pizza
Teja interview about Hora Hori
ఏదైనా స‌క్సెస్‌ని బ‌ట్టే ఉంటుంది - తేజ‌
You are at idlebrain.com > news today >
Follow Us

09 September 2015
Hyderabad

మ‌న‌సులో ఉన్న‌దున్న‌ట్టు మాట్లాడే అతి కొద్ది మందిలో తేజ ఒక‌రు. ఇత‌రులు ఏమ‌నుకున్నా స‌రే త‌న అభిప్రాయాన్ని స్ప‌ష్టంగా చెప్ప‌గ‌ల‌రు. ప‌లు జోనర్ల‌లో సినిమాలు చేసినా ప్రేమ క‌థా చిత్రాల‌ను చ‌క్క‌గా తీయ‌గ‌ల‌డు అనే ముద్ర ఆయ‌న‌పై ఉంది. తాజాగా ఆ త‌ర‌హా క‌థ‌తో తేజ `హోరాహ‌రీ`ని తెరకెక్కించారు. ఈ సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా తేజ విలేక‌రుల‌తో బుధ‌వారం ఉద‌యం ముచ్చ‌టించారు. ఆ విశేషాలు...

హోరాహోరీ అనే టైటిల్ పెట్ట‌డానికి కార‌ణం ఏంటి?
- ఏదో ఒక టైటిల్ పెట్టాలి క‌దా. నేనెప్పుడూ ముందు టైటిల్‌నే అనుకుంటా. ముందు జ‌యం అని టైటిల్ పెట్టాకే సినిమా తీశా. నిజానికి నేను తెర‌కెక్కించిన ప‌లు సినిమాల‌కు టైటిల్‌తో సంబంధం ఉండ‌దు. అయినా బావుంద‌నిపించి పెట్టేస్తుంటాను.

ఫైట్ ఫ‌ర్ స‌క్సెస్ అనుకోవ‌చ్చా?
- నా ప‌రంగా ఫైట్ ఫ‌ర్ స‌క్సెసే. కానీ క‌థా ప‌రంగా ఫైట్ ఫ‌ర్ ల‌వ్‌. ఈ సినిమా ద్వారా చాలా మంది కొత్త‌వారిని తీసుకొచ్చా. చాలా మంది రైట‌ర్ల‌ను కూడా న‌టుల్ని చేశాను.

సినిమా గురించి చెప్పండి?
- ఒక‌బ్బాయి ప్రేమ‌లో ప‌డి హీరోయిన్ ట్రామాలోకి వెళ్తుంది. ఆమెను బ‌య‌ట‌కు తీసుకొచ్చే ప్ర‌య‌త్నంలో ఇంకో అబ్బాయి ట్రామాలోకి వెళ్తాడు. ఎవ‌రి వ‌ల్ల‌నైతే హీరోయిన్ ట్రామాలోకి వెళ్లిందో అత‌ను ఇత‌న్ని బ‌య‌ట‌ప‌డేస్తాడు. చెప్పాలంటే ఇదీ క‌థ‌. మాన‌సికంగా ఉల్లాసాన్ని క‌లిగించ‌డానికి నాయిక‌ను ఓ మంచి ప్ర‌దేశానికి తీసుకెళ్ల‌మ‌ని వైద్యులు సూచిస్తారు. ఊటీలాంటివి మ‌న సినిమాల్లో వ‌చ్చేశాయి కాబ‌ట్టి నేను క‌ర్ణాట‌క‌లోని అగుంబైని ఎంపిక చేసుకున్నా. అత్య‌ధిక వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యే ప్రాంతంగా ఈ ప్ర‌దేశానికి గుర్తింపు ఉంది. తీరా అక్క‌డికి వెళ్లాక వ‌ర్షం రాక‌పోతే ఏం చేయాలోన‌ని ఆలోచించి ముందు జాగ్ర‌త్త‌గా రెయిన్ మెషిన్‌ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ మెషిన్ ద్వారా ఎక్కువ నీరు వృథా కాదు. మేన్ ప‌వ‌ర్ కూడా ఎక్కువ‌గా అవ‌స‌రం లేదు. ఒక‌రే ఆప‌రేట్ చేస్తే స‌రిపోతుంది. మేం ఆగుంబైని చేరుకున్న త‌ర్వాత మేం తీసుకెళ్లిన లైటు కాలిపోయింది. దాంతో లైటు లేకుండానే సినిమా చేశాం. సినిమాకు కొత్త లుక్ వ‌చ్చింది. సినిమా స్కోప్‌లోనూ విడ్త్ ను పెంచి ఈ సినిమాను రూపొందించాం. ఫోర్త్ వాల్ టెక్నిక్‌ను ఉప‌యోగించి సినిమాను తెర‌కెక్కించాం. మేక‌ప్ వాడ‌లేదు. ఒక ర‌కంగా చెప్పాలంటే ఈ సినిమాకు 24 క్రాఫ్ట్ లు ప‌నిచేయ‌లేదు. ఐదారు క్రాఫ్ట్ ల‌ను త‌గ్గించేశాం. ఆ ప‌నుల‌న్నీ మేమే చేసుకున్నాం.

ఏ జోన‌ర్ సినిమా అవుతుంది?
- మామూలుగా మ‌న సినిమాల్లో ఆర్ట్ సినిమాలు, క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు అని రెండు ర‌కాలున్నాయి. హిందీ, త‌మిళ్‌లో వాటిని మించి మ‌రో ర‌కం సినిమాలున్నాయి. అంటే ఈ రెండు ర‌కాల సినిమాల మ‌ధ్య ఉన్న గ్యాప్‌ను బ్రేక్ చేసిన సినిమాల‌వి. ఆథంటిక్ సినిమాలు. అలాంటి ఆథంటిక్ సినిమా అవుతుందీ చిత్రం. మామూలుగా నిడివి గురించి ఈ మ‌ధ్య ఎక్కువ‌గా అంద‌రూ మాట్లాడుతున్నారు. స‌రైన క‌థ‌ను చెప్పాలంటే త‌ప్ప‌కుండా మంచి నిడివి కావాలి. ఎన్నో వ్య‌య‌ప్ర‌యాస‌లకు ఓర్చి సినిమాకు వ‌చ్చిన ప్రేక్ష‌కుడిని క‌థ‌లోకి తీసుకెళ్ల‌గ‌ల‌గాలి. అలా చేయాలంటే సినిమా నిడివి ఉంటుంది. అంతేగానీ చొక్కా కుట్టేశాం. అందులో దూరండి అంటే ఏదోలా ఉంటుంది. క‌థ‌లో లీనం కాన‌ప్పుడు ప్రేక్ష‌కుడు కామెడీని ఆస్వాదించి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాడు. అందులోని భావోద్వేగాల‌తో లీనం కాలేడు. అలాంట‌ప్పుడు ఆ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా హిట్ అవుతుందేమోగానీ, ఎమోష‌న‌ల్‌గా మాత్రం క‌నెక్ట్ కాలేదు. సినిమా ఈజ్ వ‌ర్డ్స్. లెక్క‌లు కాదు. ప‌దాల‌ను లెక్క‌లుగా మార్చాల‌ని అనుకోకూడ‌దు. హాలీవుడ్‌లోకి జాప‌నీస్ ప్ర‌వేశించిన‌ప్పుడు వాళ్లు సినిమాను లెక్క‌లుగానే చూశారు. హాలీవుడ్‌లో కొంత‌కాలం గ‌డ్డు ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఎప్పుడైతే సినిమాను వ‌ర్డ్స్ గా, ఎమోష‌న‌ల్‌గా చూశారో అప్పుడు మ‌ర‌లా వృద్ధి చెందింది.

మీతో ప‌నిచేయ‌డం చాలా క‌ష్ట‌మంటారు ఎందుక‌ని?
- నేను వ‌ర్క్ హాలిక్‌. నాకు సినిమా ఉంటే చాలు. నా దృష్టిలో నాకు ఒక‌టీ, రెండూ, మూడు, నాలుగు, ఐదు సినిమాలే. ఆ త‌ర్వాతే ఏదైనా. నాతో ఉన్న‌వారు కూడా అలాగే ఉండాల‌ని అనుకుంటా. అది త‌ప్ప‌ని తెలుసు. అయినా అలాగే ఉంటా. అక్క‌డ తేడా వ‌స్తుంటుంది.

ఈ సినిమా ల‌వ్ స్టోరీనా?
- కాదు. విల‌న్ స్టోరీ. సినిమా మొద‌లు కావ‌డ‌మే విల‌న్‌తో మొద‌ల‌వుతుంది. ప్రేమ‌ను మించిందేదో ఈ క‌థ‌లో ఉంటుంది.

మీ ప్ర‌తి సినిమానీ జ‌యంతో పోలిస్తే ఇబ్బందిప‌డుతున్నారెందుకు?
- జ‌యం క‌ల్ట్ సినిమా అవుతుంద‌ని నేన‌నుకోలేదు. అయినా అయింది. ఆ సినిమా హిట్ అయింది క‌దా అని తేజ అంటే ప్రేమ‌క‌థా చిత్రాలే తీస్తాడు అని ముద్ర వేస్తే ఎలా? ఆ త‌ర్వాత ఏ సినిమా తీసినా దాంతో పోలిస్తే ఎలా? నేనెన్నిసినిమాలు తీసినా జ‌యం ద‌ర్శ‌కుడు అని అంటే త‌ర్వాతి సినిమాలు బాగా చేయ‌లేద‌నేగా... ఇలా ఎన్నో విష‌యాలు కార‌ణాలుగా క‌నిపిస్తాయి.

ఈ సినిమా త‌ర్వాత ఏం చేయ‌బోతున్నారు?
- ఇదే బ్యాన‌ర్ లో సైన్స్ ఫిక్ష‌న్ అని ఓ సినిమాను చేయ‌బోతున్నా.

పెద్ద హీరోల‌తో సినిమాలు చేయ‌రా?
- ఈ సినిమా ఫ్లాప్ అనుకోండి వారే నాతో సినిమాలు చేయ‌రు. ఈ సినిమా హిట్ అనుకోండి నేను వారితో సినిమాలు చేయ‌ను. ఎన్టీఆర్‌, కృష్ణ‌గారిలాగా ఫోక‌స్డ్ గా ప‌నిచేసే హీరోలు ఇప్పుడేరి? ఉంటే అప్ప‌ట్లో అల్లూరి సీతారామ‌రాజును అంత త‌క్కువ రోజుల్లో ఎలా తీశారు? ఇప్పుడు అంత క‌న్నా గొప్ప సినిమాలేం తీయ‌ట్లేదు క‌దా? మ‌రి అన్నెన్ని రోజులు ఎందుకు ప‌డుతున్న‌ట్టు?

క‌మ‌ల్‌హాస‌న్‌తో సినిమా ఎంత వ‌ర‌కు వ‌చ్చింది?
- ఉంటుందండీ. క‌థ‌, స్క్రీన్ ప్లే అన్నీ ఆయ‌నవే. డైర‌క్ష‌న్ చేయాలి.



Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved