pizza
'సంతోషం సౌత్ ఇండియా ఫిలిం అవార్డ్స్' వేడుకలో
అలనాటి హాట్ లేడీ జయమాలిని
You are at idlebrain.com > news today >
Follow Us

30 August 2014
Hyderabad

ఎవరు తెరపై కనిపిస్తే...గుండె వేగం పెరుగుతుందో...
ఎవరు చిందేస్తే... ఎక్కడలేని హుషారు వచ్చేస్తుందో...
ఎవరు కవ్విస్తే... వంట్లో నరాలు జివ్వుమంటాయో...
ఆమే 'జయమాలిని'.

నాటి తరం ప్రేక్షకుల్లో ఈ నిండు అందాల సుందరిని తెలియనివారుండరు. 1975 నుంచి మొదలుపెట్టి దాదాపు 15 ఏళ్ల పాటు ప్రేక్షకులను... తన డాన్సులతో, సెక్సీ రోల్స్ తో మగవాళ్లకు ఓ రేంజ్ లో కిక్ ఎక్కించారు జయమాలిని. 'నీ ఇల్లు బంగారం కానూ.. నా ఒళ్లు సింగారం కానూ...', 'గుడివాడ వెళ్లాను.. గుంటూరు వెళ్లాను..', 'పుట్టింటోళ్లు తరిమేశారు...' అంటూ పలు హాట్ సాంగ్స్ లో చాలా హాట్ హాట్ గా నర్తించిన ఈ హాట్ లేడీని మర్చిపోవడం అంత సులువు కాదు. అసలు జయమాలిని ప్రత్యేకత ఏంటి?

ఆ రికార్డ్ జయమాలినిదే!
నేటి తరం ఐటమ్ డాన్సర్స్ లా సన్నగా, మెరుపు తీగలా ఉండేవారా? ఊహూ.. చాలా బొద్దుగా ఉండేవారు. ఎంత బొద్దుగా అంటే... చూడ్డానికి రెండు కళ్లూ చాలనంత. అంత బొద్దుగా ఉన్నా జయమాలిని ముద్దుగా ఉండేవారు. అందుకే.. ఆమె దక్షిణ, ఉత్తరాది భాషల్లో కలిపి 500 సినిమాలు చేయగలిగారు. అది కూడా కేవలం ఐటమ్ సాంగ్స్, వ్యాంప్ రోల్స్ మాత్రమే చేశారు. అదే నేటి తరంలో ప్రత్యేక పాటలు చేసే తారలను తీసుకుంటే... పట్టుమని 50 సినిమాలు చేయడం పెద్ద గగనమవుతోంది. అలాగే, వచ్చిన నాలుగైదేళ్లకే కనుమరుగవుతున్నారు. జయమాలిని రికార్డ్ సాధించడం కానీ, ఆమె ఏలినన్ని సంవత్సరాలను ఏ ఐటమ్ తార కూడా ఏలడం కష్టం.

'సంతోషం' వేదికపై జయమాలిని
నాటి తరం ప్రేక్షకులను ఉర్రూతలూగించిన జయమాలిని ఇప్పుడేం చేస్తున్నారు? వెండితెరకు దూరమైన తర్వాత ఆమె పబ్లిక్ లో కనిపించడమే మానేశారు. సూళ్లూరుపేటలో పుట్టిన ఆమె చెన్నయ్ లో ఉంటున్నారు. అందుకే, ఇక్కడి ప్రేక్షకులకు కనిపించడం మానేశారు. కానీ, జయమాలిని నాటి తరం అభిమానులతో పాటు.. నేటి తరం వారికి కూడా ఆమెను చూసే భాగ్యం కలుగుతోంది. అందుకు 'సంతోషం సౌత్ ఇండియా ఫిలిం అవార్డ్స్' వేడుక వేదిక కానుంది. 'సంతోషం' ప్రతిక అధినేత సురేష్ కొండేటి ఆహ్వానాన్ని మన్నించి జయమాలిని ఈ వేడుకకు విచ్చేస్తున్నారు.

22 ఏళ్ల తర్వాత హైదరాబాద్ వస్తున్న జయమాలిని
ప్రతి ఏడాది అత్యంత వైభవంగా అవార్డు వేడుక చేయడం సురేష్ కొండేటి స్టయిల్. ఓ ఏడాది అయితే ఏకంగా వేదిపై వాన పాటలు చేయించారు. అదో అద్భుతం. ఇలా ఏదో ఒక సంచలనం చేయడానికి తపన పడతారు. ఈసారి అలాంటి సంచలనాలు చాలా ఉన్నాయి. వాటిలో జయమాలిని రావడం ఓ సంచలనం. ఇందులో సంచలనం ఏముంది అనుకుంటున్నారా?

దాదాపు 22ఏళ్ల తర్వాత జయమాలిని హైదరాబాద్ వస్తున్నారు. ఇది నిజంగా ఆనందించదగ్గ విషయం. జయమాలిని రాక ఈ అవార్డు వేడుకకు ఓ ప్రత్యేకత అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జయమాలిని చేసిన పాటల్లో 'ఓ సుబ్బారావు... ఓ అప్పారావు..' ఒకటి... సో.. సుబ్బారావులూ... అప్పారావులూ.. ఇంకా జయమాలిని అభిమానులు డోంట్ మిస్ ది షో.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved