pizza
Maruthi interview (T) about Mahanubhavudu
అలా ఎత్తేస్తే ఎందుకు ఒప్పుకుంటారు? - మారుతి
You are at idlebrain.com > news today >
Follow Us

28 September 2017
Hyderabad

`ఈ రోజుల్లో` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త ట్రెండ్ సినిమాను అందించిన ద‌ర్శ‌కుడు మారుతి. తాజాగా శ‌ర్వానంద్‌తో `మ‌హానుభావుడు` సినిమాను రూపొందించారు. ఆ సినిమా శుక్ర‌వారం విడుద‌ల కానుంది. ఈ సినిమా గురించి ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు..

* మామూలుగానే మ‌న హీరోలు చాలా మంచి వాళ్లు.. ఈ సినిమాతో వారిని `మ‌హానుభావుడు` చేశారా?
- హీరో అంటేనే స్పెష‌ల్ అండీ. నిజ జీవితంలో మ‌న‌క‌న్నా వాళ్లు స్పెష‌లే. మా సినిమాకు `మ‌హానుభావుడు` అనే పేరు ఎందుకు పెట్టాన‌నేది సినిమా చూస్తే తెలుస్తుంది.

* భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌లోనూ హీరోకి లోపం ఉంది. ఇందులోనూ లోపం పెట్టారు ఎందుకని?
- అది లోపం అండీ. ఇది అల‌వాటు. మ‌నుషుల అల‌వాట్లు, గుణ‌గ‌ణాల మీద చాలా క‌థ‌లే రాసుకోవ‌చ్చు. అలాంటి క‌థ‌ల్లో ఇది ఒక‌టి.

* ఈ క‌థ‌కి స్ఫూర్తి ఏమైనా ఉందా?
- స్పెష‌ల్‌గా స్ఫూర్తి ఏమీ లేదండీ. కాక‌పోతే ఇదే అంశంతో వ‌ర‌ల్డ్ మొత్తం మీద వ‌చ్చిన ప‌దీ, పన్నెండు సినిమాల‌ను చూశాను. ఆ అంశాలు నా సినిమాలో రిఫ్లెక్ట్ కాకుండా చూసుకున్నాను.

* మ‌ల‌యాళ సినిమాకు రీమేక్ అనే వార్త‌లు వినిపిస్తున్నాయి?
- ఓసీడీ అన‌గానే మ‌ల‌యాళ సినిమాకు రీమేక్ అంటే ఎలాగ‌? ఈ సినిమా విడుద‌ల‌య్యాక చూసి చెప్పండి. మామూలుగా మ‌న చొక్కాను పోలిన చొక్కా ఎవ‌రైనా వేసుకుంటేనే ఒప్పుకోం. అలాంటిది ఎవ‌రో మ‌న సినిమాను ఎత్తేస్తే ఎలా ఒప్పుకుంటాం? ఎవ‌రూ ఒప్పుకోరు. కాబ‌ట్టి అలాంటివేమీ లేవు.

* బాబు బంగారం విష‌యంలో ఏమైనా డిప్రెష‌న్ ఫీల‌య్యారా?
- అలాంటిదేమీ లేదండీ. కాక‌పోతే ఆ పాత్ర‌ను నేను అనుకున్న రీతిలో స్క్రీన్ మీద‌కు తీసుకురాలేక‌పోయాన‌ని అనుకున్నానంతే. మిగిలిన విష‌యాల్లో అంద‌రూ హ్యాపీయే.

* `మ‌హానుభావుడు` చిత్రాన్ని శ‌ర్వానంద్‌తో చేయ‌డం ఎలా ఉంది?
- చాలా ఆనందంగా ఉందండీ. మిగిలిన హీరోలు ఆ పాత్ర‌ల‌ను త‌మ స్టైల్‌కి త‌గ్గ‌ట్టు మార్చుకుని చేస్తారు. శ‌ర్వానంద్ మాత్రం ఆ పాత్ర‌లోకి ప‌ర‌కాయ‌ప్ర‌వేశం చేసి చేస్తాడు. అదీ తేడా. తొలి రోజే త‌ను పాత్ర‌లోకి ప‌ర‌కాయప్ర‌వేశం చేశాడ‌ని నాకు అర్థమైంది. అయిన‌ప్ప‌టికీ నేను ప్ర‌తి స‌న్నివేశాన్ని యాక్ట్ చేసి చూపించాను.

* ఓసీడీ ల‌క్ష‌ణాలున్న వ్య‌క్తులు మీకు తెలుసా?
- చాలా మంది తెలుసండీ. కొంద‌రు చేసిన ప‌నులే మ‌ళ్లీ మ‌ళ్లీ చేస్తుంటారు. మ‌రికొంద‌రు అతి శుభ్రంగా ఉండ‌టానికి ప్ర‌య‌త్నిస్తుంటారు. ఆయా ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టి వాళ్ల‌ను వ‌ర్గీక‌రించ‌వ‌చ్చు. నాకు తెలిసిన వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ నాలో అలాంటి గుణాలు లేవు. ఒక‌వేళ ఉంటే ఇంత సెటైరిక‌ల్‌గా నేను సినిమా చేయ‌లేను. ప్ర‌స్తుతం మాత్రం హ్యాపీగా ఉన్నాను.

interview gallery

* ఈ క‌థ‌ను ఎప్పుడు రాశారు?
- మూడు, నాలుగు ఏళ్ల క్రితం అనుకున్నా. అఖిల్‌కి స‌రిపోతుంద‌ని నాగార్జున‌గారికి కూడా చెప్పాను. ఆయ‌న ఫ్రెండ్ ఒక‌త‌ను రోజుకో స‌బ్బు మార్చుకుంటార‌ని కూడా నాగార్జున‌గారు నాతో అన్నారు.

* పంచ్ డైలాగులు ఉంటాయా?
- నేను డైలాగును డైలాగుగానే రాసుకుంటానండీ. అక్క‌డ పంచ్‌ల‌కోసం వెతుక్కోను.

* నెక్స్ట్ చైతన్య‌తో తీయ‌బోయే సినిమా ఎలా ఉంటుంది?
- ప్రేమ క‌థ ఉంటుంది. ఎంట‌ర్‌టైన్‌మెంట్ కూడా ఉంటుంది.

* స్టార్ హీరోల‌తో చేయ‌డం క‌న్నా, యంగ్ హీరోల‌తో చేయ‌డం సుల‌భంగా ఉంటుందా?
- అలాంటిదేమీ ఉండ‌దండీ. ఏ సినిమాలోనైనా క‌థ‌ను క‌న్విన్సింగ్‌గా చెబితే చాలు. నేను ఒక్కో సినిమాను ఒక్కో జోన‌ర్‌లో ఉండాల‌ని తీస్తాను. నా ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ విడుద‌లైన త‌ర్వాత దాదాపు వారానికి ఒక సినిమా ఒక దెయ్యం, న‌లుగురు క‌మెడియ‌న్ల‌తో విడుద‌ల‌వుతూనే ఉంది. కానీ అవ‌న్నీ హిట్ కాలేదు. ఏ ద‌ర్శ‌కుడి బ‌లం ఏంటో తెలుసుకుని, ఆ ర‌కంగా సినిమాలు తీస్తే త‌ప్ప‌కుండా హిట్ అవుతాయ‌ని నా న‌మ్మ‌కం.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved