pizza
Sunita... 750 Not Out!
సునీత... 750 నాటౌట్‌!
You are at idlebrain.com > news today >
Follow Us

17 January 2017
Hyderaba
d

‘ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో..’ – ‘గులాబీ’ చిత్రంలోని ఈ పాటతో సుమధుర గాయని సునీత తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యారు. ఆ పాట నుంచి ఇప్పటి వరకూ కొన్ని వేల పాటలు ఆలపించారు. ఏ వేళలోనైనా సునీత పాటలు వింటే మనసుకి ప్రశాంతత లభిస్తుందని శ్రోతలు అంటుంటారు. భక్తి గీతాలు మొదలుకుని సినిమాల్లో పలు గీతాలు ఆలపించిన సునీత మంచి గాయని మాత్రమే కాదు.. వ్యాఖ్యాత, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ కూడా. పలు టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి, ఆయా కార్యక్రమాలకు వన్నె తీసుకొచ్చారు. పలు చిత్రాల్లో సునీత డబ్బింగ్‌ వలన కథానాయికల నటన మరింత ఎలివేట్‌ అయ్యిందంటే అతిశయోక్తి కాదు. పలువురు పరభాషా కథానాయికలకు గొంతు అరువిచ్చి, సినిమాల్లోని ఆయా సన్నివేశాల్లో భావోద్వేగాలను తన గాత్రంతో ప్రేక్షకులకు చేరువయ్యేలా చేశారు. ఈ సంక్రాంతికి విడుదలైన నందమూరి నటసింహం బాలకృష్ణ నూరవ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో కథానాయిక శ్రియ పాత్రకు సునీత డబ్బింగ్‌ చెప్పారు. తెలుగుజాతి ఘనతను సగర్వంగా చాటి చెప్పిన ఈ చిత్రం డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా సునీతకి 750వ సినిమా.

ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ – ‘‘బాలకృష్ణగారి కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రంలో నేనూ ఓ భాగం కావడం, చారిత్రక కథతో రూపొందిన ఈ చిత్రం నా 750వ చిత్రం కావడం అదృష్టంగా భావిస్తున్నా. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విడుదలైనప్పటి నుంచి పలువురు ఫోన్‌ చేసి డబ్బింగ్‌ బాగా చెప్పావని ప్రశంసిస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. దర్శకులు క్రిష్‌ ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తీయడంతో పాటు శ్రియ అద్భుతంగా నటించడంతో నేనూ బాగా డబ్బింగ్‌ చెప్పగలిగా. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా 750 చిత్రాలు పూర్తిచేసుకోవడం వెనుక దర్శక, నిర్మాతల ప్రోత్సాహం ఎంతో ఉంది. 750 చిత్రాల్లో ప్రతి సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత, ప్రతి టెక్నీషియన్‌... నా ప్రతిభని గుర్తించి ప్రోత్సహించినవారే. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా 750 చిత్రాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో నన్ను ఆదరించిన ప్రేక్షకులు, చలన చిత్ర ప్రముఖులందరికీ నా కృతజ్ఞతలు. భవిష్యత్తులోనూ ఇదే విధంగా ఆదరాభిమానాలు చూపిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు.

సునీత డబ్బింగ్‌ చెప్పిన సినిమాల్లో ‘ది బెస్ట్‌’ సెలక్ట్‌ చేయమంటే కష్టమే. ఒకటా.. రెండా... 750 సినిమాల్లో ఎన్నని ఎంపిక చేయగలం! అందుకే, మచ్చుకి కొన్ని సినిమాల పేర్లు:

1) జయం
2) చూడాలని వుంది
3) నిన్నే ప్రేమిస్తా
4) నువ్వు నేను
5) ఆనంద్‌
6) గోదావరి
7) హ్యాపీడేస్‌
8) మన్మథుడు
9) మల్లీశ్వరి
10) శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్‌.
11) మంత్ర
12) అనుకోకుండా ఒక రోజు
13) మనం
14) నేనున్నాను
15) ఆడువారి మాటలకు అర్థాలు వేరులే
16) శ్రీ రామదాసు
17) రాధాగోపాలం
18) శ్రీరామరాజ్యం

ఇప్పుడు... ‘గౌతమిపుత్ర శాతకర్ణి’

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved