pizza
Tantex 100 Nela Nela Telugu Vennela (Telugu Sahitya Vedika)
నృత్యాక్షరి నృత్యరూపకం తో వెల్లివిరిసిన టాంటెక్స్100వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు 
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

25 November 2015
Hyderabad

శ్రీ కృష్ణ దేవరాయల వారి నోటి వెంట జాలువారిన అమృత చినుకులు "తెలుగదేల యన్న.." అన్న ఆటవెలది పద్యం తెలుగు భాషను సర్వోన్నత శిఖరాలకు చేర్చింది.  మన కర్తవ్యం అంతా ఆ శిఖరాగ్ర స్థానాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడమే అన్న లక్ష్యంగా ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్), సంస్థను ప్రారంభించిన నాటినుండి 30 సంవత్సరాలుగా విశేష కృషి చేస్తున్నారు. తెలుగు భాషకు, సాహితీ వేత్తలకు ప్రత్యేకంగా ఒక వేదిక ఉండాలి అన్న అవసరం గుర్తించి, "నెల నెలా తెలుగు వెన్నల" అనే కార్యక్రమాన్ని ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ‘100 నెలలు’ నిరాటంకంగా నిర్వహిస్తూ, శనివారం, నవంబర్ 21, 2015 న డాలస్ నగరంలో "100 వ సాహిత్య సదస్సు" మహోత్సవాన్ని కన్నుల పండువగా జరుపుకొన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిధి, కళా రత్న శ్రీ కే వి సత్యనారాయణ గారు, విశిష్ఠ అతిధి శ్రీ వి యన్ ఆదిత్య గారు, టాంటెక్స్ కార్యవర్గం, పాలకమండలి సభ్యులు, సాహిత్యవేదిక సభ్యులు, సాహితీ వేత్తల జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభమైనది. టాంటెక్స్ అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహరెడ్డి మాట్లాడుతూ 100 నెలల క్రితం మొదలైన ఈ సాహితీ సౌరభం దిన దిన ప్రవర్ధమానం అవడం మన తెలుగు జాతి ఐక్యతకు నిదర్శనం అని, తెలుగు భాషాభిమానులు తోటకూర ప్రసాద్, పులిగండ్ల విశ్వనాథం, రావు కల్వల, యమ్ వి ఎల్ ప్రసాద్, మరియు డా. పుదూర్ జగదీశ్వరన్ 2007 లో ప్రారంభించిన ఈ సాహితీ యజ్ఞానికి ప్రముఖ సాహితీవేత్త వంగూరి చిట్టెన్ రాజు 'నెల నెలా తెలుగు వెన్నెల' అని నామకరణం చేసారని గుర్తు చేసారు. సంవత్సర ప్రధమార్ధంలో నిర్దేశించిన "ప్రగతి పధములో పది సూత్రాలు" ఒక్కొక్కటి క్రమంగా కార్యరూపం దాల్చడం, వాటిని నెరవేర్చడం చాల సంతోషంగా వుందన్నారు. నెల నెలా తెలుగు వెన్నెల "100వ సదస్సు" లో ఎంతో మంది పాల్గొని, భాషాభిమానాన్ని చాటిచెప్పారని కొనియాడారు.

శ్రీమతి చావలి మంజు హేమమాలిని సమర్పణలో గురు పరంపర డాన్స్ అండ్ మ్యూజిక్ స్కూల్ బాల బాలికలు జొన్నవిత్తుల గారు రచించిన 'జయ జయ మనోజ్ఞ జనని' గీతాన్ని మధురంగా ఆలపించి తెలుగు తల్లి వైభవాన్ని గొప్పగా వివరించారు. తెలుగు సాహిత్య వేదిక సమన్వయకర్త దండ వెంకట్ ప్రారంభోపన్యాసం చేస్తూ మన సాహితీ సంపదను కాపాడుకోవడానికి, సాహితీ పండితులను గౌరవించడానికి ప్రయత్నం ఒక ఎత్తయితే, వీటిని భావితరాలకు అందించడం అంతే ముఖ్యమని, ఈ సంవత్సంలో ఇంతవరకు దాదాపు 40 మంది బాల బాలికలు పాల్గొని తమ సాహిత్య ప్రతిభను ప్రదర్శించిన తీరును కళ్లకద్దినట్లు వివరించారు. మన భాష, సాహిత్యం విరాజిల్లేందుకు చేయి చేయి కలిపి అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. దొడ్ల రమణ పోతనను మించిన తెలుగు తనమున్నదా అంటూ, వారి శిష్య బృందంచే పోతన భావతంలోని పద్యాలను రాగయుక్తంగా పఠించి, సభలోని వారి అందరిచేత మన్ననలు పొందారు. శ్రీమతి కె బి లక్ష్మి "పేరడీ సూరీడు" జలసూత్రం రుక్మిణీ నాథ శాస్త్రి గారి గురించి మాట్లాడుతూ, ఆయనకు జారుక్ శాస్తి, రుక్కాయి లాంటి ఎన్నో కలం పేర్లు ఉండేవని, సంస్కృత, తెలుగు భాషల్లో గొప్ప పండితుడు అని, కవిత్వం, వచనం రెండింటి మీదా సమస్థాయిలో పేరడీలు రాసి సాహితీ దిగ్ధంతుల గుండెల్లో గుబులు పుట్టించిన ఘనుడు అని, శ్రీ శ్రీ మహాప్రస్థానం కవితా సంపుటికి చలం గారి చేత ముందుమాట రాయించడంలో ఆయన కృషిని కొనియాడారు.  జొన్నవిత్తుల గారు రచించిన 'చక్కర కలిపిన కమ్మని తీయని' గేయాన్ని శ్రీమతి ఓంకారి నిఖిత అత్యంత రమ్యంగా ఆలపించి తెలుగు భాషలోని తీయదనాన్ని రుచి చూపించారు. డా. పుదూర్ జగదీశ్వరన్ 'చాటు పద్య వైభవాలు' గురించి మాట్లాడుతూ "శ్రీనాథుడే కాక ఎంతో మంది చక్కటి చాటు పద్యాలు రాసారని, చాటు పద్యాలలో అంతర్లీనంగా చురుక్కుమనిపించే అర్ధాలు ఎంతో హాస్య ప్రధానంగా, అర్ధవంతంగా ఉంటాయి" అని వివరించారు. కోట ప్రభాకర్ 'తెలుగు పదానికి జన్మదినం' అంటూ చేసిన గాత్రం మన భాష పుట్టుకను గుర్తు చేసింది. వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా చారిటబుల్ సంస్థ అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు గారు “తెలుగులో పేరడీలు...పేరడీల లో హాస్యం, అపహాస్యం...” గురించి మాట్లాడుతూ పేరడీ అంటే వికటానుకరణ అర్థం అని, దానికి ఒక మాతృక అవసరం అని, ఆ మాతృకని అడ్డం పెట్టుకుని, అందులోని వస్తువుకీ రచనా పద్దతికీ మధ్య సమన్వయాన్ని భగ్నం చేసి హాస్యం సృష్టించడం, వ్యంగాస్త్రాలు సంధించడం పేరడీలో జరిగే పని అని వివరించారు. అలనాటి నన్నయ గారి పద్యాల నుంచి, శ్రీశ్రీ గారి విప్లవ కవితలు, దండకాలు, స్తోత్రాలు, ఈ నాటి సినిమా పాటల దాకా పేరడీ కి గురి కాని రచనా ప్రక్రియ లేనే లేదు అని అన్నారు.  శ్రీమతి వెంపటి హేమ రచించిన 'కలికి కథలు' అనే 50 కథల సమగ్ర సంపుటి వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా 59 వ ప్రచురణ గా ఈ ప్రతిష్టాత్మకమైన సదస్సులో ఆవిష్కరించబడినది. వేముల లెనిన్ మహాకవి శ్రీ శ్రీ గారు రచించిన మహాప్రస్థానం నుండి 'కవితా ఓ కవితా' కవితను తన సర్వ శక్తులూ కేంద్రీకరించి గ్రుక్క తిప్పుకోకుండా, అక్షరం పొల్లు పోకుండా, హావ భావాలతో చేసిన కవితా గానానికి అందరూ పరవశులై, మహాకవి శ్రీ శ్రీ కి నీరాజనాలు అర్పించారు. మనబడి విద్యార్ధులు 'మా తెలుగు కవులకు జోహార్' ఎంతో రమ్యంగా ఆలపించి కవులకు వందనాలు అర్పించారు. మద్దుకూరి విజయ చంద్రహాస్ 'కవితా పఠనం, కవితా గానం' గురించి ప్రసంగిస్తూ కవిత ఎప్పుడూ లో లోపల చదివేది కాదు, బయటకు చదివినప్పుడే ఆ భాషా సౌందర్యాన్ని గ్రహించగలము అని ఎన్నో విలువైన విషయాలను చెప్పారు. బాల బాలికలకు తెలుగు విద్యను అందించే 'మనబడి' కార్య నిర్వాహకులు రాయవరం భాస్కర్ 'పిల్లలలో మన సాహిత్యం పై ఆసక్తి రేకెత్తించడం' గురించి మాట్లాడుతూ ‘ఆశయం ఉన్నతమైతే అందరికి ఆదర్శం అవుతుంది’ అని పలికారు.  

విశిష్ట అతిధి శ్రీ వి యస్ ఆదిత్య గారు 'చలన చిత్ర సాహిత్యం లో మార్పులు' గురించి మాట్లాడుతూ "కొత్త సినిమాలు వస్తాయి, మారతాయి, కాని సాహిత్యం ఎప్పటికీ నిలిచి ఉంటుంది" అన్నారు.  రచయితలు సినిమాకు ఏది కావాలో అదే ఇస్తారు, వారిచేత మంచి రచనలు చేయించుకోవడం దర్శకుల భాద్యత అంటూ, మనసంతా నువ్వే, భైరవద్వీపం సినిమాలనుండి కొన్ని భాషకు ఉపయుక్తమైన సన్నివేశాలు గుర్తుచేసుకొన్నారు. వేటూరి సుందర రామమూర్తి గారితో తమ అనుభంధం గుర్తుచేసుకొంటూ ‘అటువంటి గొప్ప రచయితలు లేని లోటు సిరివెన్నల సీతారామశాస్త్రి గారి వలన కొంతవరకు తగ్గింది అని, తెలుగు సినీ రచయితలు అందరూ చక్కటి రచనలు చేయగలరు, వారికి అటువంటి సినిమాలను అందించే భాద్యత దర్శకులపై ఉంది’ అని గుర్తుచేశారు.  ఈరోజు 'డిజిటల్ రంగం' లో సాధించిన అభివృద్ధి చూస్తే, స్టూడియోలు లేకున్నా కూడా ఔత్సాహికులు చక్కని లఘు చిత్రాలను డిజిటల్ కెమెరా సాయంతో నిర్మించి తమ సత్తా చాటుకోవచ్చు అన్నారు. సాహిత్య వేదిక సభ్యురాలు శ్రీమతి అట్లూరి స్వర్ణ 100వ సదస్సు ఉత్సవం సందర్భంగా రూప కల్పన చేసిన "కలం" శ్రీ వి యన్ ఆదిత్య గారు ఆవిష్కరించారు.   

డా. రాళ్ళబండి కవితా ప్రసాద్ గారు రచించిన మాతృ భాషా దృశ్య సౌందర్య నృత్య రూపకం "నృత్యాక్షరి", ముఖ్య అతిధి, కళా రత్న శ్రీ కే వి సత్యనారాయణ గారి నృత్య దర్శకత్వం లో అమెరికాలో మొట్టమొదటి సారిగా ప్రదర్శించబడినది.

ఈ అక్షర యజ్ఞం చూసిన ప్రతి ఒక్కరి మనసు ఫలకాలపై చెరగని ముద్ర వేసింది.  నృత్యం మహేశ్వర స్వరూపం. అక్షరం పరబ్రహ్మ స్వరూపం. నృత్యాక్షరి ఈ రెండు స్వరూపాల సమ్మేళనం.సాంప్రదాయకంగా నాయకి నాయకులతో  కధాత్మకముగా సాగే ఎన్నో నృత్య  రూపకములు చూసాము, కానీ నృత్యాక్షరి వినూత్నమైనది. శబ్ధతమకమైన  ప్రపంచములో అక్షరములు ఎలా ఉధ్భవించినవొ, వాటి పరిణామమును  శాస్త్రీయ నృత్యముతో ప్రదర్సించడమే ఈ నృత్యాక్షరి.

పరమ శివుని తాండవం తరువాత అయన డమరుకములో  మ్రోగించిన శబ్ద విన్యాసమే అక్షరములు. అవి మన మాతృ భాషకు ప్రాణనాడులు.


మన మాతృ భాష గొప్పతనాన్ని కళ్ళకు  కట్టినట్లు ఈ నృత్యాక్షరి లో ప్రదర్సించిన తీరు మంత్రముగ్దులను చేసింది. భువనవిజయ సభలో  శ్రీ కృష్ణ  దేవరాయలకు పెద్దనామాత్యులు అక్షర అవిర్బావము గూర్చి వివరించినశైలి, కైలాసము లో  శివపార్వతుల ఆనందతాండవం తరువాత నందీశ్వరుడు కోరికమేరకు శివుడు 14 సార్లు డమరుకం మ్రోగించినంత అక్షరములు  ఏవిధంగా సృష్టించబడినవి,  ఈ అక్షరములు అచ్చులు, హల్లులు గా ఏ విధంగా రూపాoతరము చెందినవో, 
వాటి విశిష్టత ఎమిటో నృత్య రూపకం లో ప్రదర్శించిన విధానం సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.  శ్రీ కే వి సత్యనారాయణ గారి ఆధ్వర్యం లో దాదాపు 50 మంది స్థానిక చిన్నారులు, పెద్దలు ఐదు రోజులలోనే శిక్షణ తీసుకొని అద్భుతంగా ప్రదర్శన ఇవ్వడం ఎంతో ప్రశంసనీయం.
నృత్యాక్షరి లో పాల్గొన్న ప్రతి కళాకారునికి శ్రీ కే వి సత్యనారాయణ గారు ప్రశంసా పత్రాలు ఇచ్చి, గురువులకు సత్కారం చేసారు. 

శ్రీమతి అట్లూరి స్వర్ణ సభా ప్రాంగణాన్ని అలంకరణ చేసిన తీరు, పల్లకి, అన్ని అంశాలను మంచి ఆలోచనతో కూర్పు చేసిన పూర్వ సాహిత్య కార్యక్రమ చాయా చిత్రాలు అందరిని ఆకట్టుకున్నాయి. సాహిత్య వేదిక పూర్వ సమన్వయకర్తలు కన్నెగంటి చంద్ర, మల్లవరపు అనంత్, డా. ఊరిమిండి నరసింహా రెడ్డి, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, సింగిరెడ్డి శారద, ఆదిభట్ల మహేష్ ఆదిత్య ల సేవలను కొనియాడి సత్కరించారు.  100వ సాహిత్య సదస్సు సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, అంతా తెలుగు మయం, క్విజ్, ఫోటో కవిత పోటీలలో విజేతలకు టాంటెక్స్ కార్యవర్గం, సాహిత్య వేదిక సభ్యులు ప్రశంసా పత్రాలు అందచేసారు. పోతన పద్యాలను పిల్లలకు శిక్షణనిస్తున్న దొడ్ల రమణ గారిని శాలువ, జ్ఞాపిక తో సత్కరించారు. ముఖ్య అతిధి కళారత్న శ్రీ కే వీ సత్యనారాయణ గారిని ఉత్తరాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మరియు ఉపాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి శాలువాతో, అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి జ్ఞాపిక తో ఘనంగా సత్కరించారు. విశిష్ట అతిధి శ్రీ వి యస్ ఆదిత్య గారిని శాలువా, జ్ఞాపిక తో సత్కరించారు. సమన్వయ కర్త దండ వెంకట్ మాట్లాడుతూ 100 నెలలు ఒక యజ్ఞంలా 'నెల నెలా తెలుగు వెన్నెల' కార్యక్రం నిరాటంకంగా సాగడానికి కారకులైన సభ్యులకు, కార్యకర్తలకు, భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు, పోశకదాతలకు ధన్యవాదాలు తెలిపారు. నృత్యాక్షరి రూపకం విజయవంతం కావడానికి సహాయ సహకారాలు అందించిన కూచిపూడి నృత్య గురువులు శ్రీమతి శ్రీలత సూరి, శ్రీమతి పద్మ సొంటి, డా. కలవగుంట సుధ, శ్రీమతి చావలి మంజు హేమమాలిని, శ్రీమతి రూప బంద, శ్రీమతి యడ్లపాటి శ్రీదేవి గార్లకు ధ్యన్యవాదాలు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ9, టీవీ5, ఐనా టీవీ, సీవీఆర్ టీవీలకు కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు. .  

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved