pizza
విజయవంతమైన సిలికానాంధ్ర మనబడి సదస్సు 2014
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

29 July 2014
Hyderabad

సిలికానాంధ్ర మనబడి ఏడవ అంతర్జాతీయ సదస్సు 2014, సిలికాన్ వేలీలోని సాన్ హోసే పట్టణంలో విజయవంతంగా ముగిసింది. దాదాపు వందమంది మనబడి భాషాసైనికులు తమ విలువైన సమయాన్ని వెచ్చించి జూలై 18-19.20 తేదీలలో ఈ సదస్సుకి హాజరయ్యారు. మనబడి కులపతి చమర్తి రాజు నేతృత్వంలో శుక్రవారం నాడు కొన్ని సరదా జట్టుకట్టు ఆటలతో మొదలైన ఈ సదస్సు, శనివారం రోజున మనబడి నిర్వహించే వివిధ కార్యక్రమాల గత ఏడాది విజయాలు, సంకల్పంతోటి కొత్త ఆశయాలు, వివిధ జట్ల పరిచయాలు తర్వాత, మనబడి పాఠ్య ప్రణాళిక సభ్యులు శాంతి కూచిభొట్ల, ఓరుగంటి వేణు, తరగతులలో ఉత్తమ బోధనాపద్దతుల చర్చతో ఆద్యంతమూ ఉపయుక్తంగా సాగింది. ఈ ఏడాది మనబడి తల్లితండ్రులు ఇచ్చిన స్పందనని విశ్లేషించి, మేధోమథనలకి రంగం సిద్ధం చేశారు. మధ్యాహ్న సమయంలో మనబడి “అభిమాన అధిపతి” సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి, తన గౌరవ ప్రసంగంతో మనబడి సైనికులకి ఉద్యమ స్ఫూర్తిని కలిగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ తమ పిల్లలని రాబోయే విద్యాసంవత్సరంలో మనబడిలో చేర్చాలని పిలుపునిచ్చారు. ఆ సాయంత్రం “సిరివెన్నెల అంతరంగం” కార్యక్రమానికి మనబడి జట్టు హాజరై, ఆ సిరివెన్నెల తరంగాలలో సేద తీరింది. తర్వాత ఆదివారం రోజున పాఠ్యబోధన, ఉపాధ్యాయుల శిక్షణ, పరీక్షల నిర్వహణ, మనబడిలో తల్లితండ్రుల పాత్ర, పోర్టల్ విషయాలు, బాలరంజని, ఇంకా వివిధ అంశాలపై అందరూ మూడు గంటలపాటు మేధోమథన చర్చలు చేసి, భవిష్యత్ కార్యాచరణలో ఉపయోగపడే ఎన్నో విలువైన విషయాలని క్రోడీకరించారు. మనబడి అందించే ఇంకొక విశిష్ట కార్యక్రమం, పిల్లల అంతర్జాల పత్రిక “బాలరంజని” వచ్చే దసరా-దీపావళి సమయంలో తొలి విడుదలకి సిద్ధమవుతోందని, దానికి అందరి రచనలూ త్వరలో పంపమని, బాలరంజని సంధాత ఓరుగంటి వేణు కోరారు. ఇంకా ఈ సదస్సుకి ప్రముఖ భాషాశాస్త్రవేత్త డా. రావి రంగారావు “పిల్లలలో సృజన” అన్న అంశంమీద మరియు సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్ “తెలుగు 2020” అనే విషయంపై కీలక ప్రసంగాలనిచ్చి ఆహుతలకి స్ఫూర్తిదాయకమైన సందేశాలని అందించారు.

ఆద్యంతమూ తెలుగుదనంతో, ఉత్సాహంతో, బే ఏరియా సిలికానాంధ్ర మనబడి సైనికుల ఆప్యాయ ఆతిథ్యంతో, ఛలోక్తులతో, చలాకీగా సాగిన ఈ కార్యక్రమానికి పోలిశెట్టి లక్ష్మణ్ చలనచిత్ర సేకరణలో, గౌడ్ రామాపురం ఛాయాగ్రహణంలో సహకరించారు. కోట్ని జయంతి మరియు శ్రీరాంల ముఖ్య సమన్వయంతో , మనబడి ప్రాచుర్యం ప్రతినిధి రాయవరం భాస్కర్ నిర్వహణలో సాగిన ఈ కీలక సమావేశం ఎంతో విజయవంతమైనది అని, ఇటువంటి కార్యక్రమాలు మనబడి ఆశయ సాధనలో ఎంతో ప్రముఖపాత్ర పోషిస్తాయని మనబడి డీన్ రాజు చమర్తి తెలిపారు. ఇప్పటికే 30 రాష్ట్రాలు, పది విదేశాలలో సాగుతున్న మనబడి ప్రగతిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఇటువంటి సదస్సులో వివిధ ప్రాంతీయ కేంద్రాలలో నిర్వహించే అవకాశం ఉందని కోశాధికారి కొండుభట్ల దీనబాబు తెలిపారు.

వచ్చే విద్యా సంవత్సరానికి అయిదువేలమంది పిల్లలకి తెలుగునేర్పాలన్న తపనతో ఈ వేసవిలో "మనబడి ప్రభంజనం"అనే స్ఫూర్తిదాయకమైన సంకల్పంతో, తమ చేయీ చేయీ కలిపి "ఐదుపదులు చేద్దాం- ఐదువేలు తెద్దాం" అన్న నినాదాన్ని అందరూ ముక్తకంఠంతో పలికి తోటి తెలుగువారందరికీ పిలుపునిచ్చారు.

 


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved