pizza
Teja interview (Telugu) about Sita
నేను కాదు... జేమ్స్ కేమ‌రూన్ కూడా చెప్ప‌లేడు - తేజ‌
You are at idlebrain.com > news today >
Follow Us

25 May 2019
Hyderabad

తెలుగు సినిమాలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుల‌ను ప్ర‌స్తావించాల్సిన ప్ర‌తిసారీ తేజ పేరు త‌ప్ప‌క వినిపిస్తుంది. త‌ను అనుకున్న‌ది నిక్క‌చ్చిగా చెప్ప‌గ‌ల అతి కొద్ది మంది ద‌ర్శ‌కుల్లో ఆయ‌న ఒక‌రు. తాజాగా ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `సీత‌` విడుద‌లైంది. ఈ సినిమా గురించి తేజ శ‌నివారం ఉద‌యం విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు..

* `సీత‌` ముందు ఏప్రిల్ 25కి విడుద‌ల చేస్తాం అని అన్నారుగా. `ఎవెంజ‌ర్స్` కోస‌మే విడుద‌ల‌ను వాయిదా వేశారా?
- అంత‌లోపు కంప్లీట్ కాద‌ని నాకు తెలుసు. కానీ ప‌బ్లిసిటీ ఇస్తున్నారు క‌దా, అని నేను ఊర‌కున్నాను.

* ఈ గ్యాప్‌లో ఏమైనా క‌రెక్ష‌న్లు చేశారా?
- అసలు సినిమా పూర్త‌యితే క‌దా, క‌రెక్ష‌న్లు చేసుకోవడానికి. సినిమా పూర్తి కావ‌డానికీ, విడుద‌ల కావ‌డానికీ స‌రిగ్గా స‌రిపోయింది.

* సినిమా చూసుకున్న త‌ర్వాత ఏమైనా క‌రెక్ష‌న్లు చేయొచ్చ‌నిపించిందా?
- నేను మొన్న టీవీలో `నువ్వు నేను` చూస్తుంటే, క‌రెక్ష‌న్ చేయొచ్చు క‌దా అని అనిపించింది. వెంట‌నే ఎడిట‌ర్‌కి ఫోన్ చేసి `క్లైమాక్స్ లో కొంచెం ఎడిట్ చేయొచ్చు క‌దా` అని అన్నా. నా త‌త్వం అలాంటిది. నేనెప్పుడూ నా సినిమాల‌తో శాటిస్‌ఫై కాను.

* అందుకేనా ప్రీ రిలీజ్ వేడుక‌లో కూడా సినిమా జ‌డ్జిమెంట్ రావ‌డం లేద‌న్నారు?
- అంతేక‌దా. మ‌న సినిమా ఎప్పుడూ మ‌న‌కు ముద్దుగానే ఉంటుంది. కానీ అవ‌త‌లివారు చూసిన త‌ర్వాతే చెప్పాలి.

* ఇన్ని సినిమాలు చేసిన ద‌ర్శ‌కుడిగా మీకు ఆడియ‌న్స్ ప‌ల్స్ తెలిసే ఉండాలిగా?
- అలా ఉండ‌దు. ఆడియ‌న్స్ కి ఏం న‌చ్చుతుందో, నేనే కాదు... జేమ్స్ కేమ‌రూన్ కూడా చెప్ప‌లేడు. అలా చెప్ప‌గ‌లిగితే సీనియ‌ర్ డైర‌క్ట‌ర్లు ఎవ‌రూ ఫ్లాప్‌లు తీయ‌కూడ‌దు.

* `సీత‌`ని రామాయ‌ణాన్ని దృష్టిలో పెట్టుకుని తీశారా?
- లేదండీ. డైలాగుల వ‌ల్ల అలా అనిపిస్తుందేమో కానీ, `సీత‌` పాత్ర‌కూ, రామాయ‌ణానికీ ఎలాంటి సంబంధం లేదు. నా దృష్టిలో `సీత‌` ఇవాళ్టి స‌మాజానికి ప్ర‌తీక‌. లావిష్ లైఫ్‌, ధ‌న‌దాహం, అహంకారం వంటివాటికి ప్ర‌తిబింబం సీత కేర‌క్ట‌ర్‌. మ‌నుషులు ఎలా ఉండ‌కూడ‌దో చెప్ప‌డానికి సీత పాత్ర‌ను, ఎలా ఉండాలో చెప్ప‌డానికి రామ్ పాత్ర‌ను సృష్టించాను.

* సొసైటీలో అమ్మాయిలు రామ్‌లా ఉండాల‌నా మీ ఉద్దేశం..?
- మ‌నం సినిమాల్లో హీరోయిన్లు నాలుగు పాట‌లు పాడుతున్న‌ట్టు చూపిస్తున్నాం కానీ, సొసైటీలో వాళ్లు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఒక‌వేళ లేక‌పోయినా మ‌రింత స్ట్రాంగ్‌గా ఉండాల‌నే నా కోరిక‌.

* మ‌రి ఇలా చెప్పే మీరు కూడా అలాంటి పాత్ర‌ల‌ను తెర‌పై ఎందుకు తీర్చిదిద్ద‌రు?
- మేక‌ర్స్, ఆడియ‌న్స్, రివ్యూయ‌ర్లు... అంద‌రూ ఒక ఫార్మేట్‌కు అల‌వాటు ప‌డిపోయారు. ఉన్న‌ప‌ళాన వాటి నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేం. నిదానంగా గుడ్డును ప‌గ‌ల‌కొట్టిన‌ట్టు రావాలి అంతే.

interview gallery



* ఫార్వ‌ర్డ్ థింకింగ్ ఉన్న సినిమాలు చేసేట‌ప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌వుతాయి?
- చాలానే ఎదుర‌వుతాయి. ముందు మ‌న చుట్టూ ఉన్న‌వాళ్లు ఒప్పుకోవాలి. `సీత‌`లోనే `నెల‌రోజులు అత‌నితో ఉంటాన‌ని అగ్రిమెంట్ ఎందుకు`.. పెళ్లి కోసం అగ్రిమెంట్ చేసిన‌ట్టు చేసుకోవ‌చ్చుక‌దా అని అన్నారు. కానీ నేనే ఒప్పుకోకుండా పెట్టా.

* బెల్లంకొండ శ్రీనివాస్‌కి కూడా ఇన్‌పుట్స్ బాగా ఇచ్చిన‌ట్టున్నారు క‌దా?
- అంటే మ‌నం క‌థ‌ను, కేర‌క్ట‌ర్‌ను చెప్పామ‌నుకోండి యాక్టింగ్ గొంతు నుంచి చేస్తారు. అలా కాకుండా వాళ్ల‌కే అర్థ‌మైంద‌నుకోండి క‌డుపులో నుంచి చేస్తారు. అందుక‌ని అలా పుష్ చేస్తామంతే.

* వెంక‌టేష్‌గారితో సినిమా ఉంటుంద‌ని..?
- యాక్చువ‌ల్‌గా ఉండాలి. కానీ కుద‌ర‌లేదు. ఆ రోజు ఉద‌యం ఈ సినిమా, సాయంత్రం ఎన్టీఆర్ సినిమా వ‌దులుకున్నా.

* య‌న్టీఆర్ సినిమా వ‌దులుకోవ‌డానికి క్రియేటివ్ డిఫ‌రెన్స్ లే కార‌ణ‌మ‌ని అనుకోవ‌చ్చా?
- సినిమా క‌థ ఒక‌టికి ప‌ది సార్లు అనుకుని, తీరా మొత్తం తీశాక కూడా నిర్మాత‌కు ఒక‌సారి చూపించి, ఏవైనా న‌చ్చ‌క‌పోతే మారుస్తాం. అందువ‌ల్ల క‌థ‌ప‌రంగా నేనేదో కాంప్ర‌మైజ్ కాలేద‌న‌డం స‌రికాదు. అయినా ఆ మాట కూడా మంచిదేలెండి. మ‌రో మాట కూడా ఉంది క‌దా.. తేజ ఆర్టిస్టుల‌ను కొడ‌తాడు అని. ఆ మాట వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఏంటంటే... న‌ట‌న రానివాళ్లు నా ద‌గ్గ‌ర‌కు రారు. వ‌చ్చిన వాళ్లే వ‌స్తారు. అది కూడా మంచే క‌దా.

* నెక్స్ట్ సినిమాలేంటి?
- ఇంకా ఏమీ అనుకోలేదు.

* బెల్లంకొండ‌కు ఆల్రెడీ ఇంకో క‌థ కూడా చెప్పార‌ట క‌దా?
- అది మ‌రీ అడ్వాన్స్డ్ గా ఉంటుంది. ఏమ‌వుతుందో చూడాలి. మామూలుగా సినిమా స‌క్సెస్ అనేది ప్రేక్ష‌కుల మూడ్‌ని బ‌ట్టి ఉంటుంది. ఒక‌సారి ప్రేక్ష‌కులు ఫిక్స‌య్యార‌నుకోండి సినిమా థియేట‌ర్‌కు వెళ్లి చూస్తారు. అదే మూడ్‌లో లేర‌నుకోండి... ఎంత మంచి సినిమా చేసినా పెద్ద‌గా ఎక్క‌దు. నేను చేసిన చాలా సినిమాలు ఇప్పుడు థియేట‌ర్ల‌లో బాగా ఆడుతున్నాయి. అవి ప్ర‌ద‌ర్శిత‌మైన ప్ర‌తిసారీ ఫోన్ చేసి మెచ్చుకుంటూ ఉంటారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved