివ్‌ అంశాలు రెండూ ఉంటాయి. సాధారణంగా హీరో అనేవాడి గురించి సినిమాలో అన్ని పాజిటివ్‌గానే చూపిస్తారు. ఉదాహరణకు ఓ చరిత్ర పురుషుడి గురించి చెప్పాలంటే అన్ని పాజిటివ్‌గానే చూపిస్తారు. నెగటివ్‌ చూపించరు. కానీ నేను అలా కాకుండా జోగేంద్ర అనే వ్యక్తి జీవితంలో ఐదేళ్లు జర్నీ ఎలా ఉందనేది సినిమా చూపించాను. ఐదేళ్ల ప్రయాణంలో ఎక్కడ మొదలైయ్యాడు, ఎక్కడా ఎండ్‌ అయ్యాడు. ఏం సాధించాడనేదే కథ. దీనిలో మంచి ఏంటి? చెడు ఏంటి? అతను చేసిన మంచి, చెడు విషయాలేవీ? ఇలా అన్నీ విషయాలను చూపించాను. సినిమా మీటర్‌లో హీరో అంటే ఇలా ఉండాలనే కొన్ని లక్షణాలుంటాయి. ఆ మీటర్‌ను తగ్గించేసే సినిమా అవుతుందని చెప్పగలను. నేను చేసిన చిత్రం సినిమా కూడా అలా సినిమా మీటర్‌ను షాటర్‌ చేసిన సినిమానే. నేను చేసిన సినిమాల్లో చిత్రం, నిజం సినిమాలు సినీ మీటర్స్‌లో ఉండవు. నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. నేనే రాజు నేనే మంత్రి సినిమా కమర్షియల్‌ మీటర్‌లో ఉంటుంది. కానీ సినిమా తీత, క్యారెక్టరైజేషన్స్‌ అన్నీ ఓ ఆర్ట్‌ ఫిలింలా చేశాను. సినిమా థియేటర్‌లోకి వెళ్లిన రెండో నిమిషంలోనే ప్రేక్షకుడు సినిమాలోకి లీనమైపోతాడు. సినిమాను అలా తెరకెక్కించాను. ఇప్పటి వరకు సినిమాను చూసినవారందరూ బావుందన్నారు.

పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాను ఎందుకు తెరకెక్కించారు?
- ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్‌ ఉంటాయి. కేవలం పొలిటికల్‌ సినిమా అయితే నేను కూడా నా ఫ్యామిలీతో కలిసి ఆ సినిమాకు వెళ్లను. మనమే వెళ్లనప్పుడు మనమెందుకు తీయాలని ఆలోచిస్తాను. ఓ సినిమాలో అన్ని హంగులు ఉండాలనే నేను దర్శకుడుగా ఆలోచిస్తాను. సినిమా టీజర్‌ కారణంగా సినిమా పొలిటికల్‌ థ్రిల్లర్‌ అని అందరూ భావిస్తారు. కానీ సినిమాలో పొలిటికల్‌ డ్రామా పది శాతం మాత్రమే కనపడుతుంది. సినిమా ఓ భార్యభర్త మధ్య జరుగుతుంది. స్క్రీన్‌పై కొత్తగా కనపడే కథే. రియల్‌లైఫ్‌లో మనం చాలానే చూస్తుంటాం.

సురేష్‌ ప్రొడక్షన్స్‌ బేనర్‌లో సినిమా చేయడం ఎలా అనిపించింది?
మద్రాసులో సురేష్‌ ప్రొడక్షన్స్‌ ఆఫీస్‌ వెనుక అవుట్‌ హౌస్‌ ఉండేది. నేను అందులో ఉండేవాడిని. ఆ సమయంలో నేను గోడపై పోస్టర్స్‌ చూస్తూ పెరిగాను. నాకు కూడా రామానాయుడుగారితో సినిమా చేయాలనుండేది. కానీ ఆయన తనయుడు సురేష్‌బాబుగారి నిర్మాణంలో సినిమా చేశాను. మంచి నిర్మాత. సురేష్‌ప్రొడక్షన్స్‌లో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఆయన మనవడి సినిమా కదా..నాయుడుగారు ఉండుంటే బావుండేది. సురేష్‌బాబు రియాలిటీలో ఉండే ప్రొడ్యూసర్‌. ఏదైనా సీన్‌ను చూసి బాగోలేకపోతే, బాలేదేని చెప్పేస్తారు. నేను పనిచేసిన నిర్మాతల్లో రియాలిటీలో ఉంటూ నిర్మాతగా, ఆడియెన్‌గా సినిమాను చూస్తుంటారు. మంచి ప్లానింగ్‌ ఉన్న నిర్మాత. నేను అనుకున్న దాని కంటే సినిమా బాగా రావడానికి సురేష్‌బాబుగారే కారణం.

జోగేంద్ర పాత్రకు ఎంత వరకు న్యాయం చేశారు?
- నేను చాలా మంది హీరోలతో పనిచేశాను. నేను చూసినవారిలో రానా చాలా తెలివైన నటుడు. ఏదైనా సీన్‌ చెబితే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు. తన మూడ్‌ కోసం నేను ముందుగానే రేపటి సీన్‌ గురించి చెప్పేసేవాడిని. తను అదే మూడ్‌తో షూటింగ్‌కు వచ్చేసేవాడు. చాలా మంది నేను పలానా సూపర్‌స్టార్‌ని అనుకుని చాలా మంది చేస్తుంటారు. కానీ రానా అలా కాదు. జోగేంద్ర క్యారెక్టర్‌ పరిస్థితేంటి, అతను ఎలా ఉంటాడు? అని ఆలోచించి నటిస్తాడు. తెలివైన, ఆలోచన గల నటుడు.

ఓ దర్శకుడిగా మీ తప్పులు మీకు తెలుస్తుంటాయా?
- ఎందుకు తెలియవు..తెలుస్తాయి. ప్రతి మనిషికి నమ్మకం, రియాలిటీ అనే అంశాలుంటాయి. సినిమాలో తప్పు చేస్తున్నామని తెలియడం రియాలిటీ అయితే, సినిమా బాగా ఆడాలనుకోవడం మనపై నమ్మకం అవుతుంది. ఈ హోప్‌, రియాలిటీలో హోప్‌ గెలిచేసినా, రియాలిటీయే నిజం. అందుకనే హోప్‌ గెలవాలని మనం దేవుళ్ళకి మొక్కుతుంటాం.

కేథరిన్‌ క్యారెక్టర్‌ ఎలా ఉంటుంది?
- కాజల్‌ అగర్వాల్‌, కేథరిన్‌ పాత్రలు సహా ఈ సినిమాలో ప్రతి పాత్ర బలంగా ఉంటుంది. నేను తీసిన సినిమాల్లో హీరోయిన్స్‌, లేడీ పాత్రలకు మంచి ప్రాముఖ్యత ఉంటుంది. ఉమెన్‌ స్ట్రాంగ్‌గా ఉంటే సమాజం బావుంటుందని నా నమ్మకం. సినిమాలో క్యారెక్టర్స్‌ ఇంటెలిజెంట్‌గా ఉంటే సినిమా ఆడియెన్స్‌కు కనెక్ట్‌ అవుతుంది. అలా ప్రతి క్యారెక్టర్‌ ఈ సినిమాలో చాలా బలంగా ఉంటాయి.

మీలోని డైరెక్టర్‌, సినిమాటోగ్రాఫర్‌ని ఎవరిని ఇష్టపడతారు?
- డైరెక్టర్‌, సినిమాటోగ్రాఫర్‌ని అనే విషయాలు నాకు గుర్తుండవు. నేను చేయాల్సిన పనిపైనే నా ఫోకస్‌ ఉంటుంది.

'నేనే రాజు నేనే మంత్రి' సినిమా ఎవరికి మంచి పేరు తెస్తుంది?
- రానాకు చాలా మంచి పేరు తెస్తుంది. తను చాలా బాగా చేశాడు. ఈ సినిమాతో రానా నెక్స్‌ట్‌ లీగ్‌ హీరోగా పేరు తెచ్చుకుంటాడు. కాజల్‌కు మంచి పేరే వస్తుంది. సిినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా మంచి పేరొస్తుంది.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved