pizza
SK Pictures new films
ఎస్. కె. పిక్చర్స్ పతాకంపై శ్రీ సురేశ్‌ కొండేటి మరో రెండు సినిమాలు...
You are at idlebrain.com > news today >
Follow Us

05 October 2018
Hyderabad

స్టార్ కమెడియన్ 'షకలక' శంకర్ హీరోగా ఎస్.కె. పిక్చర్స్ సమర్పణలో రూపుదిద్దుకున్న విజయవంత చిత్రం 'శంభో శంకర' నిర్మాతల్లో శ్రీ సురేశ్ కొండేటి కూడా ఒకరిగా వ్యవహరించారు. అలానే ఇటీవలే మలయాళ చిత్రం 'ఉస్తాద్ హోటల్‌'ను తెలుగులో 'జనతా హోటల్‌' పేరుతో విడుదల చేశారు. వినోదంతో పాటు సామాజికాంశాలతో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు సురేశ్ కొండేటి ఉత్తమాభిరుచిని తెలియచేసేవే. ఈ నెల 6వ తేదీ పుట్టిన రోజు సందర్భంగా శ్రీ సురేశ్ కొండేటి మరో రెండు సినిమాలను ప్రకటించారు.

'షకలక' శంకర్ హీరోగా మరో సినిమా...
ప్రముఖ కమెడియన్ 'షకలక' శంకర్ ను హీరోగా పరిచయం చేసిన సురేశ్ కొండేటి... త్వరలోనే మరో సినిమానూ శంకర్‌ హీరోగా నిర్మించబోతున్నారు. 'శంభో శంకర' సినిమాకు దీటుగా... అన్ని కమర్షియల్‌ హంగులను రంగరించి ఈ సినిమా ఉంటుందని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతున్న ఈ మూవీ అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతోందని సురేశ్ కొండేటి తెలిపారు.

రాజకీయ నేపథ్యం ఇతివృత్తంగా మరో సంచలన చిత్రం...
తెలుగు రాష్ట్రాలలోని ప్రసుత్త రాజకీయాల నేపథ్యంలోనూ ఓ సంచలనాత్మక చిత్రానికి శ్రీ సురేశ్‌ కొండేటి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇంతవరకూ వచ్చిన పొలిటికల్‌ మూవీస్ కు భిన్నంగా ఉత్తేజభరితంగా, స్ఫూర్తిదాయకంగా ఈ సినిమా ఉండబోతోంది. దీనికి సంబంధించిన కథా చర్చలు తుది దశకు చేరుకున్నాయని, అతి త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియచేస్తామని సురేశ్ కొండేటి చెబుతున్నారు.

తన పుట్టిన రోజునాడే జన్మదినం జరుపుకోబోతున్న తెలంగాణ సినిమాటోగ్రఫీ, యానిమల్‌ హస్బెండరీ, ఫిషరీస్‌, డెయిరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్‌ మంత్రి, సోదర సమానులు శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సురేశ్ కొండేటి.

సురేశ్‌ కొండేటి నేపథ్యం:
రెండున్నర దశాబ్దాల క్రితం జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించి, ‘కృష్ణాపత్రిక’, ‘వార్త’ దిన ప్రతికలలో సినిమా జర్నలిస్ట్ గా విశేష అనుభవాన్ని సంపాదించుకున్న శ్రీ సురేశ్ కొండేటి, ఎవరు అడిగినా ఒక సహాయకస్ఫూర్తితో చిత్రపరిశ్రమలో ఒక తమ్ముడిగా, అన్నగా, అందరివాడుగా, మెగా పి.ఆర్.ఓ. గా తనదైన ముద్రని సంపాదించుకున్నారు. అలాగే సొంతంగా ‘సంతోషం’ సినీ వార ప్రతికను 2002 వ సంవత్సరంలో ప్రారంభించారు. ఆ వెంటనే సంతోషం ఫిల్మ్ అవార్డుల ప్రదానం మొదలుపెట్టారు. ఇవాళ సౌత్ లోనే ‘ఫిల్మ్ ఫేర్’ తర్వాత మళ్ళీ అంతటి క్రేజ్ ఉన్నది ‘సంతోషం సౌతిండియన్‌ ఫిల్మ్ అవార్డ్స్’ కే అంటే అతిశయోక్తి కాదు. 'చిత్రసీమలోని ప్రతి ఒక్కరూ తనను సొంత మనిషిగా భావించి, అక్కున చేర్చుకోవడం వల్లే ఇది సాధ్యమైంద’ని సురేశ్ కొండేటి చెబుతారు. 75 చిత్రాలను పంపిణీచేసిన అనుభవం సురేశ్ కొండేటిది. ఆ అనుభవంతోనే ‘ప్రేమిస్తే’ చిత్రంతో నిర్మాతగా మారారు. తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. దాదాపు పదిహేను చిత్రాలను తెలుగువారి ముందుకు తీసుకొచ్చిన సురేశ్ కొండేటి ఈ యేడాది 'శంభో శంకర', 'జనతా హోటల్‌' చిత్రాలను నిర్మించారు.

చిత్రసీమలోని ప్రతి ఒక్కరికీ తలలో నాలుకగా వ్యవహరించే సురేశ్ కొండేటి ‘సంతోషం’ పత్రికను క్రమం తప్పకుండా, గత పదిహేడు సంవత్సరములుగా ప్రచురించడంతో పాటు చిత్రసీమలోని అనేక సంస్థలలో అన్నీ తానై వ్యహరిస్తుంటారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫిల్మ్ అవార్డ్స్ కమిటీ సభ్యునిగా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కల్చరల్ కమిటీ ఛైర్మన్ గా, ఎఫ్.ఎన్.సి.సి. పాలకమండలి సభ్యునిగా, ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కల్చరల్ కమిటీ ఛైర్మన్ గా, ఆంధ్ర ప్రభుత్వ చిన్న చిత్రాల రాయితీ కమిటీ సభ్యునిగాను, ఇంకా మరెన్నో కార్యక్రమాలతో విశేష సేవలు అందిస్తున్నారు సురేష్ కొండేటి.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved