pizza
'ముకుంద'కు యు/ఎ సర్టిఫికెట్...
24న విడుదల
You are at idlebrain.com > news today >
Follow Us

19 December 2014
Hyderabad

ఓ కొత్త హీరో తెరకు పరిచయం అవుతున్నాడంటే.. అది కూడా సెలబ్రిటీ కుటుంబం నుంచి ఓ కుర్రాడు హీరోగా పరిచయమవుతున్నాడంటే ఎన్ని అంచనాలు ఏర్పడతాయో.. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ పై అన్ని అంచనాలు ఏర్పడ్డాయి. 'ముకుంద'గా వరుణ్ ఈ నెల 24న తెరకు రానున్నాడు. 'కొత్త బంగారు లోకం', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో లియో ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ఈతరం కుర్రాళ్ల భావోద్వేగాలు, జీవితం పట్ల వాళ్లకుండాల్సిన స్పష్టత ప్రధానాంశాలుగా పట్టణ నేపథ్యంలో సాగే చిత్రం 'ముకుంద'.

ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ - "ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ లభించింది. ఓ మంచి కమర్షియల్ మూవీకి కావల్సిన అన్ని అంశాలూ ఉన్న చిత్రం ఇది. వరుణ్ తేజ్ అద్భుతంగా నటించడు. అనుభవం ఉన్న హీరోలా వరుణ్ నటించిన వైనం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మిక్కీ జె.మేయర్ స్వరపరిచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా ఈ చిత్రం ఉంటుంది'' అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ - ''వరుణ్ లో మంచి మాస్ హీరో ఉన్నాడని నిరూపించే చిత్రం ఇది. డాన్సులు, ఫైట్స్ అన్నీ బాగా చేశాడు. ప్రచార చిత్రాలకు, పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ చిత్రానికి కూడా మంచి ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉంది'' అని చెప్పారు.

నాజర్, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, రావు రమేశ్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, కెమెరా: మణికందన్, నిర్మాణం: లియో ప్రొడక్షన్స్.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved