pizza
Annamacharya 608th Jayanthi Utsavam Grand success
సిలికాన్ వ్యాలీలో అన్నమయ్యకు నాట్య సంగీత ఘననీరాజనం
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

2 June 2016
Hyderabad

సిలికానాంధ్ర నిర్వహించిన 608వ అన్నమాచార్య జయంత్యుత్సం వేడుకలు మే 28, 29, 30 తేదీలలో సిలికాన్ వ్యాలీ సన్నివేల్ హిందూ దేవాలయంలో ఘనంగా జరిగాయి. మే 28 మొదటి రోజున కోశాధికారి రవీంద్ర కూచిభొట్ల నేతృత్వంలో, వైస్ చైరమ్న్ దిలీప్ కొండిపర్తి సారధ్యంలో దేవాలయ ప్రాంగణాన్ని మరపించే స్థాయిలో నిర్మించిన సభావేదికపై ఉదయం 8 గంటలనుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఏకధాటిన సాగిన పిల్లల సంగీత పోటీల్లొ నూటికి పైగా ఆరు నుండి ఇరవై సంవత్సరాల లోపు పిల్లలు పాల్గొని ఆష్టొత్తర కీర్తనలను ఆలాపించారు. భావము, రాగము, లయ, శృతి, ఆలాపన మొదలైన ఆంశాలపై పరీక్షింపబడిన పిల్లలు ఈ పోటీకై ప్రత్యేకంగా శిక్షణ పొందినట్టు కార్యక్రమ సారధులు శీలా సర్వ, సదా మల్లాది, వాణీ గుండ్లవల్లి చెప్పారు. సముద్రానికి ఆవలనున్నను పిల్లలు భావశుద్ధి, గాత్రశుద్ధి పుష్కలంగా ఉండి పట్టుదలతో కృషి చేసినట్టు తెలుస్తుందని సిలికానాంధ్ర చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ తెలిపారు. ఆవ్వారి గాయత్రి, గాయత్రి సత్య, నేమాని సోమయాజులు, రేవతి సుబ్రహ్మణ్యం, సౌమ్యా సుబ్రహ్మణ్యం న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

సాయంత్రం అయిదు గంటలనుండి ప్రారంభమైన ఆరాధనోత్సవానికి ముఖ్య అతిధిగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్.వి.రమణ పాల్గొని ప్రపంచంలోని ప్రతి దేశంలో సిలికానాంధ్ర పేరు వినపడుతోందని అన్నారు. రమణ గారిని సిలికాంధ్ర వైస్ చైర్మన్ రాజు చామర్తి సత్కరించారు. మరొక అతిధి, టెక్ మహీంద్ర సంస్థ అధికారి ఏ.యస్.ప్రసాద్ భాగవతంలోని పద్యాలను వల్లేవేస్తూ తనకు తెలుగుపై మరియు సిలికానాంధ్ర సంస్థతో ఉన్న అనుబంధాన్ని పంచుకొన్నారు. ఆటు పిమ్మట జరిన కార్యక్రమంలో జ్యోతి లక్కరాజు కులుకగ నడవరొ కొమ్మలారా, పలుకు తేనెల తల్లి, నారయణతే నమో నమో మొదలైన కీర్తనలకు కన్నుపండుగగా కూచిపూడి నాట్యం చేసారు. జ్యోతి గారిని సిలికానాంధ వైస్ చైర్మన్ దిలీప్ కొండిపర్తి సత్కరించారు. చివరిగా మకుటాయామానంగా నిలిచిన అన్నమాచార్య సంకీర్తనార్చనలొ కర్ణాటక సంగీతంలో పేరొందిన హైద్రాబాద్ బ్రదర్సు లో ఒకరైన కళారత్న దారూరి శేషాచారి పూర్తిస్థాయి సంగీత కచ్చేరీ నిర్వహించి గానామృతంతో ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేసారు. రెండుగంటల పాటు జరిగిన కచ్చేరీలో అరుదైన అన్నమయ్య సంకీర్తనలతో రాగాలాపన, నెరవెల్, తనియావర్తనం మొదలైన ఆంశాలతో తోడి, షణ్ముఖప్రియ, హరికాంభోజీ మొదలైన రాగాలతో కీర్తనలు ఆలాపించి సభికుల్ని కట్టి పడేసారు. ఉదయపు పోటీల్లొ గెలుపొందిన చిన్నారులకు బహుమతులు అందజేసి సంగీతంలో ఇంకా పేరొందాలని ఆశీర్వదించారు. అనూరాధ శ్రీధర్ వయోలిన్, శ్రీరాం బ్రహ్మానందం మృదంగం సహకారం అందించారు.

మే 29 రెండవ రోజు వేడుక రాగయుక్తమైన కీర్తనలతో, నాట్య రూపాకాలతో నిండిపోయింది. ఉదయం 8 గంటలనుండి 'మనోధర్మ' పిల్లల సంగీత పోటీలు మొదలయ్యాయి. కేటాయించిన అయిదు నిమిషాల్లో ఒక కీర్తనలో రాగాలాపన, నెరవెల్, స్వరకల్పన, ముక్తాయింపు మొదలైన మెళకువలు ప్రదర్శించాలి. న్యాయనిర్ణేతగా వ్యవహరించిన కర్ణాటక సంగీతంలో పేరొందిన హైద్రాబాద్ బ్రదర్సు లో ఒకరైన కళారత్న దారూరి శేషాచారి వేసిన క్లిష్ఠమైన సవాలులకు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. పిమ్మట కూచిపూడి, భరతనాట్యాల్లో పిల్లలకు పోటీలు జరిగాయి. నాలుగింటి వరకు పేరొందిన కళాకారులు అన్నమాచార్య కీర్తనలతో బృంద నాట్యాలు, గానాలు చేసారు.

సాయంత్రం అయిదు గంటలనుండి కర్ణాటక సంగీట కచ్చేరీలు ప్రారంభమయ్యాయి. మొదటగా సంగీత కళాతపస్వి శేషయ్యశాస్త్రి తమ సుమధుర గాత్రంతో అన్నమాచార్యుని కీర్తనలతో 'నాద నీరాజనం' చేసారు. అనూరాధ శ్రీధర్ వయోలిన్, రవీంద్ర భారతీ మృదంగ సహకారం అందించారు. ప్రముఖ సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ తనయుడు, స్థానికంగా టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న గరిమెళ్ల అనిల్ కుమార్ గంటకు పైగా అన్నమయ్య కీర్తనలను ఆలాపించి సభికులను కట్టిపడేసారు. శశిధర్ వయోలిన్, రవీంద్ర భారతీ మృదంగ సహకారం అందించారు. చివరగా, కళాప్రవీణ నేమాని సోమయాజులు 'జల తరంగం' పేరిట పింగాణీ పాత్రల్లో నీరుపోసి, చిన్న కర్రలతో మీటుతూ రాగ తాళ యుక్తంగా అన్నమయ్య కీర్తనలను ధ్వనింపజేసారు. వీరికి శశిధర్ వయోలిన్, రవీంద్ర భారతీ మృదంగం, రవి గూటాల తబలా సహకారం అందించారు.

మే 30 మూడవ రోజున 8 గటలకు వైభవంగా రథయాత్ర జరిగింది. పూలమాలతో అలంకరించిన రథంపై శ్రీదేవీ, భూదేవీ సమేతుడైన వేంకటేశ్వర ఉత్సవ విగ్రహాల్ని పిల్లలు పెద్దలు అన్నమాచార్య సంకీర్తనలతో ఊరేగించారు. నిలువెత్తు అన్నమయ్య చిత్రపటాలను చేత పట్టుకొని సన్నీవేల్ నగరంలో మైలు దూరం నగర సంకీర్తన చేసారు. పిమ్మట, దేవాలయ సమావేశమందిరంలో వేయి గొంతుకలతో సప్తగిరి సంకీర్తనలను శ్రవణానందకరంగా పాడుతూ 'సహస్ర గళార్చన ' చేసారు. చెరుకుపల్లి శ్రీనివాస్ బృందం వీణావాదన, దివ్య సంగీత కళాశాల బృంద గీతాలు, నాదనిధి స్కూలు వారి అన్నమయ్య సంకీర్తనల ఆలాపనతో మధ్యాహ్నం రెండు గంటలకు ఉత్సవం ముగిసింది.

ప్రతి సంవత్సరం మెమోరియల్ డే వారాంతం మూడు రోజుల పాటు అన్నమాచార్య జయంత్యుత్సవం జరుగుతుందని సంగీత, నాట్య కళలతో, ఎక్కువ మంది కళాకారులు పాల్గొనేలా చేయడం సిలికానాంధ్ర ఆశయమని చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ వెల్లడించారు. మూడురోజుల ఉత్సవాన్ని ఘన విజయం చేసినందుకు అధ్యక్షుడు సంజీవ్ తనుగుల కృతజ్ఞతలు తెలిపారు. వంశీ నాదెళ్ళ, నారయణరాజు, ఆరుణ్ రాజ్ ఆడియో సహకారం అందించగా, సహకార్యదర్శి కిశోర్ బొడ్డు, ఉపాధ్యక్షుడు తాటిపాముల మృత్యుంజయుడు భోజనసదుపాయాలు అందజేసారు. కార్యదర్శి ప్రభ మాలెంపాటి పోటీల నిర్వహణ భాధ్యతను నిర్వర్తించారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved