pizza
A tribute to Sirivennela by Srinivas Kanchibhotla
సిరివెన్నెల
You are at idlebrain.com > news today >
Follow Us

30 November 2021
Hyderabad

ఆలోచన అందె తొడిగితే.... తత్వం తాళ గతులలో నడిస్తే.... నిబద్ధత వరసలు నేరిస్తే..... అది సిరివెన్నల పాటవుతుంది.... ఆ పాట పూర్ణాయుర్దాం పోసుకుంటుంది...

సహజంగా చిత్రంలో ఒక పాటకున్న పరిధి నిడివి తక్కువ. ఐదు నిముషాల కాలంలో సందర్భాన్ని, వరుసని అనుసరించి తను చెప్పాలనుకున్నది త్వరత్వరగా చెప్పేసుకుని పక్కకు తప్పుకు పోవడమే తన పని, పరమార్ధం. కానీ ఆ ఐదు నిముషాల కాల పరిమితిలోనే ఆ పాట వామనమూర్తి త్రివిక్రముడైనట్టు తనకు కేటాయించబడిన భావ, సందర్భ పరిధులు దాటుకుని వెళ్ళి, ఆ చిత్ర సీమల్ని ఛేదించుకుని పోయి, కాలమాన పరిస్థితులకు అతీతంగా అజరామరంగా చిరంజీవిగా చిరంతనంగా ప్రజల మనసుల్లో, తలపుల్లో, పెదువుల్లో నిలబడిపోగలిగితే.... ఆ పాట పాపకి ఊపిరి పోసిన తల్లి లాంటి కవి హృదయం ఉబ్బి తబ్బిబవుతుంది... ఆ ఆలోచనకి అంకురార్పణ చేసిన తండ్రి వంటి కవి మస్తిష్కం (సుమతీ శతక కర్త చెప్పినట్టు "జనులా పుత్రుని కనుగుని పొగడగ") గర్వంగా తలెత్తుకుంటుంది.... అలాంటి ఎన్నో ఆలోచనలకి తల్లిగా ప్రాణం పోసి, ఒక పాటగా నడక, నడత నడవడిక తండ్రిగా తర్ఫీదు ఇచ్చి తెలుగు సినీ ప్రపంచానికి తన పిల్లలుగా పరిచయం చేసిన అర్ధ-భావీస్వరుడు సిరివెన్నెల... తన పాట (పిల్లల) విషయంలో అందుకనే తనకు అంత గర్వం, ధీమ, విశ్వాసం, నమ్మకం.

గౌరవం అనేది అడిగితే ఇచ్చేది కాదు, రమ్మంటే వచ్చేది కాదు. అందులోనూ డబ్బు ప్రధానంగా నడిచే చిత్రసీమలో ప్రతిభకి విలువ ఇచ్చి, ఆ విలువకి ఇంత వెల అని తూకం వేసే వాణిజ్య పరమైన వ్యాపారంలో, దానిని ఒక హక్కుగా సంపాదించుకోవడం, ఆ వచ్చిన దానిని చివరంట అదే స్థాయిలో నిలబెట్టుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. రాసిన పాటకు డబ్బు తీసుకున్నారుగా అంటూ ప్రతిభకు గుర్తింపు, పురస్కారం కాసుల్లోనే కాసులతోనే అనుకునే పరిశ్రమలో, రాసి ఇచ్చిన పాటను చదువుకున్న వెంటనే కళ్ళు చెమరించి, అరచేతులు అప్రయత్నంగా బందీలైపోయిన నిదర్శనలే గౌరవ పురస్కారాలు. ఆ గౌరవానికి రివార్డులు అవార్డులు అక్కరలేదు. పాట తలుచుకున్న వెంటనే చిత్రంలో ఆ పాట సందర్భం మీద పోక, మనసు ఆ పాట లోని మాటల పదును, లాలిత్యము, భావంలోని లోతు, గాంభీర్యత, పదాల అమరికలో సొగసు, సొబగు మీదకి మళ్ళిందంటే, అది ఆ పాట హక్కుగా సంపాదించుకున్న గౌరవము. అలాంటి పాటలను వేనవేల సంఖ్యల్లో విరచించిన భావవిరించి సిరివెన్నెల...

గొప్ప సినీ కవులు ఇంతకూ మునుపూ ఉన్నారు, ఇక ముందూ వస్తారు. ఎవరి శైలి వారిదే, ఎవరి ప్రతిభ వారిదే. వందల వేల సంఖ్యలో పాటలు రచించిన ప్రతిభామూర్థులైన కవులకు సైతం తమ ముద్ర తాము రాసిన ప్రతి ఒక్క పాటలోనూ ప్రతిబించే విధంగా చూసుకోవడం ఒక దుస్సాహసమే. ఆ అసాధ్యన్ని సుసాధ్యం చేసి చూపెట్టిన కవులలో ముందు వరుసలో నిలేచేది - దేవులప్పలి, సినారె, సిరివెన్నెలలే. వీరిలో మళ్ళీ సిరివెన్నెలది మరింత కష్టతమమైన పాత్ర. సంగీతానికి సాహిత్యానికీ ఇంతో అంతో సమన్యవముండే రోజులలో, పెద్ద పదం వేస్తే, మంచి మాట రాస్తే ఝడిసిపోయి బెదిరిపోక ఆదరించి అక్కున చేర్చుకునే దర్శక నిర్మాతలు, ప్రేక్షకులూ ఉన్న రోజుల్లో రాసిన దేవులపల్లి, సినారె ల కంటే, తెలుగు పాటలో వాడే భాష మాత్రమే తెలుగై, స్వరపరిచే వారి దగ్గర నించి, గొంతు అందించే వారి వరకు, ఆ పాట విని ఔననే వారి దగ్గర నించి, ఆ పాటని అభినయించే వారి వరకూ ఎటువంటి తెలుగు వాసన అంటని వారిని కూడా ఒప్పించుకుంటూ, మెప్పించుకుంటూ మెలిగిన సిరివెన్నెల పాట బాట మరింత కష్టతరమైనది. అయినా రాయవలసిన ప్రతి సందర్భాన్నీ ఒక సవాలుగా స్వీకరించి, రాత స్థాయిని ఏ మాత్రమూ దింపకుండా, తగ్గనివ్వకుండా, తను మొట్టమొదట రాసిన ఉదాత్త సన్నివేశనికి రాసిన నిబద్ధతే చివరి పాట వరకూ నిలపగలిగే క్రమశిక్షణ సిరివెన్నెల కలానికి సొంతం, (ప్రస్తుత నవీన సినీ యుగంలో) పరిమితం.

అతను ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థ అనేది పెద్ద మనుషులకు గౌరవాన్ని ఆపాదించే క్రమంలో తరుచు వాడే ప్రయోగం. సిరివెన్నల విషయంలో తనది పాట కాదు, ఒక ఆలోచన. నిజానికి తన పాటల్లో భాషాపరమైన విన్యాసాల కంటే (అవి కూడా లేకపోలేవు) తాత్విక తర్కమే ఎక్కువ కనిపిస్తుంది. తత్వము అంటే వేదాంతపరమైన మీమాంసలో, వయసు మళ్ళిన కాలంలో చేసే విచారణలో కావు. ఈ తత్వము విషయ పరిశీలనకి సంబంధించినది. పరిశీలన అంటే కేవలము పైపొరల వరకే ఆగక, తన ఆలోచనా తీక్షణత ఉపరితలాన్ని చీల్చుచుకుని, ఛేదించుకుని, చొచ్చుకుని పోయి దాని అంతర్భాగంలో నిబిడీకృతమైన నిజాన్ని పెకలించి పైకి తీసుకు వచ్చి ప్రపంచానికి పరిచయం చేసే ఒక అవిరళ కృషి, ఒక అవిశ్రాంత శోధన. ఈ పదాలు - కృషి, శోధన - సినీ కవుల్ని ఉద్దేశించి వాడే పదాలు కావు, శాస్త్రజ్ఙులకో, తత్వవేత్తలకో, కృషీవలుల సందర్భాలో ఉపయోగించే పదాలు. అటువంటిది సినీ పాటలను వ్యాఖ్యానిస్తున్నప్పుడు మధనం, ఆలోచనా స్రవంతి, ఆశావదం, విషయ శోధన వంటి పదాలు దొర్లుతున్నప్పుడు అక్కడ జరిగేది కేవలం ఒక పాట సృష్టి కాదు, కంటికి అందని వైశాల్యం, పైకి కనపడని లోతున్న అనంతమైన ఆర్ణవము హృదయాంతరాళాల నుండి ఎడతెగక వెలువడే ఆలోచనా తరంగ సమూహం. మెత్తగా వచ్చి చల్లగా కాలిని తాకిపోయే నురగుల తరగల నుంచి, అడ్డుగా ఎంతెత్తు నిలిచినా దానిపైన నుండి ఉరకగల ఉత్సాహాన్నీ నింపుకున్న తరంగాల నుంచి, ప్రకృతి అబ్బుర పడేలా, పరిసరాలు కంపించిపోయేలా మేర మీరిపోయి కదం తొక్కే అలజడుల అలలు, కల్లోల కెరటాల వరకూ, అన్నీ ఆ గంభీర విషయ నిధి సొంతము. శివుని జటాజూటము నుండి జారిన దివిజ దేవేరి సగర వంశికులకు ఉత్తమ గతులను ఇచ్చినట్టు, ఆలోచనల నుండి ఉవ్వెత్తున జారి పడిన సిరివెన్నెల భావ(నా) తరంగాలు తెలుగు సినీ మాగాణాన్ని కొన్ని తరాల తరబడి సువర్ణ రంజితము చేయక మానదు.

అనుకరణ కన్నా గొప్ప ప్రశంస లేదన్నది ఒక ఉక్తి. పాట అనగానే ప్రాస, తాళ గతులు, యతులు జతులు, గురువులు లఘువులు వంటి శబ్ద సౌందర్య సాధనాల నుంచి, పాట అంటే ఒక ఆలోచన అనే నూతన ప్రమాణం వైపు సినీ పాటను మళ్ళించగలగడమే సిరివెన్నెల భావి కవులకు అందించిపోయిన గొప్ప ఆస్తి. ఎంత పెద్ద సందర్భాన్నైనా, శోధనకు అవసరమైన కుతూహలం, దారిని చూపించే జిజ్ఙాస, పనికి అవసరపడే పదకోశం వెంట తెచ్చుకుంటే, హెచ్చరించే అగాధాలనూ, వెక్కిరించే అపజయాలనూ దాటుకుని పోతూ శాంతపరిచే సమాధానాలు దొరకపుచ్చుకోవడమే సిరివెన్నెల తత్వం. తన తత్వంలో విజయం అనే మాటకి అర్ధం లేదు. తన జగతిలో సమధానానికి ఉన్న విలువ మరి దేనికీ లేదు. బ్రతుకు అనేది నిత్య సంఘర్షణ - అది మనుషులతోనో, వ్యవస్థలతోనో కాదు.... తనలోని ప్రశ్నలతో, తనలోని అశాంతితో, తనలోని నిస్సహాతయతో. అవి చల్లబరుచుకునేందుకు సమాధానాల కోసం జరిపే నిత్య శోధనే బ్రతుకు. శోధన లేని బ్రతుకు ఒక జీవచ్చవం. తుది శ్వాస వరకూ మనిషి తన పరిసరాలహో సమతుల్యం సాధించడానికి సాగించే సమాధానాల అన్వేషణే జీవితం.

పేరు మిగలదు, కానీ ఆలోచన ఉండి పోతుంది... అన్నదెవరో గుర్తు ఉండదు, కానీ ఏం చెప్పారో మిగిలిపోతుంది.... తను ఉండడు, కానీ తన మాట ముందుకు పోతూ ఉంటుంది...ఒక కవికి ఇవ్వగలిన పెద్ద అతి కితాబు ఇదే...

సిరివెన్నెల కలం పోటీ ఎప్ప్పుడూ కాలాంతోనే... తన పాళీకున్న చెరి ఒక సగం - ఒకటి హృదయం, ఒకటి మస్తిష్కం. వాటి హృద్యమైన కలైయికే తరగని సిరివెన్నెల...

by Srinivas Kanchibhotla

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved