pizza
Lakshmi Manchu birthday (8 October) interview
టీవీ షో, వెబ్ సిరీస్ చేస్తున్నా: మంచు లక్ష్మీ
You are at idlebrain.com > news today >
Follow Us

7 October 2017
Hyderabad

నటిగా, వ్యాఖ్యాతగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మి.. అక్టోబర్ 8న పుట్టినరోజు జరుపుకోనుంది. ఈ పుట్టినరోజుతో 40వ వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ సంధర్భంగా.. ఆమెతో కాసిన్ని ముచ్చట్లు..

ఈ పుట్టినరోజు ఎలా జరుపుకోనున్నారు..?
ప్రతి పుట్టినరోజుని నేను పెద్దగా సెలబ్రేట్ చేసుకోవడం నాన్న దగ్గర నుండి నేర్చుకున్నాను. ఆయన పుట్టినరోజు మాకు పండగ లాంటిది. నేను కూడా ఆ ట్రెడిషన్ ను కంటిన్యూ చేస్తున్నాను. ఫారెన్ లో ఉన్నప్పుడు కూడా డబ్బులు దాచుకొని నా స్నేహితులకు పెద్ద పార్టీ ఇచ్చేదాన్ని. ఈ పుట్టినరోజు అభిమానులతో సగం రోజు గడపుతాను. సాయంత్రం నుండి కుటుంబం, స్నేహితులతో కలిసి పార్టీ జరుపుకుంటాను.

ఈ బర్త్ డే రిజల్యూషన్స్ ఏంటి..?
ఈ ఏడాది కంటే వచ్చే ఏడాది ఇంకా పెద్దగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటా..(నవ్వుతూ) ప్రత్యేకంగా రిజల్యూషన్స్ అంటూ ఏమి తీసుకోను.

షో చేస్తున్నారని విన్నాం. నిజమేనా..?
అవును.. ఫిదా అనే షో చేస్తున్నాను జెమిని టీవీలో.. అలానే వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేశాను. భర్తను వదిలేసి భార్య వారం రోజులు బయటకు వెళ్లిపోతే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో వెబ్ సిరీస్ చేస్తున్నాను. దొంగాట ఫేమ్ వంశీ ఈ సిరీస్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు.

కొత్త సినిమాలు ఏమైనా.. అంగీకరించారా..?
పీపుల్స్ మీడియా గ్రూప్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నాను. ఆ సినిమాతో కొత్త డైరెక్టర్ పరిచయం కాబోతున్నాడు. మరికొద్ది రోజుల్లో సినిమా మొదలుకానుంది.

సినిమాల విషయంలో గ్యాప్ రావడానికి కారణం..?
ఏదొక సినిమా చేయడం నాకిష్టం లేదు. నా ఆఖరి సినిమా విషయంలో అలానే జరిగింది. అలా తొందరపడకూడని, జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను.

'మేము సైతం' షో తరువాత మీలో ఏమైనా మార్పు గమనించారా..?
కష్టాలు ప్రతి మనిషికి ఉంటాయి.. 'మేము సైతం' షో చేయకముందు నాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఉన్నాయని ఆలోచించేదాన్ని.. అన్నీ ఉండి కూడా నేను ఇవి భరించాలా..? అని బాధ పడేదాన్ని. ఆ షో మొదలయిన తరువాత సమస్యలను హ్యాండిల్ చేయగలిగే నమ్మకం వచ్చింది. మనం చేసే చిన్న సహాయం కొందరి జీవితంలో సంతోషం నింపుతుంది అంటే అంతకు మించి ఏంకావాలి..?

interview gallery

వినాయకచవితి, ట్రాఫిక్ వంటి విషయాల్లో సోషల్ మీడియాలో బాగా స్పందిస్తున్నారు..?
నీళ్లలో కలిపేసే వినాయకుడు విగ్రహం కోసం రోడ్లని పాడుచేస్తున్నారు. అది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. మన సంప్రదాయాలు మనకు ఉంటాయి. కానీ వాటి కారణంగా ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. మొన్నటికి మొన్న నేను మా రెస్టారంట్ నుండి రాత్రి 9 గంటల సమయంలో హైటెక్స్ కు వెళ్లడానికి గంట 45 నిమిషాల సమయం పట్టింది. ట్రాఫిక్ లేకపోతే 20 నిమిషాలు మాత్రమే పడుతుంది. మన నాయకులకు ఈ విషయాలు తెలియవు. వారు రాత్రి 9 గంటలకు ఆ రోడ్లలో తిరగరేమో.. పాత కాలంలో రాజుల మాదిరి మారు వేషాలు వేసుకొని మన నేతలు కూడా ప్రజల్లో తిరగాలి. అప్పుడే వారికి తెలుస్తుంది.

సోషల్ మీడియాలో మీపై చేసే కామెంట్స్ ను ఎలా తీసుకుంటారు..?
ట్విట్టర్ లో నాకు వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. నన్ను అభిమానించే వారు ఐదుగురు ఉన్నా సరిపోతుంది. కానీ ట్విట్టర్ పక్షి వెనుక ఉంటూ నన్ను కామెంట్ చేస్తుంటారు. ఆ కామెంట్లు నన్ను బాధ పెడతాయి. అందుకే చాలా బ్లాక్ చేస్తూ ఉంటాను. బహుశా అందరికంటే ఎక్కువగా నేనే బ్లాక్ చేస్తానేమో!

మదర్ హుడ్ ఎలా ఉంది..?
నా కూతురిని నేను చాలా ప్రశ్నలు అడుగుతుంటాను. నీకేం కావాలి..? ఎంత తింటావ్..? ఇలా ప్రతి విషయాన్ని అడుగుతూనే ఉంటాను. కొన్ని సార్లు నాకోసం వద్దు అంటుంటుంది. నేను తెలుసుకొని తనకు ఏం కావాలో చూసుకుంటాను. పెళ్లి చేసుకున్నా.. లేకపోయినా.. పిల్లలు మాత్రం ఉండాలండి. అదొక మంచి అనుభవం. నా పుట్టిన రోజుకి నా కూతురు గిఫ్టులు కూడా తీసుకుంది.

మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్..?
తిరుమలలో గర్భ గుడిలో ఉన్నప్పుడు.. అక్కడున్న కొందరు నన్ను దేవతతో పోల్చారు. ఆ కాంప్లిమెంట్ ఎప్పటికీ మర్చిపోలేను.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved