pizza
Thaman interview (Telugu) about Aravinda Sametha
నేనేం అన‌న‌ని న‌న్ను అడుగుతుంటారా? - త‌మ‌న్
You are at idlebrain.com > news today >
Follow Us

13 October 2018
Hyderabad

చిన్న‌త‌నం నుంచీ సంగీత ప్ర‌యాణం చేస్తున్నారు త‌మ‌న్‌. ఆయ‌న స్వ‌రాలందించిన `అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌` చిత్రం ఇటీవ‌ల విడుద‌లైంది. అందులోని `పెనిమిటి` పాట‌తో పాటు... రీరికార్డింగ్ కూడా ప్రేక్ష‌కుల మెప్పు పొందుతోంది. ఎన్టీఆర్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన ఆ సినిమా గురించి త‌మ‌న్ హైద‌రాబాద్‌లో శనివారం విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు...

* `అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌` గురించి చెప్పండి?
- ఈ సినిమా కోసం దాదాపు ఏడాది ప‌నిచేశాను. త్రివిక్ర‌మ్‌గారు, తార‌క్ అన్న‌య్య‌తో ప‌నిచేయ‌డం మ‌ధురానుభూతి. ఒక్కో పాటా చేస్తున్న‌ప్పుడు వారిచ్చిన ప్రోత్సాహం మ‌ర్చిపోలేం. సినిమా విడుద‌ల‌య్యాక కూడా వారు చాలా బాగా మెచ్చుకున్నారు. `నీ కెరీర్‌లో గుర్తుంచుకునే సినిమా` అని అన్నారు. వాళ్ల‌తో పాటు ప‌రిశ్ర‌మ‌లోనూ చాలా మంది ఫోన్లు చేసి ప్ర‌శంసించారు.

* మీ గ‌త సినిమాల‌తో పోలిస్తే ఈ సినిమాకు వైవిధ్యంగా సంగీతాన్నిచ్చిన‌ట్టున్నారు?
- క‌మ‌ర్షియ‌ల్ సినిమా అన‌గానే ఫ‌లానా పాటా... ఫ‌లానా పాటా అని కొన్ని లెక్క‌లుంటాయి. కానీ ఈ చిత్రం విష‌యంలో నేను అవేమీ దృష్టిలో పెట్టుకోలేదు. అస‌లు అలాంటి ఆలోచ‌న‌లు కూడా నా వ‌ర‌కు రాకపోవ‌డానికి కార‌ణం క‌థే.

* త్రివిక్ర‌మ్, తార‌క్ సినిమా అనగానే మ‌రింత ప్రెజ‌ర్ ఫీల‌య్యారా?
- అలాంటిదేమీ లేదండీ. వాళ్లు నాకు పూర్తి ఫ్రీడ‌మ్ ఇచ్చారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో స‌హా మంచి స్కోర్ చేసే అవ‌కాశాన్నిచ్చారు. ఇందులోని ప్ర‌తి పాటా బావుంటుంది. మెలోడీ ఉంటుంది.

* త్రివిక్ర‌మ్‌తో ప‌నిచేయాల‌న్న‌ది మీ చిర‌కాల క‌ల‌ట క‌దా?
- అవునండీ. దాదాపుగా ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్నా. ఆయ‌న‌తో సినిమా చేసే వ‌ర‌కు స్కూల్ స్టూడెంట్‌లాగా అనుకున్నా. కానీ ఇప్పుడు `అర‌వింద స‌మేత‌` చేశాక అప్‌గ్రేడ్ అయ్యాన‌నే భావ‌న క‌లుగుతోంది. అర‌టిపండు ఒలిచిపెట్టినంత తేలిగ్గా విష‌యాన్ని వ్య‌క్తం చేస్తారాయ‌న‌.

* సినిమా హిట్‌, ఫ్లాప్‌ల‌ను ప‌ట్టించుకుంటారా?
- త‌ప్ప‌కుండా అండీ. ఎందుకంటే సంగీతం ఎంత బ్లాక్ బ‌స్ట‌ర్ అయినా, సినిమా హిట్ కావాలి. అప్పుడే పాట‌లు మ‌రింత‌గా ప్రేక్ష‌కుల్లోకి వెళ్తాయి. నాకు సంబంధించి, పాట అనేది మ్యూజిక‌ల్ వెర్ష‌న్ ఆఫ్ డైలాగ్ అని అనుకుంటాను.

interview gallery



* మ్యూజిక్ డైర‌క్ష‌న్ విష‌యంలో హీరోల ఇన్వాల్వ్ మెంట్ ఉంటుందా?
- మన ప‌రిశ్ర‌మ‌లో హీరోలు.. వారి అభిమానులు.. ఇలా చాలా విష‌యాలు ఒక‌దానితో ఒక‌టి ముడిప‌డి ఉంటాయి. అందుకే హీరోలు సినిమాకు సంబంధించి ప్ర‌తి చిన్న విష‌యంలోనూ శ్ర‌ద్ధ తీసుకుంటారు. సంగీతంలోనూ వారి ఇన్వాల్వ్ మెంట్ ఉంటుంది. అలా ఉండ‌టం నా దృష్టిలో త‌ప్పు కూడా కాదు. ఇది కూడా ప‌ర‌స్ప‌రం ఆధార‌ప‌డ్డ విష‌య‌మే. ఎందుకంటే సంగీత ద‌ర్శ‌కుడికి కూడా హీరో మీద అభిమానం ఉండాలి. అప్పుడే మంచి స్వ‌రాలు కుదురుతాయి.

* ఈ మ‌ధ్య మాస్ పాట‌ల‌కు దూర‌మ‌వుతున్న‌ట్టున్నారు?
- నిజ‌మే. ఫాస్ట్ బీట్ చేసి దాదాపు రెండేళ్ల‌యింది. నేను చేయ‌క‌పోవ‌డం కాదు. గ‌త కొంత కాలంగా ద‌ర్శ‌కుల అభిరుచుల్లోనూ చాలా మార్పులు వ‌చ్చాయి. క‌థానుసారం సినిమాలు చేస్తున్నారు. పాట‌ల విష‌యంలోనూ రెఫ‌రెన్స్ లు తీసుకురావ‌డం లేదు. క‌థానుగుణంగా ట్యూన్స్ అందివ్వ‌మ‌ని అడుగుతున్నారు.

* మీ పాట‌ల్లో కాపీ ట్యూన్లు ఉంటాయ‌నే విష‌యం మీ వ‌ర‌కు వ‌చ్చిందా?

- నేను ఆ మాట‌ను అస‌లు అంగీక‌రించ‌ను. ఇప్ప‌టికి దాదాపు 60 సినిమాలు కంప్లీట్ చేశాను. నిజంగా కాపీ ట్యూన్లే వాడితే ఇంత మైలేజ్ ఉండేదా? త‌్రివిక్ర‌మ్ లాంటి వారు అవ‌కాశాలు ఇచ్చేవారా? న‌న్ను ఇలా అడిగితే నేనేమీ అన‌న‌నేగా మీ అభిప్రాయం. ఇదే మాట‌ను మీరు టాప్ మ్యూజిక్ డైర‌క్ట‌ర్ల‌ను అడ‌గ‌గ‌ల‌రా?

* సంగీతం చేయ‌డం ఇప్ప‌ట్లో తేలికైన‌ట్టుందిగా?
- అవునండీ. పియానో కొనుక్కుని చాలా మంది ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే నా దృష్టిలో సంగీత ద‌ర్శ‌కుడిగా రాణించాలంటే చాలా ప్రోగ్రామ్స్ చేయాలి. అదంతా ఓ పాఠంలా ఉప‌యోగ‌ప‌డుతుంది. స్టేజీ షోల వ‌ల్ల చాలా ఉప‌యోగం ఉంటుంది. ఆ అనుభవంతోనే సంగీత ద‌ర్శ‌కుడిగా రాణించ‌గ‌లం.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved