pizza
Om Namo Venkatesaya gets clean U, film release on 10 February
'ఓం నమో వేంకటేశాయ' సెన్సార్‌ పూర్తి - ఫిబ్రవరి 10 విడుదల
You are at idlebrain.com > news today >
Follow Us

1 February 2017
Hyderabad

అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన భక్తిరస చిత్రాలు అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడిసాయి ప్రేక్షకుల్ని ఎంత రంజింపజేసాయో అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ వీరి కాంబినేషన్‌లో హాథీరామ్‌ బాబా ఇతివృత్తంతో రూపొందిన మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఎ.మహేష్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్‌ 'యు' సర్టిఫికెట్‌ పొందింది. చిత్రాన్ని చూసిన సెన్సార్‌ సభ్యులు ఒక గొప్ప భక్తిరస చిత్రాన్ని రూపొందించారని దర్శకనిర్మాతలను ప్రశంసించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది.

ఈ సందర్భంగా నిర్మాత ఎ.మహేష్‌రెడ్డి మాట్లాడుతూ - ''నాగార్జునగారు, రాఘవేంద్రరావుగారి కాంబినేషన్‌లో మరో అద్భుత దృశ్యకావ్యంగా 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం రూపొందింది. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని క్లీన్‌ 'యు' సర్టిఫికెట్‌ పొందింది. ఫిబ్రవరి 10న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం. మా బేనర్‌లో, నాగార్జునగారి కెరీర్‌లో, రాఘవేంద్రరావుగారి కెరీర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది. కీరవాణిగారి సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో ఇప్పటికే ఘనవిజయం సాధించింది. నాగార్జునగారి నటన, రాఘవేంద్రరావుగారి టేకింగ్‌, కీరవాణిగారి మ్యూజిక్‌ హైలైట్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు గొప్ప మధురానుభూతిని కలిగిస్తుంది'' అన్నారు.

అక్కినేని నాగార్జున హాథీరామ్‌ బాబాగా మరో అద్భుతమైన పాత్ర చేసిన ఈ చిత్రంలో వేంకటేశ్వరస్వామిగా సౌరబ్‌జైన్‌ నటించగా, భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క కనిపించనుంది. జగపతిబాబు, ప్రగ్యా జైస్వాల్‌, విమలా రామన్‌, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌, ప్రభాకర్‌, రఘుబాబు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రూపొందించిన ఈ చిత్రానికి స్వరవాణి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు. ఎస్‌.గోపాల్‌రెడ్డి, జె.కె.భారవి, కిరణ్‌కుమార్‌ మన్నె, గౌతంరాజు ఇతర సాంకేతిక వర్గం.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved