pizza
Vijay Devarakonda Interview
`నీకింక‌తిరుగులేదు` అని అనిపించుకోవాల‌ని ఉంటుంది - విజ‌య్ దేవ‌ర‌కొండ‌
You are at idlebrain.com > news today >
Follow Us

06 August 2016
Hyderaba
d

`పెళ్లిచూపులు` ఈ మ‌ధ్య తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో అంద‌రినీ ఆక‌ర్షించిన చిత్రం. `ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం` చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ సినిమాలో హీరోగా న‌టిస్తున్నారు. ఇట‌లీ నుంచి `అర్జున్ రెడ్డి` సినిమా షూటింగ్ నుంచి వ‌చ్చిన ఆయ‌న శ‌నివారం విలేక‌రుల‌తో మాట్లాడారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ ``మాది హైద‌రాబాద్. నాన్న‌గారు టీవీ సీరియ‌ల్స్ తీసేవారు. కొన్నాళ్ల క్రిత‌మే ఆయ‌న తీయ‌డం మానేశారు. నేను పుట్ట‌ప‌ర్తిలో చ‌దువుకున్నా. చిన్న‌ప్పుడు ఎవ‌రైనా ఏమ‌వుతావు అని అడిగితే యాక్ట‌ర్ అవుతాన‌ని అనేవాడిని. న‌లుగురిలోనూ అప్పుడు న‌న్ను ప్ర‌త్యేకంగా చూసేవారు. ఆ త‌ర్వాత డిగ్రీలో పాపులారిటీ కోసం హీరో అవుతాన‌ని అన్నాను. `ఏదో ఒక‌టి చేయి. కానీ సిన్సియ‌ర్‌గా చెయి. ఇలా నువ్వు డిగ్రీ చ‌దువుతాన‌ని అంటే అన‌వ‌స‌రంగా ఫీజులు క‌డుతున్నాను. చ‌దువు ఇంట్రెస్ట్ లేదంటే మానేస్తాను` అని ఓ రోజు నాన్న అన్నారు. అంతే షేమ్ అనిపించింది. కానీ అప్పుడు రాసిన సెకండ్ ఇయ‌ర్ డిగ్రీ ప‌రీక్ష‌ల్లో మంచి మార్కులే వ‌చ్చాయి. దాంతో కాలేజీకి వెళ్ల‌క‌పోయినా నాకు మంచి మార్కులు వ‌స్తాయ‌నే ధీమా వ‌చ్చింది. యాక్టింగ్ కోర్సు చేస్తాన‌ని నాన్న‌తో చెప్పాను. సూత్ర‌ధారి అనే సంస్థ‌లో నాకు వ‌ర్క్ షాప్ ఇప్పించారు. అక్క‌డి నుంచి ఓ స్టేజ్ ప్లే చేశాను. ఆ త‌ర్వాత ఆనోటా ఈనోటా విన్న‌వారు న‌న్ను వాళ్ల ట్రూప్‌ల‌లో న‌టించ‌మ‌ని అడిగేవారు. త‌క్కువ మంది జ‌నాలుంటే నాకు న‌టించాల‌ని అనిపించేది కాదు. ఏదైనా భారీగా జ‌నాలుంటే చాలా ఆత్మ‌సంతృప్తితో చేసేవాడిని. లేకుంటే పైపైనే కానిచ్చి వ‌చ్చేవాడిని. `ఫోటోలు ప‌ట్టుకుని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగితేనే వేషాలొస్తాయి` అని నాన్న అదే ప‌నిగా చెప్పేవారు. నాకు మాత్రం అలా అడ‌గాలంటే భ‌య‌మేసేది. నాకు ఎవ‌రు ఇస్తారు? అనే ప్ర‌శ్న ఉండేది. అందుకే ఆఫీసుల‌కు వెళ్తున్నాన‌ని చెప్పి ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి టైమ్ పాస్ చేసి వెళ్లేవాడిని. అప్పుడే తేజ సినిమా కోసం సురేశ్‌బాబు వాళ్లు ఆడిష‌న్ చేస్తున్నార‌ని తెలిసింది. క‌లిస్తే దాదాపు లీడ్ కేర‌క్ట‌ర్‌కు న‌న్ను ఓకే అన్నారు. అంత త్వ‌ర‌గా హీరో అనే విష‌యాన్ని నేనే డైజ‌స్ట్ చేసుకోలేక‌పోయాను. కానీ ఆ ప్రాజెక్ట్ కూడా ఎందుకో మెటీరియ‌లైజ్ కాలేదు. అంత‌లోనే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా కోసం శేఖ‌ర్ క‌మ్ముల ఆడిష‌న్ చేస్తున్నార‌ని తెలిసింది. వాళ్ల ఆఫీసుకు వెళ్ల‌క్క‌ర్లేదు. ఫోటోలు మెయిల్ చేస్తే చాల‌న్నార‌నిపించి చేశాను. ఆడిష‌న్‌కు ర‌మ్మంటే వెళ్లాను. మెయిన్ లీడ్ ఇస్తార‌నుకుంటే సైడ్ కేర‌క్ట‌ర్ ఇచ్చారు. నేను క‌నిపించిన‌ప్ప‌టి నుంచి శేఖ‌ర్ న‌న్ను అజ‌య్ అని పిలిచేవారు. నేను విజ‌య్ క‌దా... ఏదో పొర‌ప‌డుతున్నారులే అని అనుకునేవాడిని. కానీ ఆయన నాకు ఇచ్చిన బౌండ్ స్క్రిప్ట్ లో అజ‌య్ అనే పాత్ర ఉంది. అది మెయిన్ లీడ్ కాదు. చేయాలా వ‌ద్దా అని ఆలోచించుకుంటూ ఉన్నా. స‌రిగ్గా అప్పుడ ఫ్రెండ్స్ అంతా ఎంబీఏలో చేరుతున్నారు. న‌న్ను కూడా చేర‌మ‌ని ఇంట్లో వాళ్లు అడ‌గ‌సాగారు. దాన్నుంచి త‌ప్పించుకోవ‌డానికి ఆ సినిమా చేశా. అప్పుడే నాగి నాకు ప‌రిచ‌య‌మ‌య్యాడు. త‌ను తీసే ఓ యాడ్‌లో న‌న్ను న‌టించ‌మంటే చేశా. అలాగే `ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం` కోసం ఓ ట్ర‌య‌ల్ వెర్ష‌న్ షూట్ చేస్తే అందులోనూ నేనే చేశా. అక్క‌డి నుంచి ఆ సినిమాలో కూడా న‌న్ను తీసుకున్నారు. ఆ సినిమాలో నేను చాలా హైప‌ర్ యాక్టివ్‌గా ఉంటా. రియ‌ల్ లైఫ్‌లో నేను ఎప్పుడూ అలా ఉండను. ఆ సినిమాను చూసిన త‌ర్వాత త‌రుణ్ నాకు ఫోన్ చేశాడు. మేమిద్ద‌రం అంత‌కు ముందు ఎప్పుడూ క‌ల‌వ‌లేదు కానీ మాకు ఒక‌రిగురించి ఒక‌రికి తెలుసు. ఈ క‌థ చెప్పాడు. ఎంత మంది నిర్మాత‌ల‌కు చెప్పినా పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఓ ద‌శ‌లో అయితే క్రౌడ్ ఫండింగ్‌కు కూడా వెళ్దామ‌ని అనుకున్నాం. అంత‌లోనే రాజ్‌, య‌ష్ క‌లిశారు. రాజ్‌కి నేరుగా, య‌ష్‌కి ఫోన్లో నెరేష‌న్ ఇచ్చాం. ఇద్ద‌రూ హ్యాపీ. వాళ్లు స్క్రిప్ట్ ని ఎంత‌గా న‌మ్మారంటే మేం అడిగిన‌ప్పుడు మాకు డ‌బ్బులు ఇచ్చేసేవారు. దాంతో మేం 35 రోజుల్లో సినిమా చేశాం. అదీ సింక్ సౌండ్‌తో. ఈ విధానం గురించి ముందు చెప్పిన‌ప్పుడు వారు కూడా కాసింత ఆలోచించారు. కానీ తెలుగు తెలిసిన వారు ఈ విధానం ద్వారా చేయ‌డం వ‌ల్ల సినిమా పండింది. వీలున్న‌ప్పుడ‌ల్లా సింక్ సౌండ్ ప‌ద్ధ‌తిని వాడితే త‌ప్ప‌కుండా నేచుర‌ల్ పెర్ఫార్మెన్స్, నేచుర‌ల్ డైలాగ్ డెలివ‌రీని ఆస్వాదించ‌వ‌చ్చు. అయితే దానికోసం ఓ స‌ర్జిక‌ల్ ప్లాస్ట‌ర్ వేస్తారు. ఆ నొప్పిని భ‌రిస్తే చాలు (న‌వ్వుతూ). ఈ సినిమాలో నేను మంచి చెఫ్‌గా చేశా. నిజానికి నాకు కూర‌గాయ‌లు క‌ట్ చేయ‌డం కూడా రాదు. అది నా సెక్ష‌న్ కానే కాదు. ఓ రోజు చైనీస్ బండి అత‌న్ని తీసుకొచ్చి మేనేజ్ చేశాం. మ‌రో రోజు ఓ చెఫ్ వ‌చ్చి ఐదు నిమిషాల్లో కూర‌లు త‌ర‌గ‌డం నేర్పించారు. ఆ క్ష‌ణం నా చేయి ప‌ట్టుకుని ఆయ‌న త‌రుగుతుంటే ఎక్క‌డ వేళ్లు తెగుతాయోన‌ని నేను చాలా భ‌య‌ప‌డ్డాను. ఈ సినిమాలో చాలా లేజీగా చేశా. ఇది కూడా నా కేర‌క్ట‌ర్ కాదు. అయితే ఈ రెండు సినిమాల‌కు మ‌ధ్య చాలా డిఫ‌రెంట్‌గా చేశాన‌ని ఎవ‌రైనా అంటే నేను చాలా హ్యాపీగా ఫీల‌వుతా. `బాగా చేశావు` అని ఎవ‌రైనా అంటే న‌న్ను తిట్టిన‌ట్టుగా అనిపిస్తుంది. ఇర‌గ‌దీశావ్‌. నీకింక తిరుగులేదు అని ఎవ‌రైనా అంటే మాత్రం అప్పుడు నాకు శాటిస్‌ఫేక్ష‌న్‌గా ఉంటుంది. `పెళ్లిచూపులు` విడుద‌ల కాక‌ముందే నేను సినిమాలు ఒప్పుకున్నా. ఒక‌టి ఎం.ఎస్‌.ఆర్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్‌గుడ్ మూవీస్‌లో `ద్వార‌క` అని, రెండోది భ‌ద్ర‌కాళి ప్రొడ‌క్ష‌న్స్ లో సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వంలో `అర్జున్ రెడ్డి` అని. నాకు లైఫ్ ఇచ్చిన వైజ‌యంతీ మూవీస్‌తో ఈ అక్టోబ‌ర్ నుంచి మ‌రో సినిమా చేస్తా. అలాగే య‌ష్‌, రాజ్‌తో క‌లిసి మ‌రో సినిమా త‌ప్ప‌కుండా చేస్తాను. పెళ్లిచూపులు చిత్రాన్ని స‌ల్మాన్‌ఖాన్ చూడ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా స‌క్సెస్ టూర్ల‌ను కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇవ‌న్నీ అయ్యాక కొన్నాళ్లు రెస్ట్ తీసుకుని అప్పుడు మిగిలిన స్క్రిప్ట్ ల‌ను వినాల‌ని ఉంది. ప్ర‌తి స్క్రిప్ట్ ను ఫ్రెష్‌గా వింటా. ఇంత‌కు ముందు వ‌చ్చిన స‌క్సెస్‌ల‌ను మ‌న‌సులో పెట్టుకుని మాత్రం విన‌ను`` అని చెప్పారు.

Vijay Devarakonda interview gallery

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved