pizza
YVS Chowdary tribute to NTR
You are at idlebrain.com > news today >
Follow Us

28 May 2017
Hyderabad

28, మే 2017, ఎన్‌. టి. ఆర్‌. 95వ జయంతి:

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ, డాక్టర్‌ స్వర్గీయ 'నందమూరి తారక రామారావు (ఎన్‌. టి. ఆర్‌.)' గారు ఎన్నో పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, సాంఘీక చిత్రాలలో నటించటమే కాక, ఆయా పాత్రలలో జీవించి, తన దివ్య మోహన రూపంతో ఎందరికో స్పూర్తి నిచ్చారు. అప్పటివరకూ CM, PM, MLA, MP, గవర్నర్‌ మరియూ రాష్ట్రపతి లాంటి రాజకీయ పదవుల్లోని తేడాపై ధ్యాసే పెట్టని తెలుగు ప్రజానీకానికి, తనకున్న తిరుగులేని జనాకర్షణ శక్తితో ఆత్మీయ 'అన్న'గా దగ్గరై, వాళ్ళల్లో రాజకీయ చైతన్యం తీసుకురావటమే కాక, ఆత్మగౌరవం నినాదంతో, అప్పటివరకూ 'మదరాసీ'లుగా పిలువబడుతున్న తెలుగుజాతికీ, తెలుగుభాషకీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపునీ తెచ్చారు. ఆయన తన పరిపాలనలో తీసుకున్న సంచలనాత్మక, విప్లవాత్మక నిర్ణయాలు మరియూ సంక్షేమ పధకాలు ఇప్పటికీ ఎందరో రాజకీయవేత్తలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.

కా'రణ'జన్ములు, యుగపురుషులు ఎప్పుడూ సందేశాలు ఇవ్వరు. కానీ, తమ తమ జీవనవిధానాల ద్వారా మనకి స్పూర్తినిచ్చే ఆశయాలని, మన మధ్య వదిలి 'భువి' నుండీ 'దివి'కి పయనమవుతారు. అలా ఆయన వదిలిన ఆశయాలలో మచ్చుకకి కొన్ని..
1. ఏ పనినైనా అంకితభావంతో చేయడం..
2. ఆ పని ఎంత కష్టమైనా ఇష్టపడి చేయటం..
3. అ పనిని సాధించటంలో మడమ తిప్పకుండా పోరాటం చెయ్యటం..

ఆయన ఆశయాల స్పూర్తితోనే నేను చలనచిత్ర పరిశ్రమకు వచ్చాను, నిలబడ్డాను. అందుకే నేనిక్కడ పొందిన కీర్తీ, సంపాదిస్తున్న ప్రతీ పైసా ఆయన account లో నుండీ draw చేసుకుంటున్నట్లే feel అవుతాను. నాకే కాదు, ఇక్కడ 'అమలాపురం'లోని రిక్షాపుల్లర్ నుండి, ఎక్కడో 'అమెరికా'లో ఉంటున్న సాఫ్ట్‌‌వేర్ ఇంజనీర్ వరకూ, ప్రపంచవ్యాప్తంగా.. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా, వివిధ రంగాలలో ఉన్న నాలా ఎంతో మంది తెలుగువాళ్ళను, తన ఆశయాల ద్వారా ఆయన స్పూర్తినిచ్చారు.

అంతే కాకుండా హైందవ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలచిన మహాభారత, భాగవత, రామాయణాల్లోని పాత్రలకు తన సినిమాల ద్వారా సజీవ రూపకల్పన చేసి మన కళ్ళముందు కదలాడారు. ఆ రోజుల్లో, తన 60 ఏళ్ళ వయస్సులో, మన తెలుగునాట ఉన్న గతుకుల రోడ్లల్లో, చైతన్యరధంపై కూర్చొనీ, నిలబడీ తిరుగుతూ, దారి పొడువునా ప్రతీ కిలోమీటరుకూ ప్రజల్ని వేలాదిగా, లక్షలాదిగా ఆకర్షిస్తూ, వాళ్ళల్లో తన ప్రసంగాల ద్వారా ఉత్తేజాన్ని, ఉద్వేగాన్ని నింపారు. భవిష్యత్తు ప్రజానీకం 'మానవమాత్రులకు ఇంతటి జనాకర్షణశక్తి సాధ్యమా' అని కలలో కూడా ఊహించలేని అసాధ్యాలను సుసాధ్యాలుగా మలుస్తూ ఒక కారణజన్ముడిలా, యుగపురుషుడిలా, ఓ దైవంలా అవతరించారు.

ఆయన నాకూ, నాలాగా ఎందరికో దైవసమానం. అందుకే నా స్వీయ చలనచిత్ర నిర్మాణ సంస్థ అయిన 'బొమ్మరిల్లు వారి' బేనర్‌పై నేను నిర్మించే ప్రతీ సినిమా.. 'మాదైవం'గా కొలుచుకునే ఎన్‌. టి. ఆర్‌. గారి ఫొటోపై 'ప్రార్ధనాగీతం'తో మొదలవుతుందీ, మళ్ళీ అదే ఫొటోపై 'కృతజ్ఞతాగీతం'తో పూర్తి అవుతుంది. ఆ విధంగా ఆయన్ని నేను ఎల్లప్పుడూ దేవుడిగానే పూజిస్తాను, ఆరాధిస్తాను. 'దివి' నుండీ ఆయన.. నన్నూ, నాలాంటి అభిమానుల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తూ ఉంటారనే మా ప్రగాఢ నమ్మకం. అటువంటి మహాపురుషుడికి ఇప్పటికైనా 'భారతరత్న' బిరుదునిచ్చి సత్కరించుకోవటం భారతప్రభుత్వ బాధ్యత అయితే, భారతీయులకు గర్వకారణం. 'అన్న' ఎన్‌. టి. ఆర్‌. గారి 95వ 'జయంతి' సందర్భంగా ఆయన్ని తలచుకుని, స్మరించుకోవటం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతీ తెలుగువాడు తనని తాను గౌరవించుకోవటంతో సమానంగా భావిస్తూ..
జై ఎన్. టి. ఆర్.
జై జై ఎన్. టి. ఆర్.
జోహార్ ఎన్. టి. ఆర్‌.

మీ
వై వి ఎస్‌ చౌదరి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved