pizza

"Missamma" naatakam in International Theater Festival
అంతర్జాతీయ నాటకోత్సవం, “Dream Up Festival 2016” లో సరసిజ సమర్పించిన మిస్సమ్మ రంగస్థల నాటకంl

You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

22 September 2016
Hyderabad

2016, మార్చ్ 27. ప్రపంచ రంగస్థల దినోత్సవం నాడు, “సరసిజ” సంస్థ, అలనాటి అత్యద్భుతమైన చిత్రం, తెలుగు చిత్ర సీమలో అజరామరమైన చిత్రం “మిస్సమ్మ” సినిమాని నాటకంగా మలచి మొట్ట మొదటి సారి వేదికనెక్కించిన రోజు. అది మొదటి ప్రదర్శనయితే , ఆ రోజు టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో వచ్చిన స్పందన అనూహ్యం. ప్రేక్షకులు చూపించిన అభిమానం ఇంకా ఇంకా ఎన్నో చేయాలన్న వారి కోరికని బలపరిచింది. కొత్త ఆశలకు ఊపిరి పోసింది. కానీ ఆ రోజు బహుశా ఊహించి ఉండదు వీరి బృందం, రాబోయే రోజుల్లో, ప్రపంచ రంగస్థలం వైపుగా వెళ్తారని. తెలుగు రంగస్థల చరిత్రలో ఒక చెదరని స్థానాన్ని సంపాదించుకోగలుగుతారని .

2016, సెప్టెంబర్ 16, 17, 18 ఈ మూడు రోజులు సరసిజ సంస్థకు పండుగ రోజులు. తెలుగు వారంతా గర్వించదగ్గ రోజులు. కారణం, రంగస్థలానికి కొత్త పుంతలు వేస్తూ , నాటకాలకి ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందిస్తూ , ప్రపంచంలో ఏ రంగస్థల కళాకారుడైనా ఇక్కడ ప్రదర్శన ఇవ్వాలని కోరుకునే వేదిక “Broadway Theaters”కి పుట్టిల్లు అయిన నగరం న్యూయార్క్. ఈ మహానగరంలో గత 7 సంవత్సరాలుగా ప్రతి ఏటా జరిగే పెద్ద పండుగలో ఈ ఏడు సరసిజ వారి “మిస్సమ్మ” నాటకం స్థానాన్ని సంపాదించడం. Theater For The New City మరియు Dream Up Festival సంయుక్తంగా నిర్వహించిన ఈ ఏడాది పండుగలో సరసిజ సంస్థ “మిస్సమ్మ” నాటకం వేదికనెక్కింది. ప్రపంచం నలు మూలల నుంచి వచ్చే కళాకారుల మధ్య , జర్మన్ , ఫ్రెంచ్ , జాపనీస్, ఇంగ్లీష్ వంటి ఇతర భాషల మధ్య ఒక తెలుగు నాటకం అమెరికన్ ప్రేక్షకులని గంటన్నర పాటు కదలనివ్వకుండా కూర్చోపెట్టగలిగింది అంటే అది సాధారణమైన విషయం కాదు.

మొదటి రోజు అడుగుల్లో చిన్న తడబాటు ఉన్నా , ఒకరికి ఒకరు సహాయం అందించుకుంటూ ఈ బృందం చేసిన శ్రమ మాటల్లో చెప్పలేనిది. రెండవ రోజు, సెప్టెంబర్ 17న వారి ప్రదర్శనలో అమితమైన ఆత్మవిశ్వాసం ప్రేక్షకుల చప్పట్లలో రుజువయింది . మూడవ రోజు, సెప్టెంబర్ 18న ప్రేక్షకుల చప్పట్లకి వారి కేరింతలు, నవ్వులు, ఈలలు మిస్సమ్మ జట్టు ప్రతిభకి నిదర్శనం.

“Never travelled path”, దారంటూ లేని చోట దారి వేసుకుని, రోడ్డు వేసుకుని నడిచి వచ్చి విజయపతాకాన్ని ఎగురవేసింది “మిస్సమ్మ” నాటకం. ప్రముఖ కథా , నవలా, నాటక రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి రచనలో, శ్రీమతి రాజేశ్వరి ఉదయగిరి దర్శకత్వంలో అత్యద్భుతంగా రూపు దిద్దుకున్న నాటకం “మిస్సమ్మ”. చిన్న పాత్ర, పెద్ద పాత్ర అని ఆలోచించుకోకుండా పూర్తి అంకిత భావంతో , ఎంతో శ్రమకోర్చి మొత్తం బృందం చేసిన కృషి ఎంతో అభినందనీయం.

ఒక పూర్తి స్థాయి నాటకం వేయాలంటే కేవలం నటనా పరంగా లేదా కాస్ట్యూమ్స్ పరంగా లేదా సెట్ ప్రాపర్టీస్ పరంగా మాత్రమే ధ్యాస ఆలోచన ఉంటాయి, చాలా వరకు తెలుగు నాటకాలకి. ఆ పరిధిని పెంచి అటు ఆడియో సిస్టం నించి ఇటు లైటింగ్ వరకు అన్నీ నాటకంలో ఉన్న వాళ్ళే తెలుసుకుని , నేర్చుకుని అద్భుతంగా , ఏ మాత్రం చిన్న పొరపాటు దొర్లకుండా నాటకానికి ఆసరాగా నిలబడ్డారు . ఈ బాధ్యతని విజయవంతంగా చేపట్టిన సుసర్ల ఫణీంద్రకి , జయ కళ్యాణి పెనుమర్తికి ప్రత్యేకమైన అభినందనలు. నాటకం ఎన్ని సార్లు ప్రదర్శించినా , వేసిన ప్రతిసారి కొత్త బలంతో , కొత్త ఒరవడితో ఆరోగ్యకరమైన పోటీతత్వంతో, మిస్సమ్మ (సావిత్రి) పాత్రధారిణి, రాజేశ్వరి ఉదయగిరి, M T Rao (NTR) పాత్రధారి, విజయ చంద్రహాస్ మద్దుకూరి, డేవిడ్ (రమణా రెడ్డి) పాత్రధారి, బాల ముకుంద్ కర్రి, రాజు (ANR) పాత్రధారి, శ్రీకాంత్ సముద్రాల, చూసే ప్రేక్షకులని మైమరపింప చేసే నటనని అందించారు. వీరికి ప్రత్యేక అభినందనలు. తమ వయసుకి మించిన పాత్రలైనా చక్కటి నటనతో , తమదైన ముద్రని వేసి, కేవలం నటనే కాదు భాషాపరంగా కూడా అలనాటి రోజుల్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన గోపాలరావు (SVR) పాత్రధారి, విజయ భాస్కర్ రాయవరం, రాజ్యం (ఋష్యేఏంద్ర మణి) పాత్రధారిణి, కళ్యాణి సిద్ధార్థ ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యారు. మిస్సమ్మ చిత్రంలో అతి కీలకమైన పాత్ర రేలంగి పాత్ర. ప్రతి కళాకారుడికి ధీటుగా, గట్టి పోటీ ఇచ్చి, తనదైన శైలిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు, ప్రసాద్ రాణి. నటనలో అమాయకత్వాన్ని చూపిస్తూ వయ్యారంగా, అందంగా తాను డాన్స్ చేస్తుంటే చూస్తున్న ప్రేక్షకులకి కూడా డాన్స్ చెయ్యాలనిపించేలా చేసిన గాయత్రి కందాడై, సీత (జమున) పాత్రలో ప్రేక్షకుల్ని సమ్మోహన పరిచింది. అసలు డైలాగులు లేకపోయినా కేవలం తన హావభావాలతో ప్రేక్షకుల్ని గోవింద్ (బాలకృష్ణ) పాత్రలో, కడుపుబ్బా నవ్వించారు, RJ Sree. పాత్రలు చిన్నవే అయినా ప్రేక్షకులకి ఎప్పటికి గుర్తుండిపోయేలా నటించారు పాల్ భార్యగా, జయ కళ్యాణి గారు , కృష్ణ అనే పాత్రలో, సుసర్ల ఫణీంద్ర.

“TEAM WORK” అన్న మాటకి చక్కటి నిదర్శనం “మిస్సమ్మ” నాటకం. ఇంత వరకు ఎన్నడూ ఎవరూ చెయ్యని ప్రయత్నాన్ని సరసిజ బృందం, విజయవంతంగా చేసి ప్రేక్షకుల మన్ననలు పొందింది.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved