pizza
Vishal interview (Telugu) about Pandem Kodi 2
'పందెం కోడి 3' స్క్రిప్ట్‌ రెడీ అవుతోంది - హీరో విశాల్‌
You are at idlebrain.com > news today >
Follow Us

27 October 2018
Hyderabad

మాస్ హీరోగా విశాల్ కథానాయకుడిగా ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పందెంకోడి 2’. లైట్‌హౌస్ మూవీ మేకర్స్ ఎల్‌ఎల్‌పి పతాకంపై ఠాగూర్ మధు సమర్పణలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ పతాకాలపై విశాల్, దవళ్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతి లాల్ గడా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 18న విడుదలై సూపర్ ఓపెనింగ్స్‌తో సెన్సేషనల్ హిట్ సాధించింది. ఈ సందర్భంగా హీరో విశాల్‌ పాత్రికేయులతో మాట్లాడారు...

'పందెంకోడి 2'తో మరో సక్సెస్‌.. ఎలా ఉంది?
పందెంకోడి 2 ఫలితం చాలా సంతోషాన్నిచ్చింది. బి, సి సెంటర్స్‌లో ఇంత మంచి కలెక్షన్స్‌ వస్తాయని అనుకోలేదు. మార్కెట్‌లో ఇప్పటికీ కలెక్షన్స్‌ బాగానే ఉన్నాయి.

మరి 'పందెంకోడి 3' ఎప్పుడు చేస్తున్నారు?
- లింగుస్వామి మంచి ఐడియాతో పందెంకోడి 3 స్క్రిప్ట్‌ను రాస్తున్నారు. ఇది వరకులా 13 సంవత్సరాలు కాకుండా వీలైనంత త్వరగానే సినిమా చేయాలనుకుంటున్నాను.

డిటెక్టివ్‌ 2 ఎప్పుడు స్టార్ట్‌ అవుతుంది?
- డిటెక్టివ్‌ 2 సినిమా విదేశాల్లో చిత్రీకరణ చేయబోతున్నాం. అక్కడ ఓ కేసును సాల్వ్‌ చేయడానికి హీరో వెళతాడు. సాధారణంగా మనం చిన్నప్పటి నుండి హాలీవుడ్‌ సినిమాలు చూస్తూ పెరిగాం. ఆ తరహా కథలతో సినిమా చేయాలని అందరికీ ఉంటుంది. డిటెక్టివ్‌ ఆ స్టయిల్‌ ఆఫ్‌ మూవీ. డిటెక్టివ్‌ ఆరు భాగాలుగా చేయాలని డైరెక్టర్‌ మిస్కిన్‌గారు అనుకుంటున్నారు. ఆయనతో సినిమా చేయడానికి నేను ఎప్పుడూ ఇష్టపడతాను.

కంటిన్యూగా సినిమాలు చేయడం వల్ల క్యారెక్టర్స్‌ మిమ్మల్ని ఎంగేజ్‌ చేస్తుంటాయా?
- దాదాపు అలాంటి సందర్భాలు తక్కువే అని చెప్పాలి. అలా నన్ను ఎంగేజ్‌ చేసిన క్యారెక్టర్స్‌లో వాడు వీడు సినిమాలో నేను చేసిన పాత్ర అనే చెప్పాలి. సాధారణంగా నేను పెద్దగా హోం వర్క్‌ చేయను. సెట్స్‌లోకి వెళ్లి డైరెక్టర్‌ ఏం చెబితే అది చేస్తాను. ఎందుకుంటే నా డైరెక్టర్స్‌ అందరూ బ్రిలియంట్‌ యాక్టర్స్‌. ప్రతి ఒక్కరూ నన్ను డిఫరెంట్‌గా చూపించడానికి ప్రయత్నిస్తారు.

ఇప్పుడు అభిమన్యుడు 2, డిటెక్టివ్‌ 2, పందెంకోడి 3...ఈ మూడింటిలో మీరు ఏ సీక్వెల్‌ను ముందుగా చేయబోతున్నారు?
- మూడు సినిమాలు వేర్వేరు జోనర్స్‌కు చెందినవి. పందెంకోడి 3 కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా అభిమన్యుడు 2 చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న విషయాలను తెరపై చూపించడానికి చాలా బావుంటాయి. మన ఫోన్‌ ద్వారా వచ్చే ఇబ్బందులు మనకు తెలియకుండానే, మన సమాచారాన్ని మరొకరికి ఇచ్చేస్తాయి. వాటి వల్ల దుర్వినియోగం జరుగుతుంది. అలాంటి మరో కొత్త కాన్సెప్ట్‌తో అభిమన్యుడు 2 చేస్తున్నాను.

టెంపర్‌ రీమేక్‌ చేయడానికి కారణమేంటి?
- ప్రస్తుతం సమాజంలో జరిగే మీటూ వంటి ఘటనలకు కనెక్ట్‌ అయ్యేలా ఉండే సినిమా ఇది. తెలుగుకి.. తమిళ్‌కి మార్పులు చాలానే చేశాం. ఎన్టీఆర్‌ చేసిన పాత్రలు, సినిమాలు పది, పదిహేను సంవత్సరాలు ఇంపాక్ట్‌ ఉంటుంది. కాబట్టి ్టఆర్‌ పెర్ఫామెన్స్‌ను ఈక్వల్‌ చేసి నటిస్తానని అనుకోవడం లేదు. సెక్సువల్‌ హరాష్‌మెంట్‌, రేప్‌లకు జరిగినప్పుడు ఎలాంటి న్యాయం కావాలనే దాన్ని సినిమాగా చూపించిన తీరు ఎంతో బావుంటుంది. నేను కూడా సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

టెంపర్‌ కంటే ముందు మరేదైనా రీమేక్‌ల కోసం అప్రోచ్‌ అయ్యారా?
- అయ్యారండీ.. బోలెడు సినిమాలకు అయ్యారు. 'మిర్చి', 'అత్తారింటికి దారేది' ఇలా సినిమాలున్నాయి. అయితే అప్పటికే ఉన్న కమిట్‌మెంట్స్‌ కారణంగా చేయలేకపోయాను. మంచి సామాజిక కారణం ఉండటంతో టెంపర్‌ రీమేక్‌లో నటిస్తున్నాను.

మీ టూ ఉద్యమం ఉధృతంగా ఉంది కదా.. నడిగర్‌ సంఘం నుండి ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
- నిర్మాతల వైపు నుండి ముగ్గురు సభ్యులున్న కమిటీని... బాధితుల తరపు నుండి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశాం. ఇప్పుడున్న సమస్యలే కాకుండా భవిష్యత్‌లో రాబోయే నటీనటులకు భరోసా ఇచ్చేలా పారదర్శక నిర్ణయాలను తీసుకుంటాం. ఇందులో కౌన్సిలింగ్‌ కూడా ఇస్తాం. ఏదైనా నేరం జరిగినప్పుడు ఏమీ మాట్లాడకపోవడం కూడా సెక్షన్‌ 201 ప్రకారం నేరమే. ఏదైనా జరిగినప్పుడు వెంటనే స్పందించాలి. ఉదాహరణకు అమలాపాల్‌ ఓ లైంగిక వేధింపుల సమస్యను ఫేస్‌ చేసినప్పుడు నాకు వెంటనే ఫోన్‌ చేసింది. నేను కూడా వెంటనే కార్తికి ఫోన్‌ చేసి .. సత్వరచర్యలు తీసుకున్నాం కాబట్టే ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేయగలిగాం. బాధిత అమ్మాయి ధైర్యంగా ముందుకు రావాలి. అలా ముందుకు వస్తే మన పేరు పోతుంది.. ఏదో అయిపోతుందని భయపడకూడదు. ఎదుటి వ్యక్తుల నుండి రెస్పాన్స్‌ వచ్చినప్పుడే ఏదైనా సపోర్ట్‌ చేయగలం. మీటూ ఉద్యమాన్ని తప్పుగా ఉపయోగించే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకు రేపు ఎవరైనా నా మీద కూడా ఆరోపణలు చేస్తే.. నేను సంపాదించుకున్న పేరు మొత్తం పోతుంది. కాబట్టి ఏదైనా లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు కూడా ఉంటేనే మంచిది. ఎందుకంటే మీ టూని దుర్వినియోగం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

తెలుగులో సినిమా ఎప్పుడు..?
- చేస్తానని చెబుతున్నాను కానీ, చేయడ లేదు. స్ట్రయిట్‌ తెలుగు సినిమా చేస్తానని చెప్పను కానీ.. తెలుగు తమిళంలో సినిమా చేస్తాను. డిటెక్టివ్‌ సీక్వెల్‌ను తెలుగు, తమిళంలో తెరకెక్కించాలనుకుంటున్నాం. ఓ సినిమాను రెండు భాషల్లో సమాంతరంగా తెరకెక్కించడం అంత సులువైన విషయం కాదు. నా సినిమాలకు సంబంధించిన తెలుగు, తమిళ ప్రేక్షకుల ఆదరణ ఒకేలా ఉంటుంది. కంటెంట్‌ బాగుందనుకున్న ప్రతిసారి ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. అయితే నెటివిటీకి సంబంధించిన కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకు తెలుగు సినిమాను తమిళంలో రీమేక్‌ చేస్తే తమిళ దర్శకుడినే తీసుకుంటాను. ఎందుకంటే తమిళ నెటివిటీ గురించి తమిళ దర్శకుడికే కదా! తెలిసేది. అలాగే తమిళ ప్రేక్షకులు సాంగ్స్‌ లేకుండా కూడా సినిమాను చూస్తారు. 'అభిమన్యుడు' సినిమాలో నాకు, సమంతకు ఓ సాంగ్‌ ఉంటుంది. తమిళంలో ఆ సాంగ్‌ ఉండదు. అదే సాంగ్‌ను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved