pizza
KS Rama Rao about Kousalya Krishnamurthy
కంటెంట్‌లో ద‌మ్ముంద‌ని న‌మ్మి రీమేక్ చేశాం - కె.ఎస్‌.రామారావు
You are at idlebrain.com > news today >
Follow Us

22 June 2019
Hyderabad

తెలుగు ఇండ‌స్ట్రీలో క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ బ్యాన‌ర్‌కు ఉన్న స్థానం చాలా ప్ర‌త్యేక‌మైంది. ఆ సంస్థ నుంచి వ‌స్తున్న 46వ చిత్రం కౌస‌ల్యా కృష్ణ‌మూర్తి. త‌మిళంలో విజ‌యం సాధించిన క‌ణా చిత్రానికి రీమేక్ ఇది. ఐశ్వ‌ర్యా రాజేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, కార్తిక్ రాజు, వెన్నెల కిశోర్‌, శివ కార్తికేయ‌న్ కీల‌క పాత్ర‌లు పోషించారు. భీమినేని శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రం గురించి కె.ఎస్‌.రామారావు శ‌నివారం విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు...

మా `కౌస‌ల్యా కృష్ణ‌మూర్తి` చిత్రానికి ఈ నెల 24న సెన్సార్ జ‌ర‌గ‌నుంది. త‌మిళ్‌, హిందీ, మ‌ల‌యాళంలో ఇప్ప‌టికే మంచి పేరు తెచ్చుకున్న తెలుగ‌మ్మాయి ఐశ్వ‌ర్య రాజేష్ ఇందులో నాయిక‌. ఆమె తండ్రి రాజేష్ తెలుగులో పెద్ద హీరో. ఆయ‌న తండ్రి అమ‌ర్‌నాథ్‌గారు కూడా మంచి హీరో. మ‌న కామెడీ ఆర్టిస్ట్ శ్రీల‌క్ష్మికి ఈఅమ్మాయి మేన‌కోడ‌ల‌వుతుంది. తెలుగులో ఈ అమ్మాయిని మేమే ప‌రిచ‌యం చేస్తున్నాం. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో మేం తెర‌కెక్కించే సినిమా కోసం ముందు ఐశ్వ‌ర్య‌ని ఓ నాయిక‌గా తీసుకున్నాం. ఆ త‌ర్వాత ప‌రిచ‌యంలో అమ్మాయి క‌ణా గురించి చెప్పింది. భీమినేని శ్రీనివాస‌రావుతో క‌లిసి గ‌తంలోనూ ప‌లు రీమేక్ చిత్రాల‌ను చేసి, మేం హిట్ చేశాం. అదే న‌మ్మ‌కంతో ఈ సినిమాను కూడా రీమేక్ చేశాం. ఈ చిత్రం పూర్తిగా తండ్రీ కూతుళ్ల అనుబంధంతో సాగుతుంది. ఇందులో తండ్రికి క్రికెట్ అంటే ఇష్టం. అత‌ను ఓ పేద రైతు. ప‌ల్లెటూరిలో పుట్టి పెరిగిన అమ్మాయి ఎలా ఎదిగి సిటీల్లో తిరిగి, భార‌త‌దేశానికి క్రికెట్‌లో పేరు తెచ్చిపెడుతుంద‌న్న‌ది కాన్సెప్ట్. మార్చిలో రాజ‌మండ్రిలో షూటింగ్ మొద‌లుపెట్టాం. 35 రోజుల్లో మొత్తం చిత్రీక‌రించేశాం. ఇందులో హీరోయిన్ త‌ల్లిగా ఝాన్సీ బాగా చేసింది. ఐశ్వ‌ర్య ఈ సినిమా కోసం క్రికెట్ నేర్చుకుంది. ఆమె కోచ్ పాత్ర‌లో శివ కార్తికేయ‌న్ చేశాడు. త‌మిళంలో ఈ సినిమాను ఆయ‌నే నిర్మించారు. చాలా పెద్ద హిట్ అయింది. పాట‌ల‌ను కూడా అక్క‌డి ట్యూన్సే వాడుకున్నాం. త‌మిళంలో ఉన్న సినిమాను య‌థాత‌థంగా తెలుగులోకి తీసుకొచ్చాం. మ‌న లొకేష‌న్లు, మ‌న ఆర్టిస్టులు ఉంటారు. అంత‌కు మించి క‌థా ప‌రంగా మేం ఏ మార్పులూ చేయ‌లేదు. మా పంపిణీదారుల‌తో మాట్లాడితే జులై రెండో వారంలోపే విడుద‌ల చేద్దామ‌ని అన్నారు. జులై 2న ప్రీ రిలీజ్ వేడుక‌కు మిథాలీరాజ్‌ను ఆహ్వానిస్తున్నాం. అమ్మాయిల్లో నిగూఢ‌మైన శ‌క్తి ఏంటి? వాళ్ల ల‌క్ష్యాల‌ను త‌ల్లిదండ్రులు ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా ప్రోత్స‌హించాలి వంటి వివ‌రాల‌న్నీ ఇందులో ఉంటాయి. పాట‌ల‌ను సోమ‌వారం నుంచి యూట్యూబ్‌లో సోనీ మ్యూజిక్ ద్వారా అందుబాటులోకి తెస్తాం. కంటెంట్‌లో ద‌మ్ముంటే సినిమా ఆడుతుంద‌నే న‌మ్మకంతోనే రీమేక్ చేశాం. నేను నిర్మాత‌గా ఇన్నేళ్లుగా ఉన్నా నాకు సినిమా మీద ప్యాష‌న్ త‌గ్గలేదు. మునుప‌టి ఉత్సాహంతోనే ప‌నిచేస్తున్నా. పెద్ద సినిమాల‌ను చేస్తున్న‌ప్పుడు ఎంత ఆనందంగా ఉంటానో, ఇలాంటి చిన్న సినిమాల‌ను నిర్మిస్తున్న‌ప్పుడు కూడా అంతే ఆనందంగా ఉంటాను`` అని చెప్పారు.

interview gallery



 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved